30, డిసెంబర్ 2009, బుధవారం
నా పేరు నరసింహా...
‘గవర్నరంటే రబ్బర్‌స్టాంప్! ఆయనకు ఎలాంటి నిర్ణయాధి కారాలు లేవు!! ఒకరకంగా ఉత్సవ విగ్రహం. వినతి పత్రాలు స్వీకరించడం, హామీలివ్వడానికే ఆయన పరి మితం!!! రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెప్పింది చేయడమే తప్ప స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు’. ఇప్పటివరకూ సాధారణ ప్రజలు, రాజకీయ వర్గాల్లో గవర్నర్‌పై ఉన్న తిరుగులేని నిర్దిష్ట అభిప్రాయమిది. కానీ..కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విషయంలో మాత్రం అలాంటి అభిప్రాయాలను మార్చుకోక తప్పదు. ఎందుకంటే గవర్నర్‌గా వచ్చింది ఆషామాషీ వృద్ధ రాజకీయవేత్తనో, రాజకీయ నిరుద్యోగో కాదు. కఠిన నిర్ణ యాలు తీసుకుని, శరవేగంగా స్పందించే మాజీ పోలీసు అధికారి. మొన్నటి వరకూ ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసిన అనుభవం ఉన్న క్రియాశీల గవర్నర్. అందుకే ఇంతటి కలవరం. కలకలం. ఆయనను తక్షణం మార్చాలన్న శరపరంపరమైన డిమాండ్లు అప్పుడే తెరపైకి వస్తున్నాయి. అవును.. ఇవన్నీ కొత్తగా వచ్చిన ఇఎస్‌ఎల్ నరసింహన్ గురించే!
ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్.. ఆయన తాత్కాలిక గవర్నర్‌గా ప్రమాణం చేసి ఇంకా 48 గంటలు కూడా కాలేదు. కానీ అప్పుడే అందరికీ కలవరం కలిగిస్తున్నారు. మావో నేత మల్లోజుల కోటేశ్వరరావు ఆయన గురించి చేసిన వ్యాఖ్యలు, చెప్పిన నేపథ్యమే ఇంత కలవరానికీ కారణం. ఫలితంగా.. తాత్కాలిక గవర్నర్‌గా వస్తేనే ఇంత ఆందోళన కనిపిస్తుంటే, ఇక పూర్తి బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితి మరెంత కలకలం సృష్టింస్తుందోనన్న వాస్తవం తాజా పరిస్థితిని స్పష్టం చేస్తోంది. రిటైర్డ్ ఐపిఎస్ అధికారి, ప్రస్తుతం చత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా వ్యవహిస్తోన్న నరసిం హన్‌కు అక్కడి మావోల ఉద్యమాన్ని సమర్ధవంతంగా అణచివేసిన రికార్డు ఉంది. అదొక్కటే కాదు. ఇంటెలిజన్స్ దళపతిగా ఉంటూ ఆదివాసీల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన చరిత్ర కూడా ఉంది. వీటిని మావో అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు తెరపైకి తీసుకురావడమే ఇంత భయాందోళనకు అసలు కారణంగా కనిపిస్తోంది. మామూలు గవర్నర్లకు భిన్నంగా.. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల తర్వాత ఏకంగా ముఖ్యమంత్రినే రాజ్ భవన్‌కు పిలిపించుకుని శాంతిభద్రతలపై పోలీసుల యంత్రాంగంతో సమీక్ష జరపడంతో, నరసింహన్ రాజ్‌భవన్‌కే పరిమితమయ్యే ఆషామాషీ గవర్నర్‌గా ఉండబోరన్న విషయం స్పష్టమయింది.
అప్పుడే వద్దన్న డిమాండ్
మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న చత్తీస్‌గఢ్‌కు పూర్తిస్థాయి గవర్న ర్‌గా కొనసాగుతున్న నరసింహన్, తనదైన శైలిలో శరవేగంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించడంతో వణుకు ప్రారంభమయింది. ప్రత్యేక తెలం గాణ ఉద్యమ నేపథ్యంలో.. నెలరోజులుగా అట్టుడుకుతున్న రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తుండటంతో కేంద్రం నరసింహన్‌ను ఇన్‌ఛార్జి గవర్నర్‌గా నియమించడం, ఆయన వచ్చీరాగానే క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమయింది.
శాంతిభద్రతలపైనే దృష్టి
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించిన గవర్నర్ వచ్చీ రాగానే ముఖ్యమంత్రి, హోంమంత్రి, డిజిపితో చర్చలు జరపడం, శాంతిభద్రతలపైనే ఎక్కువ దృష్టి సారించడంతో పాటు.. అందుబాటులో ఉన్న పోలీసు దళాలు, వాటి సంఖ్య వివరాలు తెలుసుకోవడం వంటి చర్యలు ఆయన భవిష్యత్ వైఖరిని స్పష్టం చేస్తున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘రాజకీయ పరమైన నిర్ణయాలు వచ్చే వరకూ ఎదురుచూడవద్దు. ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి రావాలి.ముందు మీరు భధ్రతపై ప్రజల్లో నమ్మకం కల్పించండి’ అని నరసింహన్ తన తొలి భేటీలో స్పష్టం చేసినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కలవరానికి కారణం ఇదీ..
స్వతహాగా ఐపిఎస్ అధికారి కావడం, చత్తీస్‌ఘడ్ వంటి మావోల సమస్యాత్మక రాష్ట్రాల్లో పనిచేస్తున్న అనుభవం ఉండటంతో నరసింహన్ వ్యవహారశైలిపై ఉద్యమకారులకు ఆందోళన కలగడానికి కారణంగా కనిపిస్తోంది. దానికి తోడు కేంద్రం ఆయనకు పూర్తి అధికారాలు ఇచ్చిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు యధాతథ స్థితికి తెచ్చేందుకు కావలసిన స్వేచ్ఛ ఇచ్చిందన్న అనుమానం ఉద్యమ సంస్థల్లో బలంగా నాటుకుపోయింది. ఐపిఎస్ అధికారి కావడంతో ఉద్యమాలను అణచివేసే స్వభావం సహజంగా ఉంటుందని, దానికి రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న అధికారాలు అదనపు బలంగా మారే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన అంటూ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అంతవరకూ వేచిచూసే అవసరం లేకుండానే నరసింహన్ తన పనితీరు, నిర్ణయాల ద్వారా అందరికీ అర్ధమయ్యేలా చేస్తారన్న అంచనాలు ఉన్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఇన్నాళ్ళకి కేంద్రం ఒక మంచి పని చేసింది..రాష్త్రం రావణ కాష్టంలా కాలిపోకుండా మన లక్ష్మీ నరసిమ్హన్ గారు చూస్తారని ఆశిస్తూ ...
తెలుగు ప్రజలందరం ఆయనకు సాదర స్వాగతం పలకాలి..