2, జూన్ 2009, మంగళవారం
హైదరాబాద్‌లో శివపుత్రులు
Categories :
పితాగమన్ సినిమా చూశారా.. విక్రమ్ నటన చూశారా.. స్మశానంలో బతికే హీరో కథ పూర్తిగా విన్నారా... దాదాపుగా అలాంటి స్టోరీనే ఇది. కాకపోతే ఒకరూ ఇద్దరు కాదు.. వందలాది మంది. ఓ రకంగా హైదరాబాద్‌లోనే అతిపెద్ద స్లమ్‌కాలనీది. స్తలం మాత్రం బన్సీలాల్‌పేట స్మశనానిది. దరాబాద్‌లో స్మశానాలంటే ఎవరికి తెలియదు చెప్పండి. కబ్జాలు, ఆక్రమణల బారినపడి కుచించుకుపోయాయన్న వార్తలు ఎప్పటి నుంచో వింటున్నవే. కాకపోతే.. స్మశానాన్ని పూడ్చేసో.. గోడలు కట్టేసో.. పూర్తి నివాసప్రాంతంగా మార్చేస్తారు కబ్జాదారులు. కానీ ఈ స్టోరీ వేరు. స్మశానమే ఊరుగా మారింది. సమాధులుగా ఇళ్లుగా మారాయి. వందలాదిమందికి ఈ స్మశానం ఏళ్లతరబడి నివాసంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే.. వీరందరి ఊరూ ఇదే. అసలు శవాల మధ్య ఉంటున్నామన్న ఆలోచనే వీరికి ఉండదు. జనం మధ్య ఉన్నట్లే ఫీలవుతారు. అలాగే జీవిస్తారు. చెప్పాలంటే.. సమాధులే వీరికి సర్వస్వం. ఇవే గాలిదుమ్ములకు అడ్డుగోడలు. అందుకే.. వంటావార్పూ చేసుకునేది దీనిపక్కనే. అంతేనా.. ఇక్కడ ఉండేవారికి డైనింగ్ టేబుళ్లూ ఇవే. ఏదో సమాధిపై కూర్చోవడం.. హాయిగా భోజనం చేయడం స్మశానంలో అడుగుపెట్టినవారికి కనిపించే సర్వసాధారణ విషయం. ఓవైపు శవాలు కాలుతుంటే.. మరోవైపు.. ఏమీపట్టనట్టు.. ముద్దమీద ముద్దలాగిస్తుంటారు. అలాగని వారిని తప్పుపట్టలేం. ఇక విశ్రాంతికి వేదికలు కూడా ఈ సమాధులే. పగలంతా కాయకష్టం చేసి అలసిసొలసి వచ్చిన వారికి.. రాత్రికి కుషన్‌పరుపులు కూడా ఇవే. సమాధుల చుట్టూనే ఇళ్లు కాదు.. ఇళ్లల్లోనూ సమాధులు ఉంటాయి. అయితే.. ఇవి సామాన్లు పెట్టుకునే స్టాండులుగా మారిపోతాయి. వీరి కళ్లముందే.. ఎన్నో శవదహనాలు.. మరెన్నో ఖననాలు జరుగుతూనే ఉంటాయి. శవాల వాసనతో.. ఈ ప్రాంతమంతా కంపుగొడుతూనే ఉంటుంది. ఏడ్పులతో హృదయవిదారకరంగా మారుతుంది. అయినా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయరు. వాటిని చూస్తూ ఉండడం వీరి దినచర్యలో ఓ భాగంగా మారిపోయింది. చెప్పాలంటే.. స్మశానంలో ఓ స్లమ్‌కాలనీగా ఈ ప్రాంతం మారిపోయింది.
ఉండాలని లేదు
ఇష్టపడి ఉండడం వేరు.. కష్టమైనా ఉండడం వేరు. ఈ రెండో కేటగిరీ కిందకు వస్తారు.. బన్సీలాల్‌పేట వాసులు. ఈ స్మశానంలో నివాసాలు నిన్నా మొన్నా మొదలైనవి కాదు.. దాదాపు నలభై ఏళ్లక్రితమే దీనికి పునాధి పడింది. పుట్టిన ఊళ్లలో ఉపాధి లేకపోవడంతో.. దశాబ్దాల క్రితమే కడుపు చేతబట్టుకొని రాజధానికి వలసవచ్చిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కిరాయి ఇళ్లలో ఉండే స్తోమత లేకపోవడంతో.. రోడ్ల పక్కన.. ఖాళీ స్తలాల్లో.. టెంట్లు వేసుకుని వీరంతా ఉండడం మొదలుపెట్టారు. మనరాష్ట్రం నుంచే కాక.. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచీ ఎంతోమంది హైదరాబాద్‌కు ఇలా చేరుకున్నారు. వారిలో కొంతమందికి ఆశ్రయమిచ్చింది.. బన్సీలాల్‌పేట స్మశానం. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నా.. ఆ తర్వాత ఇక్కడే ఉండక తప్పలేదు. ఇలా స్థిరపడ్డ వారిలో ఇప్పుడు మూడోతరం కూడా వచ్చేసింది. పెద్దలు ఎలాగోలా ఉంటారనుకుంటే.. పసివాడని పిల్లలూ సమాధుల్లో విహరిస్తుంటారు. సమాధులపైనే.. కథలూ.. కబుర్లూ చెప్పుకుంటారు.. వాటి చుట్టూనే ఆటలాడుకుంటారు. ఓవైపు.. ఎముకలు, పుర్రెలు పడిఉన్నా.. ఏమీ పట్టనట్టు ఆడుకుంటారు. వీరి కళ్లముందే.. ఎన్నో శవాలను పాతిపెడుతుంటారు.. గోరీలు కడుతుంటారు.. వాటి మధ్యే వీరి జీవితం పరుగులు పెడుతోంది. పైకి ఏమీ తెలియనట్టే ఉన్నా.. మనసులో మాత్రం ఈ పిల్లల్లో బయటకు కనిపించని అలజడి. తెలియని భయం. ఇక రాత్రిపూట వచ్చే శబ్దాలకు కంటిమీద కునుకు కూడా పట్టదు. అసలే స్మశానం. పగలు బాగానే ఉన్నా.. చీకటికమ్మేకొద్దీ.. భయపెడుతుంది. ఆకు కదిలినా భయమే.. చిన్నపాటి శబ్దం వినిపించినా భయమే. తల్లిదండ్రులు ఏమీ ఉండవని చెప్పినా.. పిల్లలకు మాత్రం ఎక్కడ దెయ్యాలు వస్తాయో అన్న భయంతో ప్రతీరాత్రి గండంగానే గడుస్తుంది. దీనికి తోడు చుట్టుపక్కల పిల్లలు చెప్పే కథలు మరింత వణికిస్తాయి.
ప్రభుత్వ గుర్తింపు
సమాధుల మధ్యే సాగుతున్న వీరి జీవితానికి ప్రభుత్వ గుర్తింపు కూడా వచ్చింది. అందుకే.. ఇదే అడ్రస్‌లో ఉన్నట్లు.. రేషన్‌కార్డులు కూడా జారీ చేసింది. ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డులు, చాలామందికి ఓటరు గుర్తింపు కార్డులు కూడా ఉన్నాయి. ఇలా ప్రభుత్వం స్మశానం మధ్యే ఉండమంటోంది తప్ప.. వారిని బయటకు తీసుకొచ్చే ఆలోచనే చేయడం లేదు. ఒకప్పుడు బన్సీలాల్‌పేట స్మశాన వాటిక దాదాపు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కానీ.. ఆక్రమణల ఫలితంగా రెండు ఎకరాలకు చేరుకుంది. ఈ రెండున్నర ఎకరాల్లోనే.. ఇలా వలసవచ్చిన వారితో ఈ కాలనీ వెలిసింది. స్మశాన్ని మరింత చిన్నది చేసింది. సమస్యను మరింత పెద్దది చేసింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి