20, ఏప్రిల్ 2009, సోమవారం
రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెర
రాష్ట్రంలో మలిదశలో జరుగనున్న ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 16వ తేదీన ఉత్తరాంధ్ర, తెలంగాణా జిల్లాలలో ఎన్నికలు జరిగాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈనెల 23న పోలింగ్ జరుగనుంది. ఈ దశంలో తొలిదశలో పోలింగ్ జరగని 140 అసెంబ్లీతో పాటు 20 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల ప్రచార ముగింపు సమయం దగ్గర పడుతుండటంతో వివిధ రాజకీయ పార్టీల నేతల ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేశారు. వామపక్షాలు, భాజపా అగ్రనాయకులు రాఘవులు, నారాయణ, దత్తాత్రేయ, పలువురు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు నగరానికి విచ్చేశారు. ఇంకా రెండు రోజులలో కొంతమంది నగరంలో మకాం వేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ అగ్రనాయకులలో ఎమ్మెల్సీ పాలడగు వెంకట్రావు, నాగేందర్, వినోద్‌రెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులు ఇప్పటి వరకు రాగా, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నగరంలో రోడ్డు షో నిర్వహించారు. సినీ నటుడు బాలకృష్ణ ఆదివారం రోడ్డుషో నిర్వహించారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి నాలుగు రోజుల క్రితం రోడ్డు షో పూర్తి చేశారు. మొత్తం మీద వీరంతా నిర్వహించే రోడ్డు షోలలో ప్రజలు బాగా పాల్గొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పోలింగ్‌కు కావల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రానికి బ్యాలెట్ పేపరును అనుసంధానం చేసే పనిని పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బందికి చివరిసారిగా మంగళ, బుధవారాలలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తొలివిడత పోలింగ్ సందర్భంగా ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈవీఎంల పనితీరుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి