5, జూన్ 2009, శుక్రవారం
ఖగోళ దెయ్యం
Categories :
ఖగోళం . నాసా . విశ్వం . cosmic ghost
విశ్వంలోని గెలాక్సీలపై అలుపులేకుండా పరిశోధనలు చేస్తున్న నాసా.. ఓ ఖగోళ దెయ్యాన్ని గుర్తించింది. పై చిత్రంలో నీలిరంగులో ఉన్నదే.. అది. అంతరిక్షంలో గెలాక్సీల ఆచూకీనీ, X-RAY కిరణాలపై పరిశోధనలు జరపడానికి ప్రయోగించిన చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ.. ఈ ఫొటోను తీసింది. ఖగోళదెయ్యంగా పిలుస్తున్న ఈ ఆబ్జెక్టే.. ఇప్పుడు భూరహస్యాలను అందరికీ చెప్పనుంది. అంతరిక్షంలో ఎవరికీ తెలియని ఓ రహస్యం దాగుంది. అది భూమి జన్మ రహస్యం. దీన్ని ఛేదించడానికి ఎన్నోఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అంతరిక్షంలో X-RAY కిరణాలపై పరిశోధనలు జరపడానికి అమెరికా పరిశోధనా సంస్థ నాసా.. జులై 23, 1999లో ఓ టెలిస్కోప్‌ను ప్రోయోగించింది. అదే.. చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ. ప్రయోగించినప్పటి నుంచి ఎన్నో రహస్యాలను భూమికి చేరవేసిన చంద్ర.. ఇప్పుడు మరో మైలు రాయిని అధిగమించింది. బ్లాక్‌హోల్‌కు సమీపంలో ఉన్న కాస్మిక్‌ఘోస్ట్‌ను ఫోటోలు తీసి భూమికి పంపించింది. సిగరెట్ పొగను తలపిస్తున్న దీన్నే ఇప్పుడు కాస్మిక్ ఘోష్ట్‌గా అభివర్ణిస్తోంది నాసా. ఇది హానీ చేసేది కాదు.. పైగా.. మన జన్మ రహస్యాన్ని అందించనుంది. సైంటిఫిక్‌గా దీనికి పెట్టిన పేరు.. HDF-130. విశ్వంలో అత్యంత దూరంలో ఇది నిక్షిప్తమై ఉంది. ఇంత దూరంలో ఉన్న ఫొటో తీయడం ఇదే తొలిసారి. వేలకోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలో బ్లాక్‌హోల్ ద్వారా జరిగిన భారీ విస్పోటనానికి సంబంధించిన వివరాలు అందించడంలో ఇదే కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం భూమికి వెయ్యికోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఇది ఉంది. మహా విస్పోటనం జరిగిన తర్వాత మూడు వందల సంవత్సరాలకు ఇది ఏర్పడిందని ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. విశ్వంలో వందలాది గెలాక్సీలు, బ్లాక్‌హోల్స్ ఏర్పడింది ఆ సమయంలోనే. అందుకే.. మన భూమి ఏర్పడడానికి కారణాలు దీని ఆధారంగా తెలిసే అవకాశం ఉంది. మహావిస్పోటనం సంభవించినప్పుడు.. రేడియో, ఎక్స్-రేడియేషన్ చాలా ఎక్కువగా విడుదలయ్యింది. కానీ కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత.. దీని తీవ్రత తగ్గిపోయింది. అయితే.. ఈ సమయంలోనూ ఎలక్ట్రాన్లు X-రే కిరణాలను విడుదల చేస్తూనే ఉంటాయి. ఇవి మరో ౩౦ మిలియన్ సంవత్సరాల పాటు వెలువడవచ్చు. వీటి ఆధారంగా భూమి మూలాలను కనిపెట్టడానికి నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
పేరు వెనక..
ప్రపంచ ప్రఖ్యాత ఇండో అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రమణ్యం చంద్రశేఖర్ గుర్తుగా.. ఈ అబ్జర్వేటరీకి చంద్ర అని పేరుపెట్టారు. అంతరిక్షంలోని ఎక్స్-రే కిరణాలను గుర్తించడంలే సాటిలేని టెలిస్కోప్... చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటర్. 1999లో నాసా దీన్నికోలంబియా స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించింది. నక్షత్రాలు విస్పోటం చెందిన తర్వాత వెలువడే ఎక్స్-రే కిరణాలను గుర్తించి పరిశోధనలు చేయడానికి దీన్ని విశ్వంలోకి పంపారు. సుధూర ప్రాంతాల్లో ఉన్న వాటిని అత్యంత నాణ్యంగా చిత్రించడానికి.. అత్యాధునిక కెమెరాలను ఇందులో అమర్చారు. వీటి సాయంతోనే.. దాదాపు వెయ్యికోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కాస్మిక్ ఘోస్ట్‌ను చంద్ర చిత్రీకరించగలిగింది. విశ్వంలో ఎక్స్‌రే కిరణాలను పరిశోధించడానికి.. టెలిస్కోప్‌ను పంపిచాలన్న ఆలోచన 1976లో వచ్చింది. అప్పటినుంచి మొదలైన ప్రయత్నాలు .. 1999లో చంద్రను ప్రయోగించడంతో సఫలమయ్యాయి. అంతరిక్షంలో జరిగే విస్పోటనాలపైనా.. నక్షత్రాల పుట్టుకపైనా.. రీసెర్చ్ ఊపందుకోవడానికి కారణం.. సుబ్రమణ్యం చంద్రశేఖర్. 1910లో మనదేశంలో జన్మించిన చంద్రశేఖర్.. 1937లో అమెరికాకు వెళ్లారు. అక్కడ చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ.. అంతరిక్షంపై పరిశోధనలు జరిపారు. ఫిజిక్స్‌ను, ఆస్ట్రానమీలను కలిపి పరిశోధనలు చేసినవారిలో ఈయన తొలితరం శాస్త్రవేత్త. ఈయన ప్రతిపాదించిన వాటిలో ముఖ్యమైంది.. అప్పర్‌లిమిట్ సిద్దాంతం. దీన్నే ఇప్పుడు చంద్రశేఖర్ లిమిట్‌గా పిలుస్తున్నారు. దీని ఆధారంగానే అంతరిక్షంలో విస్పోటనాలకు సంబంధించి పరిశోధనలకు ఊపందుకున్నాయి. సుబ్రమణ్యం చంద్రశేఖర్ చేసిన పరిశోధనలకు..1983లో నోబుల్ బహుమతి వచ్చింది. నాసాకు చంద్రశేఖర్ చేసిన పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన గుర్తుగానే.. ఈ ఎక్స్‌రే అబ్జర్వేటరీ టెలిస్కోప్‌కు చంద్ర అని నామకరణం చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఈ పోస్టేదో నచ్చింది. ఇంకా ఇంకా ఏదో మీరు చెప్తే విందాం/చదువుదాం అనిపించింది. కొంచెం కొంచెం ఇంకా అర్ధం కాలేదుగానీ, పూర్తిగా చెప్తే బావుండనిపించింది.చాలా బావుందనిపించింది.