30, డిసెంబర్ 2009, బుధవారం
ఈశ్వరీబాయి ఆవేదన
సభ ముందున్న కార్యక్రమం మనముందు ఎవరు పెట్టారో తెలియదు. ముఖ్యమంత్రిగారు పెట్టారో, మరొకరు పెట్టారో తెలియదుగాని పేరు లేకుండా ఇక్కడకు వచ్చింది. ఇది వరలోఅష్ట సూత్ర పథకాలు, పంచ సూత్ర పథకాలు వచ్చాయి. వాటికి పట్టిన గతే ఈ ఆరు సూత్రాల పథకాలకు కూడా పడుతుంది. గవర్నరుగారి ప్రసంగ సందర్భంలో ఈ ఆరు సూత్రాల పథకాన్ని ఇక్కడ నేను తగలబెట్టిన సంగతి అందరికీ తెలిసినదే.ఇక్కడ ఏమని రాశారంటే, ఇక్కడ నాయకులతో అనేక సార్లు చర్చించామని, వారిలో వారు కూడా చర్చించుకున్నారని ఉంది. ఎవరు ఎవరితో చర్చించారో మాకు తెలియదు. ఈ రాజ్యం కాంగ్రెస్ వాళ్ళ అబ్బ సొమ్మా అని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్లమెంటు మెంబర్లు, శాసన సభ్యులతో మాట్లాడితే సరిపోయిందా అని అడుగుతున్నాను. ఆంధ్ర, తెలంగాణ ప్రశ్న వచ్చినప్పుడు తెలంగాణ వారు ఎప్పుడూ ఆంధ్రతో కలియడానికి సిద్ధంగా లేరు.
రాయలసీమ వారు కూడా కలియడానికి ఇష్టం లేకపోతే శ్రీబాగ్ ఒప్పందం అని పెట్టి వారిని కలుపుకున్నారు. ఇక్కడ కూడా ప్రజలకు కలవడానికి ఇష్టం లేకపోయినా వెంకటరెడ్డిగారు కొన్ని షరతులపై కలుస్తామని ఒప్పుకున్నారు. వాటిని మేము కూడా ఒప్పుకుం టాము అన్న తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నాయకుల మధ్య జరిగిన ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పం దం అయినది. ఆ విధంగా పదమూడు సంవత్సరాలు నడిచింది. మంత్రి పదవులు కావాలి అనుకున్నవారికి దొరికాయి. శాసన సభ్యులు కాదలచుకున్నవారు అయినారు. వారు ఇక్కడ డబ్బు సంపాదించుకున్నారు. బ్లాక్ మార్కెట్టు కోసం పైరవి చేసుకున్నారు. మంత్రులు చాలా సుఖంగా ఉండిపోయినారు. తెలంగాణ వారి బాధలను మరిచిపోయినారు.
పదమూడు సంవత్సరాలైన తర్వాత ఉద్యమం లేవతీసినారంటే, నాయకులు లేవతీయలేదు. విద్యార్థులు లేవతీసినారు. ఉద్యోగులు లేవతీసినారు. క్లాస్ 4 ఉద్యోగులు లేవదీసినారు. టీచర్లు లేవతీసినారు.వారంతా లేవతీసిన తర్వాతనే ఇక్కడ లీడర్లు దానిలో పూనుకున్నారు. కాంగ్రెస్ నుంచి కొంతమంది లీడర్లు వచ్చి పవిత్రమైన మూవ్‌మెంట్‌ను స్టాప్ చేసి ఆరు సూత్రాలు, 7సూత్రాలు, 8 సూత్రాలు అనుకొని వెళ్లిపోయారు.
కేంద్రం కూడా విఫలం అయినది. చవాన్‌ను పంపించి స్పాట్ ఎంక్వయిరీ చేయమన్నారు. 69లో ఒకనాడు ఇందిరాగాంధీ గారు ఏ రాత్రి వచ్చారో వెళ్లిపోయారు. 1972 ఎలక్షన్స్ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణా గురించి న్యాయం చేస్తామని ప్రామిస్ చేశారు. ఫెయిర్ డీల్ టు ది తెలంగాణ అని వరంగల్లులో ఇందిరాగాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు చెప్పారు. కానీ ఎలక్షన్ కాగానే తెలంగాణను మర్చిపోయారు.ఆంధ్రలో పెద్ద ఉద్యమం లేవదీసినారు. వెంగళరావుగారు ముఖ్యమంత్రి అయితే గొప్ప గొప్ప మాటలు చెప్పిన వారే, అమాయకులైన బిడ్డల ప్రాణాలు తీయించిన వారే మంత్రులు అయినారు. ప్రత్యేక ఆంధ్ర కావాలన్న వారు ఈనాడు మినిష్టర్లు అయినారు. ఇది వరకు ప్రత్యేక తెలంగాణ కావాలనిన వారు మంత్రులు అయినట్లే, ఆంధ్ర కావాలని అనినవారు మంత్రులు అయినారు.
సెపరేషన్ మంచిది. పంజాబ్, హర్యానా చిన్న రాష్ట్రాలుగా అయిన తర్వాత చాలా అభివృద్ధి అయినవి.సముద్రం లాంటి పెద్ద స్టేట్‌తో కలిసి ఉండటం వల్ల తెలంగాణ అభివృద్ధి కాదు. తెలంగాణ వెనుకబడి ఉంది.మాకు సెపరేటు స్టేట్ కావాలని మేము అంటున్నాం. ఆరు సూత్రాల పథకం మూలంగా తెలంగాణ రీజియనల్ కమిటీ ఖతం అయినది. ముల్కీ రూల్సు ఖతం అయినవి. తెలంగాణ వారి గతి ఏమయినది? తెలంగాణ వారు అనాథలు అయినారు. ఎవరికి చెప్పుకోవాలి? ఏమి చెప్పుకోవాలి?
ఆరు సూత్రాల పథకంపై
1974 ఫిబ్రవరి 5వ తేదీన శాసన సభలో జరిగిన చర్చలో
జె. ఈశ్వరీబాయి ప్రసంగం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి