24, డిసెంబర్ 2009, గురువారం
మార్పంటే.. ఇదీ..
ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం ఇచ్చే దిశలో గుజరాజ్ ప్రభుత్వం కదులుతోంది. ఎన్నికల సంస్కరణలను అత్యంత వేగవంతం చేయడమే కాదు.. దేశంలోనే సరికొత్త ప్రయోగాలకూ నాంది పలుకుతోంది. ఎప్పటినుంచో చర్చల దశలోనే ఉన్న నిర్భంధ ఓటింగ్‌ను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఇటీవలే రికార్డు సృష్టించింది గుజరాత్. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనింపచేస్తున్న ముఖ్యమంత్రి నరేంద్రమోడిదే ఈ క్రెడిట్ అంతా. తొలిదశలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విధానం అమలవుతుంది. ప్రతీ ఎన్నికల్లోనూ.. పోలింగ్ శాతం తగ్గిపోతున్న దశలో మోడి తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి బలోపేతం చేసేది. అయితే.. ఎవరూ నచ్చలేదు అన్న ఆప్షన్‌ను ఈవిఎంలోను, బ్యాలెట్ పేపర్‌లోనూ ఉంచుతారా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు.
కేవలం దీంతోనే మోడి ఆగడం లేదు. నిర్బంధ ఓటింగ్ ద్వారా ప్రజలందరినీ.. ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తున్న ఆయన.. రైట్ రీకాల్ అధికారాన్ని కూడా ప్రజలకు కట్టబెడుతున్నారు. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు ఇప్పటికే తయారై.. మోడి ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. దీన్ని కూడా ప్రయోగాత్మకంగా స్థానిక సంస్థల్లోనే అమలు చేయనున్నారు. నియోజకవర్గంలోని మూడో వంతు ఓటర్లకు ఎన్నికైన ప్రజాప్రతినిధి నచ్చకపోతే.. దానికి సరైన కారణాలను చూపించి రీకాల్ చేయొచ్చు. ఎన్నికను రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు దఖలు పడుతుంది. అయితే.. ఓటర్ల ఫిర్యాదుపై నిష్పక్షపాత విచారణ జరిపిన తర్వాతే.. కలెక్టర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో ఈ రైట్ టు రీకాల్ విధానం అమలవుతోంది. గుజరాత్ కూడా అమలు చేసిన తర్వాత.. మిగిలిన రాష్ట్రాలు అదే దారిలో పయనించవచ్చు. అదే జరిగితే.. ఎన్నికైన తర్వాత.. ఐదేళ్లకు గానీ ప్రజలకు మొఖం చూపించిన రాజకీయనాయకుల పద్దతి మారొచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి