5, జనవరి 2010, మంగళవారం
అంతా చిదంబర రహస్యం
Categories :
ఎప్పుడెప్పుడా అని తెలంగాణావాదులు, సమైక్యతావాదులు నిరీక్షిస్తున్న అఖిలపక్ష సమావేశం ముందుగా నిర్దేశించినట్టే మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. ఢిల్లీలో హోంమంత్రిత్వశాఖ ప్రధాన కార్యాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ముగిసింది. అపోహలు తొలగించేందుకు, సామరస్యంగా చర్చల ద్వారా ప్రజాస్వామిక పద్ధతిలో సమస్యకు పరిష్కారం చేసుకోవచ్చునన్న హోంమంత్రి చిదంబరం సందేశంతో సమావేశం ప్రారంభమైంది. ఎనిమిది పార్టీల ప్రతినిధులూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలన్న హోంమంత్రి విజ్ఞప్తి మేరకు అందరూ తమ అభిప్రాయాలు వెల్లడించినట్టు తెలుస్నుది. ముందుగా ప్రశాంత వాతావరణాన్ని రాష్ట్రంలో పునరుద్ధరించాలని, అందుకు అందరూ తోడ్పడాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా సమస్య పరిష్కారానికి ఒక కమిటీని వేయాలని వచ్చిన సూచనను టి.ఆర్.ఎస్. తిరస్కరించగా, కమిటీ వేశాకే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని సమైక్యవాదులు పేర్కొన్నట్లు తెలిసింది.
పార్టీ ప్రతినిధుల మాటేమిటి?
ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం వివిధ పార్టీల నాయకులు మీడియాతో మాట్లాడారు. సమావేశంపై వారీ విధంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని అఖిలపక్షం తరఫున విజ్ఞప్తి చేస్తున్నానని ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయని, మౌఖికంగా అందరి అభిప్రాయాలు చెప్పామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సాధారణ స్థాయికి చేరిన తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ తరఫున చర్చల్లో పాల్గొన్న ఆయన తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టుల ప్రమేయం వాదనను ఖండించామన్నారు. తెలంగాణపై చర్చలకు గడువు విధించాలని కోరామన్నారు. సమావేశం ఎందుకు పెట్టారో తెలియడం లేదన్నారు తెలుగుదేశం ప్రతినిధిగా హాజరైన యనమల రామకృష్ణుడు. కాంగ్రెస్ చేతగానితనం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టమని కోరామని, కాంగ్రెస్ మాత్రం తన విధానం చెప్పలేదన్నారు రేవూరి ప్రకాశ్‌రెడ్డి. చర్చలు అవసరం లేదని చెప్పామని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కేంద్రం ప్రకటనపైనే ఆధారపడి ఉన్నాయన్నారు బండారు దత్తాత్రేయ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి జరుగుతుందన్నారు భాజపా నేత హరిబాబు. అందరి అభిప్రాయాలను ప్రధానికి వివరించి నిర్ణయం చెబుతామని చిదంబరం హామీ ఇచ్చారని హరిబాబు అన్నారు. చర్చల ప్రక్రియ సజావుగా జరిగిందని, రాష్ట్రంలో పరిస్థితిని సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. అన్నివర్గాల అభిప్రాయాల తర్వాతే కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సూచించామన్నారు. సమావేశంలో అభిప్రాయ సేకరణ మాత్రమే జరిగిందని, వూహించిన విధంగా నిర్ణయం రాలేదని చిరంజీవి అన్నారు. తదుపరి చర్చలు, అభిప్రాయాల సేకరణ కొనసాగింపునకు కమిటీ వేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాలని సూచించామన్నారు ఎంఐఎం పార్టీకి ప్రాతినిధ్యం వహించిన అసదుద్దీన్ ఒవైసీ.
చిదంబరం మాటేమిటి?
అఖిల పక్ష సమావేశానంతరం కేంద్ర హోంమంత్రి చిదంబరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని సమస్య పరిష్కారానికి అక్కడి పార్టీలకు సహకరించాలన్నదే కేంద్రం అభిమతమని చిదంబరం అన్నారు. సమావేశంలో అన్ని పార్టీలూ చర్చలు జరగాలనే కోరుకుంటున్నాయనీ, ఎవరూ చర్చలకు అభ్యంతరం చెప్పలేదని అన్నారు. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా అన్ని పార్టీలు, ఐక్య కార్యాచరణ వేదికలూ తోడ్పడాలని చిదంబరం చెప్పారు. ప్రధాని, కేబినెట్ సహచరుల అభిప్రాయాలు తీసుకున్నాకే తదుపరి చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు. సమావేశంలో మాత్రం తుది ప్రకటనను చిదంబరం చేయలేదు.
ప్రకటన కోసం ఎదురుచూపు: కేసీఆర్
సమావేశంలో తాము చెప్పాల్సిందే చెప్పామన్నారు తెరాస అధినేత కె. చంద్రశేఖరరావు. కేంద్ర అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత స్పందిస్తామని ఆయన అన్నారు. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు చిదంబరంతో ఆయన భేటీ కానున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి