శ్రీవారి ఆదాయం ఎప్పటికప్పుడు హారతి కర్పూరంలా ఆవిరైపోతోంది. మదుపు అనే మాట మరచి అనవసరపు ఆర్భాటపు ఖర్చులతో టి.టి.డికి ఆర్ధిక భారం పెరిగిపోతోంది. దీంతో టి.టి.డి ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నా ఉన్నతాధికారులకు, పాలకమండలికి నోరువిప్పి చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ధార్మిక సంస్థ టి.టి.డి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఏర్పడి 75 వసంతాలు. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల రూపంలో వచ్చే ఆదాయం లక్షల నుండి కోట్లకు చేరింది. పాలకమండలి అంచనా ప్రకారం శ్రీవారి హుండీ ఆదాయం ... ఈ ఆర్ధిక సంవత్సరంలో 470 కోట్లు. ఏటా వందల కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వున్నా టి.టి.డి అంతకు మించిన వ్యయంతో కునారిల్లుతోందన్నట్లు తెలుస్తోంది. లక్షల్లో ఆదాయం వున్న రోజుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన టి.టి.డి నేడు కోట్లల్లో ఆదాయం వస్తున్నా పది రూపాయలు కూడా వెనుకేయలేని స్థితికి చేరిందన్నది సత్యమేనని అధికారవర్గాలు అనధికారికంగా అంగీకరిస్తున్నాయి. పాలకమండలి రాజకీయ జోక్యం, అధికారుల తొందరపాటు నిర్ణయాలు, తాత్కాలిక,
ప్రజాకర్షక కార్యక్రమాల మూలంగా టి.టి.డి వ్యయం ఆదాయాన్ని మించి, ప్రస్తుతం నెల నెలా ఉద్యోగుల జీత భత్యాలకోసం వెంపర్లాడే పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఖర్చులు చేయడంతో తలకు మించిన భారంతో టి.టి.డి పాలన సాగుతోందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
2002వ సంవత్సరం వరకు రోజువారీ హుండీ ఆదాయం 35 నుండి 40 లక్షల రూపాయలు వస్తున్నప్పుడే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో శ్రీవారి సొమ్మును భద్రపరిచేవారని, ప్రస్తుతం రోజుకు 1.25 కోట్ల ఆదాయం ఒక హుండీ ద్వారా వస్తున్నా ఫిక్స్‌డ్ డిపాజిట్ అనే మాటే మర్చిపోయారని అంటున్నారు. 2002 నుంచి ఇప్పటి వరకు టి.టి.డి నయాపైసా కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో జమచేయలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది.
సిబ్బంది జీత భత్యాలు చెల్లించడంలో, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించటంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని విశ్వసనీయ సమాచారం. సంవత్సరానికి 1300 కోట్ల బడ్జెట్ కలిగిన ఏకైక ధార్మిక సంస్థగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన టి.టి.డిలో కూడా ఆర్ధిక మాంధ్యం నెలకొని వున్నదని అంటున్నారు. ధర్మప్రచారం పేరిట ఏటా 200 కోట్ల రూపాయలపైనా ఖర్చు చేస్తున్నారని, ఎస్.వి.బి.సికి కూడా వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని, ఇంజనీరింగ్ విభాగానికి వందల కోట్ల రూపాయలు కేటాయించారని అంటున్నారు. 14 వేలమంది సిబ్బంది వుండాల్సిన టి.టి.డిలో నేడు 10 వేలలోపు ఉద్యోగులు మాత్రమే వున్నారు. జీతభత్యాలు చెల్లించాల్సిన సిబ్బంది సంఖ్య తగ్గినా, ఆదాయం పెరుగుతూ వున్నా ఖర్చు అంతకు మించి అవుతున్నదని, ఇప్పటికైనా ఖర్చు అదుపుచెయ్యకుంటే భవిష్యత్తులో సిబ్బంది జీతాలు చెల్లించడం కూడా కష్టమయ్యే పరిస్థితులు ఎదురుకావచ్చని అధికారవర్గాలు అంటున్నాయి. వాహనాల ఖర్చుకు సంవత్సరానికి వందల కోట్లు, టి.ఎ, డి.ఎలు, మెడికల్ అలవెన్స్‌లకింద కోట్లాది రూపాయలు అనవసరంగా ఖర్చు చేస్తున్నారని తెలిసింది.
శ్రీవారి ఆలయ భద్రత అంటూ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, కొంటున్న పరికరాలు చాలావరకు నిరుపయోగంగా వుంటున్నాయని తెలిసింది. ఒక్కొక్క అధికారి, పాలకమండలి కొత్తగా వచ్చినప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో శ్రీవారి సొమ్మును హారతి కర్పూరంలా ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొనాల్సిన అవసరం వుంది. అయితే నూతనంగా వచ్చిన కార్యనిర్వహణాధికారి కృష్ణారావు టి.టి.డి ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
17, జులై 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
దేవుడి కోసం అంత డబ్బు ఖర్చు పెట్టే బదులు పేద వాళ్ళ సంక్షేమం కోసం ఆ డబ్బు ఖర్చు పెట్టొచ్చు కదా.
అన్నివేలమందికి ఉద్యోగాలివ్వడం, (మళ్ళీ ఆ ఉద్యోగాల్లో ఉచిత చదువులూ, ఉచిత రోగచికిత్సలూ, పెన్షన్లూ గట్రా) ఇంకా లక్షలాదిమందికి చిరువ్యాపారాలు చేసుకునే అవకాశం ఉండడం - ఇదంతా పేదవారికి అన్నం పెట్టడం కాదా ? మనం హుండిలో వేసే డబ్బులు దేవుడేమైనా వైకుంఠానికి తీసుకెళుతున్నాడా ? ఆయన పేరు చెప్పుకుని అన్నిరకాలుగాను మనమేగా భోంచేస్తున్నది ?