తాను ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ ప్రజలకు ఎంతమాత్రం ఇబ్బందులు కలిగించదని కేంద్ర మంత్రి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. ఈ నెల 3న పార్లమెంట్‌లో 2008-09 సంవత్సరానికిగాను రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మమత బుధవారం మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ సందర్భంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ బడ్జెట్ చాలా సింపుల్‌గా ఉంటుందని, పలు విభాగాల్లో తగ్గింపులు ఉంటాయేగానీ వడ్డింపులు ఉండవని ఆమె తెలిపారు. ఈ బడ్జెట్‌ను తయారు చేసేందుకు తనకు కేవలం 15 రోజుల సమయం మాత్రమే అందుబాటులోకి వచ్చిందని, అప్పటికీ చాలా వేగంగా తయారు చేశామని ఆమె తెలిపారు. ప్రస్తుతం భారతీయ రైల్వేలు ఎదుర్కుంటున్న సమస్యలు తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని కేటాయింపులు జరిపామని తెలిపారు.
వెండార్ పాస్‌లు, చార్జీల తగ్గింపు గ్యారంటీ!
తక్కువగానే అయినా రైలు టిక్కెట్ ధరల తగ్గింపు, సరుకు రవాణాలో రాయితీలు, 20 రూపాయలకే వెండార్ పాస్‌లు తదితర నిర్ణయాలు రైల్వే బడ్జెట్‌లో చోటు చేసుకోనున్నాయి. వీటితోపాటు మరింత నాణ్యమైన ఆహార పదార్ధాలు, భద్రతకు పెద్దపీట వేస్తూ, ఈ విభాగాల్లో కేటాయింపులు పెంచే అవకాశాలూ ఉన్నాయి. సాధ్యమైనంత తక్కువ ధరకు భోజనం, మరిన్ని జనతా రైళ్ళు, రాయ్ బరేలీలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వేగంగా డిఎఫ్‌సి అమలు, స్టేషన్ల ఆధునికీకరణ, లాలూ ప్రవేశపెట్టిన గరీబ్ రథ్ తరహాలో మరిన్ని రైళ్ళు (పేరు మారే అవకాశాలున్నాయి), తూర్పు రీజియన్‌లో మరిన్ని రైళ్ళు, గత సెప్టెంబర్‌లో ఆగిపోయిన కాశ్మీర్‌లోని కాత్రా-క్వాజిగుండ్ నిర్మాణ పనుల పునరుద్దరణ, గరీబ్ రథ్ రైళ్ళలో నాన్ ఎసి కోచ్‌ల ఏర్పాటు తదితర నిర్ణయాలు ఉండబోతున్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. మానవీయ కోణంలో ఆలోచిస్తూ, మమతా బెనర్జీ బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తున్నారని, మరిన్ని రైల్ ఓవర్ బ్రిడ్జిలు, రైల్ అండర్‌బ్రిడ్జ్‌లతో పాటు అన్ని లెవల్ క్రాసింగ్‌ల వద్ద కాపలా, పెద్ద పెద్ద స్టేషన్లలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ వ్యవస్థలకు కేటాయింపులు జరపనున్నారు. వీటితో పాటు రైల్వేలకు సొంతంగా బాంబ్ డిటెక్షన్, డిస్పోజనల్ వ్యవస్థ, ఆపిఎఫ్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల తక్షణ భర్తీ, ప్రయాణికుల బ్యాగేజీ స్కానింగ్ వంటి పలు విషయాలపై మమత దృష్టిని సారించారని తెలుస్తోంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి