అయితే.. మహాశివుడు కొలువైఉన్న కేదర్ నాథ్ ఆలయం మాత్రం చెక్కుచెదరకపోవడం విశేషం. ఆలయం చుట్టూ ఉన్న రెయిలింగ్ కొట్టుకుపోయినా, ఆలయం పక్కన ఇటీవలికాలంలో నిర్మించిన భవనాలు నామరూపాల్లేకుండా పోయినా, శతాబ్దాలకాలం నాటి అత్యంత పురాతన భవనమైన ఆలయానికి మాత్రం చిన్న బీటకూడా వారలేదు.
కేదర్ నాథ్ ఆలయాన్ని మహాభారత యుద్ధానంతరం పాండవులు నిర్మించారని ప్రతీతి. దీనికి జగద్గురు ఆదిశంకరాచార్యులు జీర్ణోద్ధరగావించారంటారు. దాదాపు ఎనిమిదో శతాబ్ధంలో ఇండోర్ మహారాజు, ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. అంటే ఈ ఆలయాన్ని కట్టి దాదాపు 1200 ఏళ్లకు పైగా అయ్యిందన్నమాట. మహాప్రళయాన్ని తట్టుకునే శక్తి ఈ ఆలయానికి ఎలా వచ్చిందన్నదానికి ఆసక్తికరమైన, అద్భుతమైన వాస్తవాలు నిర్మాణంలోనే దాగి ఉన్నాయి. ఈ ఆలయాన్ని కట్టడానికి నాణ్యమైన, అత్యంత బలమైన రాళ్లను, కర్రను ఉపయోగించారు. రాళ్లను ఒకదానిపై మరొకటి పేర్చేటప్పుడు అంతర్గత అనుసంధాన పద్ధతిని(ఇంటర్ లాకింగ్) ను ఉపయోగించారు.
దీన్ని కూడా రెండు రకాలుగా ఉపయోగించారు. ఓ రాయికి మరో రాయి మధ్య ఇనుప ముక్కలను దూర్చారు. బయట ప్రాకారంలో కూడా రెండు వరసలను కలుపుతూ ప్రత్యేకంగా ఇనుపముక్కలను అతికించారు. దీంతో రాళ్లు ఏమాత్రం కదలకుండా ఉండగలిగాయి. అప్పట్లోనో ఇంత అద్భుతమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, ఇప్పటి పరిశోధకులను, ఇంజనీర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక రెండోది కొండపై నుంచి వెల్లువెత్తిన వరద ప్రవాహం ముందుగా తాకింది కేదర్ నాథ్ ఆలయాన్నే. ఆ సమయంలో కొన్ని పెద్ద పెద్ద రాళ్లు ఆలయం వెనుకకు వచ్చి ఆగిపోయాయి. వరద ఉధృతిని కొంతవరకూ ఇవి తగ్గించడం వల్ల కూడా ఆలయానికి ఏమీ జరగలేదని కొంతమంది చెబుతున్నారు. అయితే, అప్పటి అద్భుతమైన నిర్మాణ కౌశలమే కేదరీనాథ్ ను నిలబడేలా చేసిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి