మనం భారతదేశంలోనే ఉన్నామా... అసలు దేశంలో మనమూ ఒక భాగమేనా.. లేక మనదేమైనా ప్రత్యేక దేశమా.. ప్రస్తుతమే కాదు.. కొన్నేళ్లుగా తయారు చేస్తున్న రైల్వే బడ్జెట్లను చూస్తుంటే.. ఇదే అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి మొండి చెయ్యి చూపించి.. తమ పద్దతి ఇదేనని రైల్వే మంత్రి మమతా బెనర్జీ నిరూపించుకున్నారు. కేవలం వినతి పత్రాన్ని ఇచ్చి.. అంతా ఆమే చూసుకుంటుందంటూ నెట్టుకొచ్చిన మన ఎంపీలు.. ఇప్పుడు ఏదో హడావిడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లీ వెళ్లి సొంత పనులు చక్కబెట్టుకుందామనుకునే వారే తప్ప.. నిజంగా రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడుతున్నవారు గానీ.. పోరాడిన వారు గానూ ఒక్కరన్నా ఉన్నారా... కచ్చితంగా లేరనే చెప్పొచ్చు. దక్షిణాదిన ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేది మన దక్షిణ మధ్య రైల్వే మాత్రమే. ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. తిరగబడాలి.. ఎదిరించి పోరాడాలి. పార్టీల కోసం.. అధినేతల మెప్పు కోసం.. తలవంచుకుంటే.. మనకు ఎప్పటికీ అన్యాయమే జరుగుతుంది. అతిగా అవసరం లేదు.. న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఇచ్చినా చాలు.
ఇదేమన్నా ముష్టా...
సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతారట. అదీ ప్రైవేటు వ్యక్తుల సౌజన్యంతో.. అదే హౌరా స్టేషన్‌కు మాత్రం ప్రభుత్వమే అంతా భరిస్తుందంట.. ఇదేమీ విడ్డూరం. మీరైతే ఒకటి.. మేమైతే ఒకటీనా.. మన ఎంపీలు చేతకాని దద్దమ్మలు కాబట్టే.. ఏం చేసినా.. కంటి సైగకే.. కాలు కూడా కదపకుండా కూర్చుంటారు కాబట్టే.. ఉత్తరాదివారు ఎగిరిపడుతున్నారు. ఇష్టారాజ్యంగా చేసుకుపోతున్నారు. మనకంటూ హక్కులు ఉన్నాయా.. అన్న అనుమానం కలుగుతోంది. అసలు తలుచుకుంటుంటేనే రగిలిపోతుంది. మరి మన ఎంపీలకు కనీసం చీమ కుట్టినట్టైనా ఉందా.. ఏమో చెప్పలేం. ఓ రెండు మూడు సమావేశాలకు వెళ్లడం.. మంత్రితో చర్చిచండం.. ఆపై వచ్చేసారి న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడం.. ఇంతకు మించి మనం ఊహించుకోనక్కరలేదు.
ఏం చేయాలి?
మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం విడిపోవడానికి జరిగిన ఓ సంఘటనను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. పొట్టి శ్రీరాములు, ఇతర నేతలు ఎంతో పోరాడి ఉండొచ్చు గాక.. కానీ, రాష్ట్రాన్ని విడగొట్టాలని నెహ్రూ సర్కార్ నిర్ణయించడానికి కారణం మరొకటి ఉంది. అదే రైల్వే ఉద్యోగుల నిరసన. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్నా.. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో.. వైజాగ్‌లో రైల్వే ఉద్యోగులు ఓ మహా నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ఇంజన్లకు బోగీలను మార్చేయడం. ఒక ట్రైన్‌తో వెళ్లాల్సిన బోగీలకు మరో ఇంజన్‌కు తగలించడం.. కొన్నింటిని దారి మళ్లించడం.. ఇలా ఎన్నో చేశారు. దీంతో ఒక్కసారిగా గగ్గోలు పుట్టింది. దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అయితే.. దీనికి శిక్ష కూడా వేసింది నెహ్రూ సర్కార్. వైజాగ్ డివిజన్‌ను తీసుకెళ్లి.. భువనేశ్వర్ కింద పడేసింది. ఇప్పుడు మరోసారి ఆ తరహా నిరసన చేస్తేగానీ.. మన బాధ ఢిల్లీ పెద్దలకు తెలియకపోవచ్చు. అరె, ప్రభుత్వ ఏర్పాటులో మరే రాష్ట్రమూ అందించనంతమంది ఎంపీలకు కాంగ్రెస్ పార్టీకి అందించినా.. కనీసం కృతజ్ఞతన్నా చూపించలేకపోవడం.. వీరికే చెల్లింది.
తప్పదు.. మనం నిరసన తెలియజేయాల్సిందే.. తెలుగువారంతా.. నడుం బిగించాల్సిందే.
రైల్వే మిగులు భూములిని రియల్ ఎస్టేట్‌గా అభివృద్ధి చేసి, రైల్వేస్టేషన్లను షాపింగ్ కాంప్లెక్సుల టైపులో మార్చే యోచనలు ఇంతకు ముందునుంచే జరుగుతున్నాయిట.ఆ లిస్టులో సికిందరాబాద్ రైల్వేస్టేషన్ చాలా కాలంగా ఉన్నదే. ఇవ్వాళ్ళ కొత్తగా ఈవిడి ప్రతిపాదించింది అనటంకన్నా, దానికి కొనసాగింపుగా ఏమి చేద్దామనుకుంటున్నారో చెప్పుకోవడం ఉత్తమం అని నా ఉద్దేశ్యం.
పోతే హౌరా ప్రభుత్వమే ఎందుకు చేస్తానందో, ఏమి చేస్తానందో, ఎందుకు చేస్తానందో నాకు తెలీదు. మనకోసం ఏం చెయ్యాలనుకుంటున్నారో కూడా రాసుకుంటే బావుంటుంది. అప్పుడు మీరన్నట్టు ఇంజన్లు మార్చేయొచ్చు. ఈ సారి, డివిజన్లు ఇంకోళ్లకి కలపకుండా జాగ్రత్త పడి. :)