17, జులై 2009, శుక్రవారం
అప్పుడు మహారాష్ట్ర.. ఇప్పుడు కర్నాటక..
కృష్ణ, భీమా నదులపై కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న బ్రిడ్జి కమ్ బ్యారేజిలవల్ల రాష్ట్ర ప్రాజెక్టులకు చుక్కనీరు కూడా అందే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ బృందం తెలిపింది. కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టులను సందర్శించిన ఆపార్టీ బృందం సత్వరమే వీటిని అడ్డుకోవాలని లేదంటే రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎగువ రాష్ట్రాలు నీటిని నిలువరించుకునే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నాయి. బాబ్లీ ప్రాజెక్టుపై మహారాష్ట్ర బ్యారేజిల నిర్మాణం పూర్తి చేసింది. ఇప్పుడు తాజాగా... కర్ణాటక కూడా ఇదే బాటన పయనిస్తోంది. కృష్ణా,భీమా నదులపై అక్రమ కట్టడాలకు కర్ణాటక తెరలేపింది. వీటి ద్వారా వంద టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తోంది. పైనుంచి చూస్తే రహదారి కోసం వేసిన బ్రిడ్జిగా కనిపిస్తున్నా.. కింద మాత్రం నీటిని నిల్వ చేసుకునే బ్యారేజీలు ఇవి. కృష్ణా నదిపై 37, భీమా నదిపై 18 నిర్మాణాలను కర్ణాటక చేపట్టింది. మరో నాలుగు భారీ నిర్మాణాలు కూడా చకచకా సాగుతున్నాయి.ఇవి పూర్తయితే 150 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం కలుగుతుంది. గుల్బర్గా జిల్లా యాద్గీర్ సమీపంలోని గురుసిరిగెవద్ద 54 గేట్లతో భారీ నిర్మాణం చేపట్టింది. దీనిలో మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసే వీలుంది. అదేవిధంగా సన్నతివద్ద 37 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు.ఈప్రాజెక్టు సాక్షాత్తూ జూరాల ప్రాజెక్టు నిర్మాణాన్ని తలపిస్తోంది.దీనివల్ల దిగువన ఉన్న జూరాల,శ్రీశైలం,నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు చుక్కనీరు కూడా వచ్చే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ 12మంది ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం ఆందోళన వ్యక్తం చేసింది. కర్ణాటక ప్రభుత్వం బ్రిడ్జి కం బ్యారేజిలవద్ద లిఫ్టులు అమర్చి రైతులకు నీరందించే యోచనలో ఉన్నట్లు అక్కడి అధికారులు, రైతులు తెలుపుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని 33 లక్షల ఎకరాలకు భవిష్యత్తులో నీరందే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఈఅక్రమ బ్యారేజిల నిర్మాణాలను నిలిపివేయించాలని టీడీపీ డిమాండ్ చేసింది. కృష్ణా ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించి మన వాటా సాధించుకోవాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి