అమెరికా ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. సమస్యకు కారణమైన ఒబామా కేర్‌పై డెమోక్రాట్లు మెట్టుదిగడం లేదు.. రిపబ్లికన్లు పంతం వీడడం లేదు. ఒబామా కేర్ ను పక్కన పెడితేనే బడ్జెట్‌ను ఆమోదిస్తామని రిపబ్లికన్లు తేల్చి చెప్పగా, అది లేకుండా బడ్జెట్ అవసరమే లేదంటున్నారు డెమోక్రాట్లు. రిపబ్లికన్ల వల్లే షట్‌డౌన్ దాపురించిందంటూ భారీగా ప్రచారం జరగుతుండడంతో, వాళ్లు ఎప్పటికైనా వెనక్కి తగ్గాల్సిందేనన్న ఆశతో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ఒబామా. అయితే, అమెరికన్లు మాత్రం అటు రిపబ్లికన్లు, ఇటు డెమోక్రాట్లపై మండిపడుతుండడంతో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. బడ్జెట్ ఆమోదించకుండా చర్చలే ఉండవన్న డెమోక్రాట్ లీడర్ల మాటలను పక్కన పెట్టి, సెనెట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని రెండు పార్టీల నేతలను చర్చలకు పిలిచారు. వైట్ హౌస్‌లో భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున మూడు గంటలకు ఈ చర్చలు మొదలయ్యాయి. హౌస్ స్పీకర్ బోయ్హెనర్, మైనార్టీ లీడర్ నాన్సి పెలోసి, సెనేట్ మెజార్టీ లీడర్ రీడ్, మైనార్టీ లీడర్ మెక్ కనల్తో సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు ఒబామా. పంతాలను పక్కనపెట్టిన బడ్జెట్‌ను ఆమోదించాలని కోరారు. దాదాపు గంట సేపు జరిగిన ఈ చర్చలు ఎలాంటి పురోగతిని సాధించలేదు. దీంతో మూడోరోజూ అమెరికా షట్ డౌన్ తప్పడం లేదు.
షట్డౌన్పై జనంలో వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి, బడ్జెట్‌తో సంబంధంలేకుండా మిలటరీ, వృద్ధుల ఆరోగ్యం, మెడికల్ రీసెర్చ్లకు నిధులు అందించే బిల్లులను రిపబ్లికన్లు ఉభయసభల్లో ప్రవేశపెట్టారు. అయితే వీటిని ఆమోదిచంకుండా డెమోక్రాట్లు అడ్డుపడ్డారు. పరిస్థితి చూస్తుంటే, ఇప్పట్లో బడ్జెట్ పాస్ అయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో, తన ఆసియా టూర్‌ను కుదించుకున్నారు ఒబామా. వచ్చే వారం ఇండోనేషియా, బ్రూనైలో జరగాల్సిన సమావేశాలకు ఒబామా హాజరు కావాల్సి ఉంది. వీటితో పాటు మలేషియా, ఫిలిప్పైన్స్‌లోనూ పర్యటించడానికి ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. షట్‌డౌన్ నేపథ్యంలో మలేషియా, ఫిలిప్పైన్స్ పర్యటనలను రద్దు చేసుకున్నారు ఒబామా.
రెండోరోజూ ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు తెరుచుకోకపోవడంతో అమెరికన్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నాసా లాంటి కీలక సంస్థల వెబ్ సైట్లు కూడా మూతబడ్డాయి. అటు ఉద్యోగులు కూడా జీతం లేని సెలవుల్లో వెళ్లాల్సిరావడంపై మండిపడుతున్నారు. తక్షణం బడ్జెట్‌ను ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి