18, జనవరి 2010, సోమవారం
బోరు బావికి పసిప్రాణం బలి
ఇరవై నాలుగు గంటల శ్రమ ఫలించలేదు. లక్షలాదిమంది వేడుకోలు నెరవేరలేదు. బోరుబావిలో చిక్కుకున్న చిన్నారి మహేశ్ మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలాడు. ఒక్కరోజంతా ఎందరినో ఉత్కంఠగా ఎదురుచూసేలా చేసిన.. ఆపరేషన్.. చివరకు చేదువార్తనే అందించింది. రెండేళ్ల పసికూనను.. బోరుబావి బలికొంది.
ఒకే ఒక్క చిన్న పొరపాటు రెండేళ్ల చిన్నారి మహేశ్‌కు ప్రాణాలను బలితీసుకొంది. వరంగల్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామ శివారులోని చంద్రూతాండకు చెందిన రవి.. తన పొలంలో బోరు వేయించాడు. అయితే.. నీళ్లు పడకపోవడంతో.. దాన్ని అలానే వదిలేశాడు. భవిష్యత్తులో జరిగే ప్రమాదాన్ని అతను ఊహించలేకపోయాడు. ఆదివారం సాయంత్రం.. రవి కొడుకు.. మహేశ్ ఆడుకుంటూ.. ఈ బోరుబావిలోనే పడిపోయాడు. దీంతో.. రవి కుటుంబం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. వేగంగా సహాయ చర్యలు మొదలయ్యాయి. మహేశ్ పడిపోయిన బోరుబావికి సమాంతరంగా మరో బావిని తవ్వి.. మహేశ్‌ను కాపాడడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. సింగరేణికి చెందిన మైన్స్ రెస్కూటీంను రప్పించారు. అర్థరాత్రి సమయంలో నైట్ విజన్ కెమెరా ద్వారా.. మహేశ్ కదలికలను తెలుసుకున్నరెస్క్యూ సిబ్బంది.. సురక్షితంగానే ఉన్నట్లు గుర్తించారు. అప్పటినుంచి సహాయక చర్యలు మరింత వేగవంతమయ్యాయి. బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తూ మహేశ్‌ను రక్షించడానికి శతవిధాలా ప్రయత్నించారు. బోరు బావిలో మహేశ్ ఉన్న ప్రాంతాన్నిగుర్తించిన రెస్క్యూ టీం.. అక్కడికి ఓ సొరంగాన్ని తవ్వారు. ఇక మహేశ్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. సరిగ్గా 24 గంటల తర్వాత.. మహేశ్‌ను సింగరేణి సిబ్బంది.. బయటకు తీసుకువచ్చారు. కానీ.. అప్పటికే.. ప్రాణాలను కోల్పోయాడు. అంతవరకూ ఎంతో ఆశగా ఎదురుచూసిన వారి గుండెలు.. బాధతో బరువెక్కిపోయాయి. ఎంతోమంది చేసిన ప్రయత్నాలు.. సహాయమూ.. చిన్నారి మహేశ్‌ను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి తోడ్పడలేకపోయాయి. నిన్నటివరకూ ఆడుతూపాడుతూ తిరిగిన మహేశ్.. విగతజీవిగా కనిపించేసరికి ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. మహేశ్ తండ్రి చేసిన పొరపాటే.. అతని కన్నకొడుకును దూరం చేసింది.
మనరాష్ట్రంలో ఎన్నో సంఘటనలు
బోరుబావిలో బాలుడు పడిపోయిన ఘటన రాష్ట్ర్రంలో తొలిసారి కడప జిల్లాలో జరిగింది. 1997లో ఈ సంఘటన జరిగింది. బ్రహ్మంగారి మఠం చెంచయ్యగారిపల్లెకు చెందిన నరసింహులు.. రెండేళ్ల వయస్సులో ఇంటిఆవరణలో ఉన్న బోరుబావిలో పడిపోయి.. పది అడుగుల లోతులో చిక్కుకుపోయాడు. బోరుబావికి సమాంతరంగా.. మరో గుంతను తవ్వి నర్సింహులును ప్రాణాలతో కాపాడారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం పొందిన సంఘటన ఫిబ్రవరి 16, 2002న మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది. కోస్గి మండలం చంద్రవంచ -నాంచారం గ్రామాల మధ్య పొలాల్లో ఉన్న బోరుబావిలో.. రామచంద్రయ్య అనే బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. అయితే.. అప్పట్లో ప్రొక్లేన్లు అందుబాటులో లేకపోవడంతో.. పక్కనే గొయ్యి తవ్వడం చాలా ఆలస్యమయ్యింది. దాదాపు మూడురోజులపాటు ఇలా గోతిని తవ్వారు. కానీ అప్పటికే.. రామచంద్రయ్య చనిపోయాడు.
నిజామాబాద్ జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామంలో పొలాల్లో వదిలేసిన బోరుబావిలో నాలుగేళ్ల చిన్నారి కవిత పడిపోయింది. 2007 ఏప్రిల్ 23న ఈ ప్రమాదం జరిగింది. చెరుకు నరకడానికి మెదక్ జిల్లా నుంచి.. దేవీసింగ్.. తన భార్యబిడ్డలతో వచ్చాడు. అంతా పనిలో ఉన్న సమయంలో కవిత.. బోరుబావిలో పడిపోయింది. విషయం తెలియడంతో.. అధికారులు ప్రొక్లేన్లు తెప్పించి.. కవితను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. దాదాపు 16 గంటలు సహాయక చర్యలు చేపట్టినా.. ప్రాణాలతో కాపాడలేకపోయారు..
ప్రకాశం జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. 2007 ఆగస్టు3న బొట్లగూడరు గ్రామంలో మంచినీటి కోసం తవ్వి వదిలేసిన బోరుబావిలో ఐదేళ్ల కార్తీక్ పడిపోయాడు. రెండు రోజుల పాటు.. కార్తీక్‌ను సురక్షితంగా వెలికితీయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ.. లాభం లేకపోయింది. చిన్నారి కార్తీక్.. బోరుబావిలోనే ప్రాణాలు వదిలాడు....
గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. ప్రతీచోటా ఒకేతీరు. అభంశుభం తెలియని చిన్నారులు.. ఆడుకుంటూ.. బోరుబావుల వద్దకు వెళ్లడం.. ప్రమాదవశాత్తు అందులో పడిపోవడం నిత్యకృత్యంగా మారిపోయింది. ముందు ఈ బావులను పూడ్చడానికి పట్టించుకోని వారంతా.. ఆ తర్వాత మాత్రం.. హడావిడి పడుతున్నారు.
దేశంలో కోకొల్లలు
పూడ్చివేయకుండా వదిలేసిన బావుల్లో.. చిన్నపిల్లలు పడిపోవడం ఎప్పటినుంచో ఉన్నా.. కొంతకాలంగానే ఈ రకమైన సంఘటనలకు విస్తృతమైన ప్రచారం లభిస్తోంది. 2006లో జరిగిన ఓ సంఘటన.. దానికి మీడియా ఇచ్చిన ప్రాధాన్యత.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసింది. జూలై 21, 2006న హర్యానాలోని కురక్షేత్రలో.. ప్రిన్స్ అనే చిన్నారి ఆడుకుంటూ.. బోరుబావిలో పడిపోయాడు. ఐదేళ్ల వయస్సున్న ప్రిన్స్‌ను రక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు.. ఆర్మీ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ప్రత్యేకంగా ప్రొక్లైన్లను తెప్పించి.. బోరుబావికి సమాంతరంగా పెద్ద గొయ్యిని తవ్వి.. ప్రిన్స్‌ను ప్రాణాలతో కాపాడారు. ఈ మొత్తం ఆపరేషన్‌కు దాదాపు 50 గంటల సమయం పట్టింది. సురక్షితంగా బయటపడడంతో.. ప్రిన్స్ తల్లిదండ్రుల ఆనందానికి హద్దేలేకుండా పోయింది.
మీడియా లైవ్ కవరేజ్ ఇవ్వడంతో.. దేశవ్యాప్తంగా ఈ సంఘటన హాట్‌టాపిక్ అయ్యింది. ఖాళీగా వదిలేసే బోరుబావులను మూసేయాలన్న డిమాండ్ కూడా ఈ సమయంలోనే తెరపైకి వచ్చింది. అయినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. మార్చి 11, 2007న గుజరాత్‌లోని భావనగర్ జిల్లాలో ఆర్తి అనే నాలుగేళ్ల అమ్మాయి బోరుబావిలో పడిపోయింది. ఆమెను కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మే 22, 2007న సునీల్ అనే మూడేళ్ల చిన్నారి... రాజస్థాన్‌లోని రణపాడ గ్రామంలో బోరుబావిలో పడిపోయాడు. జూలై27, 2007 జైపూర్ సమీపంలో సూరజ్ అనే ఆరేళ్ల చిన్నారి.. ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు. జనవరి 30, 2008న కర్నాటకలోని బుసనూరు గ్రామంలో బోరుబావిలో పడిపోయిన ఆరేళ్ల చిన్నారిని సురక్షితంగా కాపాడారు. మార్చి 25, 2008న ఆగ్రాసమీపంలో వందన అనే రెండేళ్ల చిన్నారి.. బోరుబావిలో పడిపోయింది. దాదాపు 45 అడుగుల లోతులో చిక్కుకుపోయి.. ప్రాణాలతో పోరాడింది. దాదాపు 26 గంటలపాటు శ్రమించిన తర్వాతగానీ.. ఆమెను కాపాడడం సాధ్యం కాలేదు.
మరికొన్ని నెలలకే.. అంటే.. అక్టోబర్9, 2008న ఆగ్రా సమీపంలో బోరుబావిలో పడి.. సోను అనే చిన్నారి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. జూన్ 20, 2009న రాజస్థాన్‌లోని దౌసా గ్రామంలోనూ అంజు అనే నాలుగేళ్ల అమ్మాయి పూడ్చకుండా ఉంచిన బావిలో పడిపోయింది. దాదాపు 21 గంటలపాటు ఆ మృత్యుకుహరంలో మగ్గిన తర్వాత గానీ.. ఆమె బయటపడలేకపోయింది.
నవంబర్9, 2009 న జైపూర్‌లో బోరుబావిలో పడ్డ సాహిల్ అనే ఐదేళ్ల చిన్నారిని అధికారులు కాపాడలేకపోయారు. రక్షించడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు మృతదేహాన్ని మాత్రమే వెలికి తీయగలిగారు. ఇలా వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొన్ని మాత్రమే. ఎంతోమంది.. బోరుబావుల్లో పడి.. విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులకు కడుపుశోకం మిగుల్చుతున్నారు.
ప్రమాదాలను అరికట్టే మార్గం లేదా...
బోరు బావుల తవ్వకాలను నియంత్రించడానికి మనరాష్ట్రం వాల్టా చట్టాన్ని 2002లోనే అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం.. బోరుబావి తవ్వేముందు తహసీల్దారుకు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలి. కానీ.. ఎక్కడా ఈ పద్దతి అమలు జరుగుతున్నట్లు కనిపించదు. పొలాల్లో సాగునీటికోసం.. విచ్చలవిడిగా బోర్లను తవ్వుతున్నారు. బోరు తవ్వడానికి ఖర్చుపెట్టే రైతులు.. తీరా నీళ్లు పడకపోవడంతో.. వాటిని పూడ్చడానికి ఏమాత్రం ప్రయత్నించడం లేదు. డ్రిలింగ్ మిషన్ యజమానులు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. తీయడం వరకే తమ పని అన్నట్లు వెళ్లిపోతున్నారు. అందుకే.. చాలా పొలాల్లో.. ఖాళీ బోరుబావులు వందలకొద్దీ దర్శనమిస్తాయి. ఇలాంటి వాటిలోనే.. మహేశ్ లాంటి చిన్నారులు పడిపోతోంది. ఇక వాల్టా చట్టాన్ని సమర్దవంతంగా అమలు చేయాల్సిన అధికారులు కూడా ఈ బోర్లను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.
బోరుబావుల్లో చిన్నారులు పడి.. ప్రాణాలు పోగొట్టుకోవడంపై.. సుప్రీకోర్టు ఎప్పుడో స్పందించింది. అన్ని రాష్ట్రాలకూ నోటీసులూ ఇచ్చింది. పనికిరాకుండా ఉన్న బోర్లను పూర్తిగా మూసివేయాలని.. చీఫ్ జస్టిస్ కె.జి.బాలకృష్ణన్, జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ కే.ఎస్.రాథాకృష్ణన్లతో కూడిన ధర్మాసనం గత ఏడాది నవంబర్ 27న ఆదేశాలు జారీ చేసింది. అయితే.. దీనిపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకూ పెద్దగా స్పందించలేదు. ఒక్క రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కఠినమైన చట్టాన్ని రూపొందించింది. బోర్లు వేసి ఖాళీగా వదిలేసిన వారిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేలా చట్టం చేసింది. దీంతో అయినా.. బోరుబావుల ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇక మనరాష్ట్రం విషయానికొస్తే... ఈ తరహా పరిస్థితులు కనిపించవు. కనీసం ఏ గ్రామంలో ఎన్ని బోర్లు పనిచేస్తున్నాయో.. ఎన్ని పనిచేయడంలేదో అన్న లెక్కలూ ఉండవు. దీనిపైనే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంది. అనవసర బోర్లను తవ్వకుండా చూడడంతో పాటు.. ఖాళీగా వదిలేసిన బోరుబావులను పూడ్చేయడానికి చర్యలు చేపట్టాలి. బోర్లను తవ్వించే వారిని, డ్రిల్లింగ్ మెషిన్ యజమానులను ఈ విషయంలో బాధ్యులను చేయాలి. నీళ్లు పడని బోర్లను పూడ్చివేయకపోతే.. కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని సైతం రూపొందించాలి. అప్పుడే.. మహేశ్‌లా మరెవరూ.. ఇలా ప్రమాదంలో చిక్కుకుపోరు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
జాగ్రత్త తీసుకోవటం అనేది ఎవరు నేర్పగలరు మనకి. ఇలా ఒక పసివాడి ప్రాణం బలికావటం ఇదేమి మొదటిసారి కాదు. ఎవరికి వాళ్ళు మనకి జరగదులే అనుకోవటమే దీనికి కారణం. బోరు బావులు తవ్వే పరికారాలలో ఎప్పటికప్పుడు ఆ బోరు ను తాత్కాలికంగా మూసేసే ఏర్పటు ఉండితీరాలి. అటువంటి ఏర్పాటు స్వచ్చందంగా బోరుబావులు తవ్వేవారు పాటించి తీరాలి. ఏ ఊళ్ళో ఈ పని జరుగుతుంటే ఆ ఊరివాళ్ళు ఇటువంటి పనులమీద ఒక కన్నేసి ఉంచి ఆ బావి తవ్వేవాళ్ళు, తవ్వించేవాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త తీసుకునేలా చేయాలి.
లేకపోతే ఇలాంటి సంఘటనలు మళ్ళి మళ్ళి జరుగుతాయి. టి.వి వాళ్ళకి ఒక వార్త రోజల్ల చూపించటానికి. ఇలా రోజల్లా చూపించుకోవటమే కాకుండా టి వి వాలు బోరు బావులు తవ్వేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలమీద తప్పనిసరిగా ఈ టి వి వాళ్ళు ప్రచారం చేయాలి. ఛేస్తారా వీళ్ళు.
అనుమానమే.
పాపం మహేష్. తలచుకుంటేనే గుండె బరువెక్కుతోంది. May his soul rest in peace.
దేశంలోని మిగితా ప్రదేశాల్లో నదులు అందుబాటులో లేకపోవచ్చు. కాని, నదీ జలాలు పుష్కలంగా ప్రవహించే తెలంగాణంలో ప్రభుత్వం సక్రమంగా వాటిని అందుబాటులోకి తెచ్చిఉంటే, పేద లంబాడ రైతు తన కొద్దిపాటి పొలం కోసం అప్పు చేసి, బోరు తవ్వించుకోవడం, అదీ విఫలమై అతని కుమారుడు రెండేళ్ళ ’ మహేశ్ ’ పాలిట మృత్యుపాశం కావడం జరిగేదా ?