పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటినుంచి ప్రారంభమవుతున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తి వాటి పరిష్కార మార్గాల కోసం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం, అలాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులు అనుమతులు, మంజూరీలు పొందడం వంటి అంశాలు సమావేశాల సందర్భంగా వచ్చే ఆలోచనలు.
ఈ ఆలోచనలకు తగ్గట్టుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసే అనవాయితీ ఉంది. కానీ గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఈ సాంప్రదాయానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నేతృత్వంలో గల కాంగ్రెస్ ప్రభుత్వం గండికొట్టింది. మొదటిసారి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఒకమారు వై.ఎస్ ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత ఈ సాంప్రదాయానికి స్వస్తిపలికారు. ఇలాంటి పరిస్థితులలో రాష్ట్రానికి చెందిన మొత్తం 60మంది పార్లమెంట్ సభ్యులున్నారు. అందులో 42 లోక్‌సభ, 18 రాజ్యసభ సభ్యులున్నారు.
రాష్ట్రానికి కావాల్సింది ఏమిటి? కేంద్రం ఏమి ఇవ్వగలదు, కేంద్రంవద్ద ఏయే ప్రాజెక్టులు ఏయే రంగాలలో ఏ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి? ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి? ఇలాంటి సమాచారం వీరిలో ఎంతమంది వద్ద ఉంది? ఎంత మందికి రాష్ట్రం, దాని అవసరాలు గురించి అవగాహన ఉందో అన్నది చాలా మందికి అనుమానం కలుగుతోంది. ఈ మొత్తం 60మంది పార్లమెంట్ సభ్యులలో లోక్‌సభకు సంబంధించి 42 మంది ఉండగా, అందులో కాంగ్రెస్ 33, తెదేపా 6, తెరాస 2, ఎంఐఎంకి చెందిన ఒక సభ్యుడున్నారు. 18 రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ 14, తెదేపా 2, సిపిఐ 1, సిపిఎం 1 మంది సభ్యులున్నారు. ప్రతియేటా పార్లమెంట్ వార్షిక బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈ ఎంపీలందరితో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసి రాష్ట్రానికి వివిధ రంగాలలో రావాల్సిన నిధులు, అనుమతులపై ప్రత్యేక నివేదికలను అందజేసి వారిని చైతన్యవంతులను చేస్తూ వచ్చేది.
రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర శ్రేయస్సు, అభివృద్ధి కోసం పార్లమెంట్‌లో కలిసికట్టుగా పోరాడాలని కూడా తనవంతు కర్తవ్యంగా సూచించే సాంప్రదాయానికి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. సంఖ్యాబలాన్ని చూస్తే దేశంలోని ఏ రాష్ట్రం కూడా అందించని విధంగా ఇటీవల ఎన్నికలలో 33 మంది లోక్‌సభ సభ్యులను కాంగ్రెస్ పార్టీకి అందించిన ప్రజలు మాత్రం ఈసారి తమకు ఏదో మంచి జరుగుతుందని గుప్పెడు ఆశలతో ఉన్నారు. ముఖ్యంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల అదుపు చేసే విషయమై కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచగలరని, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, పారిశ్రామిక, రవాణా, ముఖ్యంగా రైల్వే రంగాలలో మరిన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి కృషి చేయగలరని, వ్యవసాయం, నీటి పారుదల రంగాలలో ఏదో ఒక బహుమానం రైతుల కోసం తీసుకువస్తారని ఆశిస్తున్నారు.
గడిచిన ఐదు సంవత్సరాలుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకోవడంలో వైఎస్ ప్రభుత్వం సఫలీకృతమైనప్పటికీ మిగిలిన రంగాలలో చెప్పుకోదగినంత రాష్ట్రానికి తేలేకపోయింది. ముఖ్యంగా రైల్వేలకు సంబంధించి రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రతిసారి రైల్వే బడ్జెట్ సందర్భంగా కొత్త రైళ్ళను వేయాలని మన ఎంపీలు మొర పెట్టుకోవడం తప్ప కొత్త మార్గాల గురించి ఎవరు కూడా అంతగా మాట్లాడలేకపోతున్నారు. వారికి అవగాహన లోపమే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులలో చాలా మంది సీనియర్లు పరిణతి చెందినవారే. వారిలో అనేక మంది ఒకటి నుంచి ఆరు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైనవారే. రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు కూడా రాజకీయ అనుభవజ్ఞులు, రాష్ట్రం పట్ల పూర్తి అవగాహన కలిగినవారే ఉన్నారని ప్రజలు విశ్వసిస్తున్నారు.
అయినప్పటికీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో వారి వారి ఎంపీలు సమయానుకూలంగా అవసరాన్ని బట్టి ఏకతాటిపై నిలబడి తమతమ రాష్ట్రాలకు కావలసింది సాధించుకుంటున్నారు. కానీ మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఎందుకు వారిని స్ఫూర్తిగా తీసుకోలేకపోతున్నారో వారికే తెలియాలి. రోజురోజుకు చైతన్యవంతులవుతున్న ప్రజలు మాత్రం మన ఎంపీలు ఏమి చేస్తున్నారు, రాష్ట్రానికి, మాకు ఏమి తెస్తున్నారు అని ఎదురుచూస్తూ సాధారణ రైల్వే, సాధారణ బడ్జెట్‌లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతీసారి విశ్లేషించుకుంటూనే ఉన్నారు. రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు దక్కినవన్నది ముఖ్యం కాదు, ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని నిధులు తెస్తున్నామన్నదే ముఖ్యమని తరచూగా వైఎస్ చెబుతున్న మాటలకు రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఎంతవరకు నిజం చేసి నిరూపిస్తారో వేచి చూడాల్సిందే
2, జులై 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి