12, జూన్ 2009, శుక్రవారం
వైభోగమంటే.. ఇదే
Categories :
కిరీటం . టిటిడీ . తిరుమల . వేంకటేశ్వరుడు
కలియుగ ప్రత్యక్షదైవమైన కోనేటి రాయుడి హంగు రోజురోజుకూ పెరుగుతోంది. భక్తుల కోరిన కోరికలు తీర్చుతాడని ప్రసిద్ధి చెందిన ఆ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడికి.. మొక్కులు చెల్లించుకునే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. తాజాగా.. బ్రాహ్మణి స్టీల్స్ అధినేత.. కర్నాటక పర్యాటక శాఖ మంత్రి గాలి జనార్దనరెడ్డి.. 45 కోట్ల రూపాయల విలువైన వజ్రఖచిత కిరీటాన్ని కానుకగా అందజేశారు.
తిరుమలలో కొలువైన శ్రీనివాసుడిని చూడడానికి రెండుకళ్లూ చాలవు. ఆ విగ్రహ సౌందర్యం ఎంతటి వారినైనా కట్టిపడేస్తుంది. అలాంటి మహిమాన్వితుడికి.. అణువణునూ స్వర్ణాలంకృతమైతే.. ఆ అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. అలా చూస్తూ ఉండాల్సిందే. ఆలయ శిఖరం దగ్గరనుంచి.. అరికాలి కింద ఉన్న..పీఠం వరకూ.. అంతా స్వర్ణాలంకృతమే. ఇక భక్తుల నుంచి కానుకల రూపంలో వస్తున్న బంగారం.. టిటిడీ ఖజానాను నింపుతోంది. ఎంతో మంది ప్రముఖులు.. బంగారు నగలు, హారాలు.. స్వర్ణ పుష్పాలు.. ప్రత్యేకంగా చేయించి.. ఇవ్వడం ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతోంది. తాజాగా బ్రాహ్మణి స్టీల్స్ అధినేత.. ఓ వజ్రాల కిరీటాన్ని శ్రీవారికోసం ప్రత్యేకంగా చేయించారు. అత్యంత సుందరంగా తయారు చేసిన ఈ కిరీటంలో.. మేలిమి రకం వజ్రాలను పొదిగారు. కిరీటం ముందు భాగంలో ప్రత్యేకంగా పద్మాన్ని చెక్కారు. దీనిపై.. అందమైన పచ్చను అలంకరించారు. చూడడానికే.. అత్యద్భుతంగా ఉన్న ఈ కిరీటం.. ఏడుకొండలవాడి శిరస్సుపై చేరితే.. మరింత ప్రకాశిస్తుందన్న భావన అందరిలో నెలకొంది. ఇంతకుముందు ఎన్నో ఆభరాణలను స్వామివారికి కానుకలుగా అందినా.. రాశిలోనూ, వాసిలోనూ.. దీనిదే అగ్రస్థానం అంటున్నాయి ఆలయవర్గాలు. ధర ఎంతన్నది పైకి చెప్పకున్నా... దాదాపు 45 కోట్ల పైగానే విలువ చేయనుంది. తనకు అనుకూల కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు.. బ్రాహ్మణి స్టీల్స్ కంపెనీ పనులు చురుగ్గా జరుగుతుండడంతో.. ఈ దేవదేవునికి.. చిరుకానుకగా.. ఈ మహావజ్రకిరీటాన్ని గాలి జనార్దనరెడ్డి చేయించారు. తిరుమలేశుని ఆభరణాల్లో ఇదే ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
ఆభరణాల దేవుడు
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు.... ఒక్కమాటలో చెప్పాలంటే "ది గాడ్ ఆఫ్ ఆర్నమెంట్స్" అని వేంకటనాధుని సంబోధించటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకటా రెండా ఏకంగా 11 టన్నుల బంగారు ఆభరణాలు స్వామివారి సొంతం. రోజంతా వివిధ రకాల సేవల్లో.... ఒక్కో సేవకూ ఒక్కో రకమైన ఆభరణంతో... ఏడాది పొడువునా ఉత్సవాలతో... నిత్య నూతనంగా వర్ధిల్లే శ్రీనివాసుడి ఖజానా వర్ణించటానికి మాటలు చాలవు. ఇక... దేవదేవుడి ఆభరణాల కలెక్షన్ ఇప్పటిది కాదు. 14 వ శతాబ్ధంలో విజయనగర రాజుల కాలంలోనే స్వామివారి ఆభరణాల వెల్లువ మొదలైంది. ఇక... 15 వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు పాలించిన 21 సంవత్సరాలు.... తిరుమల పాలిట స్వర్ణయుగమేనని చెప్పొచ్చు. తిరుమలేశుని ఏడుసార్లు సందర్శించిన రాయలు.... శ్రీవారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశారు.... వేంకటేశుడికి వజ్రకిరీటం కూడా కొత్తే కాదు.... ఆనాడే రాయలవారు... కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని కానుకగా సమర్పించారు. అంతేకాదు... నవరత్న ఖచిత స్వర్ణఖడ్గం, నిచ్చెన కఠారి, రత్నాలు పొదిగిన మరో పిడిబాకు, నవరత్నాలు పొదిగిన కంఠహారం, భుజకీర్తులు, 30 తీగల పతకం ఇవన్నీ శ్రీకృష్ణ దేవరాయల బహుమతులే. ఆ తర్వాత తంజావూరు రాజుల కానుకల పరంపర... మహ్మదీయులు, బ్రిటిష్‌వాళ్లు, స్వరాజ్య భారతంలో వివిధ ప్రభుత్వాలు ఇలా... దేశం, ప్రపంచం పోకడలు ఎలా మారినా... ఆపద మొక్కులవాడి ప్రాభవం, వైభవం నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. వెంకన్నకున్న ఆభరణాల్లో గరుడమేరు పచ్చ ప్రధానమైంది. ఉత్సవాల సమయంలో మాత్రమే దీన్ని అలంకరిస్తారు. ఇక ఇతరత్రా ఆభరణాల విషయానికి వస్తే వర్ణించటానికి మాటలు చాలవు... చూట్టానికి రెండు కళ్లూ సరిపోవు... .అంతేనా కుల, మత, వర్గాలకు అతీతంగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు... కానుకలు సమర్పించుకుంటారు. బ్రిటిష్ పాలనలో చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన థామస్‌మన్రో గంగాళం బహుకరించగా.... అష్టదళ పాద పద్మారాధనకు ఉపయోగించే 108 సువర్ణ పద్మాలను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుసేన్ సాహెబ్, అర్చనలో అర్పించే 108 బంగారు పద్మాలను హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌మీరా స్వామివారికి నివేదించారు. ఇలా చెప్తూ పోతే.... దేశవ్యాప్తంగా ఎందరో సంపన్నులు శ్రీవారికి కానుకలిచ్చి తరించారు. ఆ అఖిలాంధ్ర బ్రహ్మాండ నాయకుడికున్న 11 టన్నుల ఆభరణాల్లో... ముఖ్యమైనవి పరిశీలిస్తే.... ఆరు కిరీటాలుండగా.. తాజాగా గాలి జనార్దనరెడ్డి బహుకరణతో.. ఏడుకొండవాడికి ఏడు కిరీటలయ్యాయి. 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు విడిగా ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటిలో వజ్రాల కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఇతర ఆభరణాల్లో సువర్ణ పద్మపీఠం, సువర్ణ పాదాలు, నూపురాలు, పగడాలు, కాంచీగునము, ఉదర బంధము, దశావతార హారము, దశావతార వడ్డాణము, చిన్న కంఠాభరణము, బంగారు పులిగోరు, సూర్యకఠారి... ఇంకా అనేక నాగాభరణాలు ... ఇలా వర్ణిస్తూ పోతే చెప్పటానికి మనం అలసిపోవాల్సిందే తప్ప... ఆ దేవదేవుడి నగలకు లెక్కేలేదు.
చిత్రమైన కానుకలు
భూరి కానుకలు సమర్పిస్తున్న పెద్దలనే కాదు.. సామాన్యుల కోరికలు తీర్చడమూ శేషశైలుని వంతే. అందుకే.. చిన్నా పెద్ద కానుకలతో హుండీలు నిండిపోతున్నాయి. కానుక ఇవ్వాలన్న మనస్సుండాలే కాని.. తలవెంట్రుకల నుంచి.. ప్రతీదీ చిద్విలాసంగా స్వీకరిస్తాడు.. ఆ శ్రీనివాసుడు. కోర్కెలు తీర్చినందుకు తిరుమల వెంకటేశ్వరుడికి ప్రతిఫలం ఇచ్చుకోవడం భక్తుల విషయంలో అనాదిగా వస్తున్న ఆచారం. ఏదిచ్చినా సంతోషంగా పుచ్చుకుంటాడన్న పేరున్నప్పటికీ.. స్థోమతకు తగ్గట్లుగా.. కానుకలు అందిస్తుంటారు భక్తులు. అంతకుముందు స్వామి వారి ఆభరణభాండాగారంలో ఉన్నప్పటికీ.. తమ తృప్తికోసం ఎప్పటికప్పుడు భక్తులు కొత్తవి చేసి తిరుమలకు తెస్తుంటారు. గత ఏడాది ఇలా వచ్చిన వాటిలో వజ్ర ఖచిత అభయహస్తాలు, బంగారు పాదాలు, స్వర్ణమకుటాలు.. కర్ణాభరణాలు..హారాలు.. ఇలా ఎన్నో స్వామివారికి అందాయి. తిరుపతి వెళ్లినవారు ఎక్కువగా సమర్పించుకునేది తలనీలాలనే. సామాన్యులందరూ శ్రీనివాసుడికి చెల్లించుకునే మొదటిమొక్కు ఇదే. అయితే.. ఆభరణాలు, తలనీలాలే కాక.. కాస్త వింతగొలిపే కానుకలనూ సమర్పిస్తున్నారు భక్తులు. బైక్‌లు, ఇన్నోవాలు, క్వాలిస్‌లు, లగ్జరీ కార్లు... ఇలా ఎన్నో రకాల వాహనాలనూ వెంకటేశ్వరుడికి అందించారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ భక్తుడు ఏకంగా ట్రాక్టర్‌ను అందించాడు. ఏదేమైనా.. సిరిగలవాడిని.. భక్తులు మరింత సిరిని అందిస్తున్నారు తిరుమలేశుని భక్తులు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి