రాష్ట్ర రాజకీయాలు అమెరికా తెలుగువారిలో కూడా చిచ్చును పెట్టాయి. ఈ రాజకీయ అంతర్గత కలహాలు బయటపడి సజావుగా సాగుతున్నతానా మహా సభలను రసాభాసగా మార్చాయి. ఈ పుణ్యం కట్టుకున్నది కూడా ఇక్కడి నుంచి సభలకు ప్రముఖులుగా, చుట్టపు చూపుగా వెళ్ళిన మన రాజకీయ నాయకులే కావడం విశేషం. ఇక్కడ నోటి మాటలతో విమర్శలు చేసుకోడానికి అలవాటైపోయిన ఈ నాయకుల వల్ల తానా సభలో తెలుగువారు ఐక్యతను ఒక్కసారిగా మరచిపోయి గ్రూపులుగా ఏర్పడి కాలర్లు పట్టుకోడానికి కూడా....
సన్నద్ధమైపోయారు. గత మూడు రోజులుగా తానా సభలకు వచ్చిన తెలుగువారి మధ్య రాజకీయ అహంకారాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. చిన్న చిన్ని కీచులాటలు జరుగుతున్నా సర్దకుపోతూ, తానా సంబరాల్లో సరదాగానే గడిపారు. కాని చివరి రోజైన శనివారం నిర్వహించిన పొలిటికల్ ఫోరం మాత్రం ఈ పొగలను సెగలుగా మార్చేసింది. చివరకు మంత్రి గల్లా అరుణ కుమారి జోక్యం చేసుకుని సున్నితమైన భాషలో కఠన వాస్తవాలు చెబుతూ మందలించేంత వరకూ తానా సభకు వచ్చిన తెలుగువారు చల్లారలేదు.
తానా మహాసభలలో భాగంగా నిర్వహించిన పొలిటికల్ ఫోరం లో 2009 ఎన్నికలు-విశ్లేషణ అన్న అంశంపై చర్చ పెట్టారు. దీనిలో తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, ప్రజారాజ్యం పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మంత్రి గల్లా అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు. సంస్థాగత లోపాలే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని దెబ్బతీసాయని, సామాజిక న్యాయం నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో విఫలం అయ్యామని గంటా వివరించారు. తెలుగుదేశం పార్టీలో కూడార సంస్థాగత లోపాలు ఉన్నాయని, అంతర్గత ఇబ్బందులు ఉన్నాయని, అవే పార్టీ విజయావకాశాలను గండి కొట్టాయని తుమ్మల తెలిపారు. అయినా ఇవన్ని సభలలో బహిరంగంగా చెప్పే విషయాలని, కాని చెప్పలేని అసలు నిజాలు చాలా ఉంటాయని, రాజకీయనాయకులు అసలు వాస్తవాలను ఎప్పుడూ బయటకు చెప్పరని, బయటకు చెప్పేవన్నీ అబద్ధాలేనని, దానికి తాను సిద్ధంగా లేనని ఆయన చమత్కరించి సభికులకు నవ్వులను పంచారు. కానీ యార్లగడ్డ మాత్రం తన వ్యాఖ్యానాలతో నిప్పులు పుట్టించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైన, అతని తనయుడు లోకేష్ మీద చేసిన వ్యాఖ్యానాలు వేదికపై కలకలం రేపితే, వేదిక ఎదురుగా ఉన్న అమెరికా తెలుగువారిలో కలహాన్ని సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో వైఎస్ పంచెకట్టుకుని ప్రజలకు రెండు చేతులూ ఎత్తి నమస్కారం పెడితే, చంద్రబాబు మాత్రం రెండు వేళ్ళూ చూపించేవారని, రాజకీయాలలో బాడీ లాంగ్వేజ్ చాలా ప్రధానమైనదని ఆయన చెప్పారు . యార్లగడ్డ వ్యాఖ్యలకు ఎర్రబెల్లి స్పందిస్తూ, రాజకీయాలలో అధికార మార్పిడి సహజమని అన్నారు. వ్యక్తిగతంగా గేలి చేయడం సంస్కారం కాదని, గెలిచామని పొంగి పోకండి అంటూ విరుచుకుపడ్డారు. ఈ సభలో ఉన్న తానా సభ్యులు గ్రూపులుగా విడిపోయి దూషణలకు దిగారు. కుమ్ములాడుకున్నారు. సభలో సంభవించిన పరిణామాలను చూసి తానా బాధ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. సర్ది చెప్పడానికి మైకులో గొంతు చించుకున్నా ఫలితం లేకపోయింది.
పరిస్థితి చేయి దాటు తుందని గమనించిన మంత్రి గల్లా అరుణ కుమారి జోక్యం చేసుకున్నారు. ఘర్షణకు దిగిన అమెరికా తెలుగువారికి సుద్దులు చెప్పారు. ` అమెరికాలో తెలుగు వారి బతుకులు ఏమిటో మనకు తెలుసు. వీకెండ్ బతుకులు మనవి. శని, ఆదివారాల్లోనే మనం బతుకుతాం. సోమవారం నుంచి శుక్రవారం వరకూ బతికేమో, చచ్చేమో కూడా తెలియకుండా పనిచేస్తాం. సప్త సముద్రాలు దాటి వచ్చి వీకెండ్ల కోసం బతికే మనకు ఇక్కడ రాజకీయాలు అవసరమా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఐక్యంగా ఉండక పార్టీల పేరుతో కుమ్ములాడుకోవడం మీకు అవసరమా? ఆలోచించుకోండి అంటూ చురకలంటించారు. మంత్రి మోపిదేవి వెంకట రమణ కూడా అమెరికాలోని తెలగు వారికి హితవు చెప్పారు. అక్కడ కష్టాలు పడి ఇక్కడకు వచ్చి రేయింబవళ్ళు పరాయిదేశంలో కష్టపడి పనిచేసి ఆర్ధికంగా నిలదొక్కుకున్న తెలగువారు రాజకీయాల పేరుతో విడిపోవడం మంచిది కాదని ఆయన అన్నారు
6, జులై 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అన్నన్నా... ఇంత మంచి వినోదాన్ని మిస్సయ్యానా.. బాబ్బాబు కొంచెం పూర్తి వివరాలు వీలైతే ఫోటోలతో సహా ఇవ్వవూ....
for the sake of followup.