20, జనవరి 2010, బుధవారం
వాటేసుకుందాం.. రా..
భాష అక్కరలేదు.. మనసులోని మాట చెప్పక్కర్లేదు.. అయినా.. మనలోని భావాలను ఎదుటిమనిషికి అందించగల ఒకే ఒక్క అస్త్రం.. కౌగిలింత. ఒక్కస్పర్శతో.. వేలాది భావాలను పలికించవచ్చు.. మనసులోని భారాన్ని దింపుకోవచ్చు.. సంతోషాన్ని పంచుకోవచ్చు. అన్నింటికీ మించి.. ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. అందుకే.. కౌగిలింతకు ప్రత్యేకంగా ఓ రోజు కూడా ఉంది.. జనవరి 20 వరల్డ్ హగ్గింగ్ డే..
మున్నాభాయ్ ఎంబీబీఎస్.. శంకర్‌దాదా ఎంబీబీఎస్.. కౌగిలింతల సీన్లు మీరు చూసే ఉంటారు. ఆ తర్వాత సన్నివేశాలనూ మీరు చూసే ఉంటారు.
ఎంతటి మనిషినైనా క్షణాల్లో మార్చేయగలుగుతుంది, ఎదుటివారి ఒత్తిడిని తగ్గించేయగలుగుతుంది కౌగిలింత. అందుకే.. వయస్సు తేడా లేకుండా.. స్త్రీపురుష బేధం లేకుండా.. ఎవరైనా కౌగిలిని ఆస్వాదించగలుగుతారు. ఒక్క మాట మాట్లాడకుండానే.. మనలోని ఫీలింగ్‌ను ఎదుటి మనిషి హృదయానికి నేరుగా పంపించేయగలుగుతుంది.. ఈ కౌగిలింత.
మనిషికో తీరు..
మనుషుల మధ్య మారే బంధాన్ని బట్టి దీని అర్థమూ మారిపోతుంది. ఓ తల్లి బిడ్డను కౌగిలించుకోవడం ద్వారా నేనున్నానంటూ భరోసా ఇస్తుంది. ఆ బిడ్డ బాధను మరిచిపోయేలా చేస్తుంది. అందుకే.. చిన్నపిల్లలు మాట్లాడితే అమ్మఒడిలోకి దూరిపోతుంటారు. ఈ విషయంలో తండ్రుల పాత్రా తక్కువేమీ కాదు. ఇక స్నేహితుల కౌగిలింతలో ఉన్న ఫీలింగ్ వేరు.. అందులోనూ చాలాకాలం తర్వాత ఎవరైనా కలుసుకుంటే.. ఒక్కసారిగా హత్తుకుపోతారు. ఆనందంతో పరవశించిపోతారు. ఒకరికొకరం తోడున్నామన్న సంకేతాలను ఫ్రెండ్స్ మధ్య ఈ ఆలింగనం పంపిస్తుంది. మానవబంధాల్లో అత్యంత అన్యోన్యతను చూపించేదే.. ఈ కౌగిలింత. ఇక స్పోర్ట్స్ విషయానికొస్తే.. ఈ బాడీటచ్కు ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. విజయం సాధించినా.. రికార్డు సృష్టించినా.. క్రికెట్లో వికెట్‌ను పడగొట్టినా... తోటి ఆటగాళ్ల కౌగిలిలో ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే.
ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. ప్రేమికుల గురించే. ఒకరికొకరు ఎదురయ్యారంటే మాత్రం.. ముందుగా కౌగిలించుకోవాల్సిందే.. ఒకరి కౌగిలిలోకి మరొకరు ఎప్పుడు వెళ్లిపోదామా అని ఎదురుచూస్తుంటారు. ఆ క్షణం రాగానే.. ఈ లోకాన్నే మరిచిపోతుంటారు. ప్రేమికుల మధ్య కోపతాపాలను దూరం చేసుకోవాలంటే.. దానికున్న ఒకే ఒక్క మందు.. ఈ కౌగిలింతే. ఎవరో ఒకరు ధైర్యం చేసి మరొకరిని హత్తుకున్నారంటే.. ఇక సమస్యలే ఉండవు..
కౌగిలింతకున్న క్రేజ్ ఎంతో. అందుకే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా.. అన్ని సినిమాల్లో.. ప్రేమ సన్నివేశాలు వచ్చాయంటే చాలు.. కచ్చితంగా.. ఒకటో రెండో ఇలాంటి సీన్లు ఉండాల్సిందే. డైలాగ్‌లు అవసరం లేకుండా.. ప్రేమ భావాలను పలికించగలగడంతో పాటు.. ప్రేక్షకులను కట్టిపడేసేది కాబట్టి.. ఈ కౌగిలింతకు ప్రతీ సినిమాలోనూ.. చోటు దక్కుతూనే ఉంది.
మంచి మెడిసిన్..
మానవసంబంధాలను మెరుగుపరచడంలో.. కౌగిలింత పాత్ర ఎంతో. హ్యూమన్ రిలేషన్స్ మాత్రమే కాదు.. మన శరీరంలోనూ ఎన్నో మార్పులనూ తెస్తుంది.. ముఖ్యంగా డిప్రెషన్‌ను తగ్గించడంతో.. దీన్ని మించిన మందు లేదు. కౌగిలి మనసు భాష మాత్రమే కాదు. మంచి మెడిసిన్ కూడా... ఒత్తిడిని దూరం చేయడంలో, ఆనందాన్ని రెట్టింపు చేయడంలో, కౌగిలి మంచి ఎక్స్పర్ట్ అని అనేక పరిశోధనల్లో తేలింది. అంతేకాదు.. మెడిసిన్స్ తగ్గించలేని మానసిక జబ్బులను కూడా.. ఒక్క హగ్‌తో దూరం చేసేయొచ్చు. ఇటీవల జరిపిన ఎన్నో పరిశోధనల్లో.. ఈ విషయమే స్పష్టమయ్యింది.
కౌగిలింత ఇద్దరు మనుషుల మధ్య.. ఆప్యాయతను, ప్రేమను మరింత పెంచుతుంది. దీనికి శాస్త్రీయమైన కారణమూ ఉంది. కౌగిలించుకున్నప్పుడు.. ఇద్దరు శరీరాల్లోనూ.. ఆక్సిటోన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుందని ఓ సర్వేలో తేలింది. ఒత్తిడిని తగ్గించే లక్షణం ఈ హార్మోన్ది. అందుకే.. ఆలింగనం చేసుకున్నప్పుడు.. ఎంతో రిలీఫ్ దొరుకుతుంది.
డిప్రెషన్‌తో ఉన్న వ్యక్తిని ఒక్కసారి గట్టిగా గుండెలకు హత్తుకోండి.. కాసేపట్లోనే.. ఆ వ్యక్తిలో మార్పును మీరు చూడొచ్చు. టచ్థెరపీలో డిప్రెషన్‌ను దూరం చేయడానికి ఉపయోగించే చిట్కా ఇదే. ఒక్కసారి ఆప్యాయంగా హత్తుకుంటే గుండె కొట్టుకునే వేగంలో కూడా తేడా వస్తుందట. అందుకే.. కౌగిలింతకు ఈ ట్రీట్మెంట్లో ఇంత ప్రాధాన్యం. ఆనందంగా.. హాయిగా ఉండాలంటే.. ఒకరినొకరు కౌగిలించుకోవాల్సిందే. పైగా.. ఖర్చులేని వ్యవహారం కూడానూ.. మీకు.. మీ సన్నిహితులకు మధ్య బంధాన్ని మరింత పెంచడంతో పాటు.. మిమ్మల్ని ఆరోగ్యంగానూ ఉంచుతుంది ఈ కౌగిలింత. అయితే.. ఇది ఆర్టిఫిషియల్‌గా చేయకుండా.. మనస్పూర్తిగా చేసినప్పుడే.. దాని లాభాలు అందుతాయి.
చిట్కా..
కౌగిలింతలోని ఉపయోగాలు తెలిసినా.. ఎవరెవరిని ... ఎలా కౌగిలించుకోవాలో తెలియదంటారా.. స్నేహితుల కౌగిలింతకూ.. ప్రేయసీ ప్రేమికుల కౌగిలింతకు.. ఎంతో తేడా ఉంది. దీన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే.. రకరకాల కౌగిలింతలను ఎదుటి వ్యక్తికి ఇచ్చేయొచ్చు. ఇంటర్నెట్లోనూ ఇలాంటి వీడియోలు ఎన్నో ఉన్నాయి... జస్ట్ క్లిక్ చేసి.. నేర్చుకోవచ్చు..
కౌగిలింత ఇచ్చేముందు కొన్ని చిట్కాలకు పాటిస్తే.. ఎదుటి వ్యక్తులు అభిమానాన్ని ఎక్కువగా పొందొచ్చు. కాన్ఫిడెంట్‌గా.. కేరింగ్‌గా హగ్ చేసుకోవాలి. మీ కౌగిలిలో ఉండే వ్యక్తి.. అన్నీ మరిచిపోయేలా ఉండాలి. ఉత్సాహంగా.. ఆనందంగా.. మీ సన్నిహితులకు కౌగిలించుకోండి..
ఇక ఈ కౌగిలింతల్లోనూ ఎన్నో రకాలున్నాయి. అందరినీ ఒకేలా కౌగిలించుకోలేం. రిలేషన్ బట్టి.. కౌగిలింత మారిపోతుంది. సంతోషాన్ని పంచుకోవడానికి ఒకలా.. డిప్రెషన్‌ను దూరం చేయడానికి మరోలా.. కౌగలించుకోవాల్సి ఉంటుంది.
వరల్డ్‌వైడ్‌గా హగ్గింగ్కు ఉన్న ఇంపార్టెన్స్ దృష్ట్యా రకరకాల కౌగిలింతలు ప్రాచుర్యం పొందాయి. వీటిని టైమ్లీగా ఉపయోగించే వాళ్లకే.. ఎక్కువమంది క్లోజ్ అవుతారు. అందుకే.. వెరైటీ హగ్స్‌ను ట్రై చేయాలి.
కౌగిలించుకోండి..
ఓ చిన్న కౌగిలింత తెచ్చిపెట్టే లాభాలేమిటో తెలిశాయి కదా.. ఇకనైనా.. మీ వారిని.. మీ చుట్టూ ఉన్నవారిని అవకాశం ఉన్నప్పుడల్లా మనస్పూర్తిగా కౌగలించుకోండి. వారికి తోడున్నామన్న భరోసా కల్పించుకోండి.. మీ ఒత్తిడిని కూడా తగ్గించుకోండి. హ్యూమన్ రిలేషన్స్ పెంచండి..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీ పోస్టు చాలా బాగుంది!
స్పర్శలో అనిర్వచనీయమైన అనుభూతి ఉంది!
మీ టపా నచ్చిందండి, ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది.
మున్నాభాయ్MBBS చిత్రం గుర్తుకువచ్చింది.
మంచి విషయాలు చెప్పారు.