మీ జేబుల్లో డబ్బులే ఉండక్కర్లేదు. వంటి మీద నగలే వేసుకోనక్కర్లేదు. పర్సులో ఎటిఎం కార్డులున్నా సరే... వాటినీ కొట్టేసి, క్షణాల్లో బ్యాంక్ ఖాతాను కొల్లగొట్టే ఘరానా కేడీలు అడుగడుగునా ఉన్నారు. సైబర్ నేరాల విషయంలో పోలీసులకన్నా, దొంగలదే పైచేయిగా ఉంటోంది. కార్డు చేజిక్కిన ఐదు నిమిషాల్లోనే దాని పిన్ నెంబర్‌ను పట్టుకునే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చోరుల చేతికి చిక్కింది. ఎటిఎం పోయిన విషయాన్ని బ్యాంక్‌లో ఫిర్యాదు చేసేలోపే అందులోని నగదు మొత్తం చాకచక్యంగా కొట్టేసిన వైనం పోలీసులనే కంగు తినిపించింది. వివరాల్లోకి వెళితే... హైద్రాబాద్‌కు చెందిన సుధామణి ఇటీవల తిరుపతి వెళ్ళింది.
నారాయణాద్రిలో తిరుగు ప్రయాణం అవుతుండగా ఒక మాయలేడి బిచ్చగత్తె వేషంలో సీటు వద్దకు వచ్చింది. చూస్తుండగానే బ్యాగ్‌ను తీసుకుని మాయమైంది. ఆ బ్యాగ్‌లో హైద్రాబాద్‌లోని ఆంధ్రబ్యాంక్ ఎటిఎం కార్డు కూడా ఉంది. అప్పటికే రైలు వెళ్ళే సమయం కావడంతో బాధితులు స్థానిక రైల్వే సిఐ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. హైద్రాబాద్ చేరుకున్న వెంటనే బ్యాంక్‌కు వెళ్ళి కార్డు పోయిన విషయాన్ని తెలిపారు. బ్యాంక్ అధికారులు ఖాతా వివరాలు తెలపడంతో బాధితురాలు షాక్ తిన్నది. అప్పటికే ఎటిఎం కార్డు నుంచి మూడు దఫలా మొత్తం 29 వేల రూపాయలు డ్రా అయ్యాయి.
సాయంత్రం గం. 6.10కు కార్డు దొంగిలించబడితే, 6.15కే మొదటి విడత 10వేలు డ్రా చేశారు. మళ్ళీ 6.58 గంటలకు మరో 4వేలు, రాత్రి 1.07కు మరో 15వేలు డ్రా చేసినట్టు బ్యాంక్ అధికారులు గుర్తించారు. కేవలం ఐదు నిమిషాల్లోనే ఆగంతకుడు ఎటిఎం పిన్ నెంబర్‌ను తెలుసుకోవడం, కొన్ని గంటల్లోనే డబ్బులు డ్రా చేయడాన్ని బట్టి నేరస్తులు పథకం ప్రకారమే ఇలాంటి నేరాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
స్పందించిన చిత్తూరు ఎస్పీ: ఎటిఎం ద్వారా జరిగిన దొంగతనంపై చిత్తూరు ఎస్పీ లక్ష్మీరెడ్డి తక్షణమే స్పందించారు. బాధితులు ఫోన్ ద్వారా విషయం తెలిపిన వెంటనే ఆయన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. డ్రా చేసిన ఎటిఎంల నుంచి నిందితుల వీడియో క్లిప్పింగులను తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మిస్టరీని అతి త్వరలోనే ఛేదిస్తామని ఎస్పీ లక్ష్మీరెడ్డి తెలిపారు
25, జూన్ 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి