30, మే 2009, శనివారం
భూమిపొరల్లో..తెలుగు వైభవం
Categories :
తెలుగువారి చారిత్రక ఘన వైభవానికి మరో మచ్చుతునక. క్రీస్తుపూర్వమే సామాజికంగా మన అభివృద్ధికి మరో నిదర్శనం. కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో పురావస్తుశాఖ జరుపుతున్న తవ్వకాల్లో బయటపడ్డ ఆనవాళ్లే దీనికి సజీవ సాక్ష్యాలు. వందల ఏళ్లుగా మట్టికింద కూరుకుపోయిన కరీంనగర్ జిల్లా ఓ మహానగరం... ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల పేరు చాలామంది వినే ఉంటారు. పురాతనకాలం నాటి శివాలయం ఇక్కడ ఉంది. సమీపంలోని మునులకొండపై ఉండే రుషులు.. ఇక్కడ ఇసుకతో శివలింగాన్ని ప్రతిష్టించారని ప్రతీతి. కోటి ఇసుక రేణువులతో లింగాన్ని రూపొందించడం వల్లే.. ఈ ప్రాంతానికి కోటి లింగాలగా పేరొచ్చింది. గలగలా పారే గోదావరి ఒడ్డునే ఈ ఆలయం ఉండడం మరో విశేషం. అంతేకాదు..ఈ కోటి లింగాలకే మరో ప్రాసశ్త్యం కూడా ఉంది. తొలి తెలుగురాజులుగా పేరు గడించిన శాతవాహనులు ఈ కోటి లింగాలను రాజధానిగా చేసుకునే పాలించారు. క్రీస్తుపూర్వం 2 శతాబ్ధం నుంచి క్రీస్తుశకం 2 వ శతాబ్దం వరకూ కోటిలింగాల ప్రముఖకేంద్రంగా ఉంది. శాతవాహనులు ఇక్కడే ఓ మహానగరాన్ని కూడా నిర్మించారు. రోడ్లు, క్రమపద్దతిలో ఇళ్లు.. నీటి నిల్వ కోసం ప్రత్యేకంగా బావులు, వర్షం నీరు వృథా కాకుండా ఉండడానికి ఇంకుడు గుంతలు, చెత్తవేసుకోవడానికి ప్ర్తత్యేక కుండీలను ఏర్పాటు చేసినట్లు తవ్వకాల్లో బయటపడింది. చైనా చరిత్రకారుడైన మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో శాతవాహుల కాలంలోని శత్రుదుర్భేద్యమైన 30 కోటలను ప్రస్తావించాడు. వాటిలో ఒకటే... ఈ కోటిలింగాల. బౌద్దమత ఆనవాళ్లను తెలిపే నాగశిల్పం ఇక్కడా బయటపడింది. బుద్ధపాదంతో పాటు.. సింహం బొమ్మలున్న ఓ పలక ఇటీవలే లభించాయి. కొంతకాలం క్రితం మునులగుట్టలో శ్రీముఖుని కాలంనాటి అపురూప నాణాలు బయటపడ్డాయి. త్రిమూర్తుల నాణాలు ఇక్కడే దొరికాయి. బుద్దులు, జైనులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి పాత్రలు, కుండపెంకులు, టెర్రకోట పూసలు, అప్పటికోటలో ఉపయోగించిన ఇటుకలూ ఈ ప్రాంతంలో ఎటు చూసినా కనిపిస్తాయి. అయితే.. ఈ తవ్వకాలన్నీ రైతుల భూముల్లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమి లేకపోవడంతో.. రైతుల అనుమతితో పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతోంది. ఇంతకాలం మట్టిలో కూరుకుపోయి.. ఇప్పుడే బయటపడుతున్న ఈ చారిత్రక నగరానికి మరో ముప్పు ఎదురవుతోంది. అదే ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కడితే.. కోటిలింగాల గుడితో పాటు.. ఈ నగరం ఉన్న ప్రాంతమంతా నీట మునిగిపోతుంది. తెలుగు వైభవానికి నిదర్శనంగా నిలిచే.. ఈ మహానగరాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత.. పురావస్తుశాఖ చేతిలోనే ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి