12, సెప్టెంబర్ 2011, సోమవారం
అజహర్ కొడుకుది నిజంగా ప్రమాదమేనా?
Categories :
azhaharuddin . bike racing . news . TOP
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై, పుప్పాల గూడ టోల్ గేట్ కు సమీపంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన అజహరుద్దీన్ కొడుకు ఆయూజుద్దీన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. పూర్తిగా వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతోంది. అపోలో ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు ఆయూజ్.
ఆయూజ్ ప్రమాదంలో చిక్కుకోవడానికి కారణం ఏమిటి? పత్రికలు, ఛానళ్లలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని కథనాలను ఇస్తున్నాయి. నిజంగా రోడ్డు ప్రమాదంలోనే ఆయూజ్ గాయపడ్డాడా..? రోడ్డు ప్రమాదమే అయితే.. తెల్లవారుఝామున ఔటర్ రింగ్ రోడ్డుపై అదీ 1000సీసీ బైక్ మీద దూసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? ఇదే అసలు ప్రశ్న.
కీలకమైన సమాచారం ప్రకారం, బైక్ రేసింగ్లో ఆయూజ్ పాల్గొన్నాడు. లక్ష రూపాయల పదెంలో తన థౌజెండ్ సీసీ బైక్ పై దూసుకెళుతున్నాడు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళుతున్న సమయంలో పుప్పాలగూడ టోల్ గేటు సమీపంలో ప్రమాదవశాత్తూ బైక్ క్రాష్ అయ్యింది. అయితే.. రేసింగ్ లో ఉన్న ఇతర పార్టిసిపెంట్స్ వల్ల పడిపోయాడా.. లేక, బ్రేక్ వేయబోయి బ్యాలెన్స్ తప్పి పడిపోయాడా అన్నది తేలాల్సి ఉంది. అత్యంత వేగంతో వెళుతున్నసమయంలో పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న ఆయూజ్ కు తలకు హెల్మెట్ ఉన్నా.. అది ఛిద్రమైపోయింది. ఇక ఏమాత్రం రక్షణ లేకుండా వెనుక కూర్చున్న ఆజ్మల్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించగానే ప్రాణం కోల్పోయాడు. ప్రతీ ఆదివారం నగర శివార్లలో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై, అదీ తెల్లవారుఝామున బైక్ రేసింగ్స్ కొంతకాలంగా సాగుతున్నాయి. అయితే, ఈ విషయంలో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఇప్పుడు పెనుప్రమాదం జరగడానికి కారణమయ్యింది.
ప్రమాదం సంగతి తెలుసుకుని పోలీసులు వచ్చే సమయానికీ కొంతమంది బైక్ లతో ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్నట్లు సమాచారం. పోలీసుల రాకను గమనించి వాళ్లంతా పరారయ్యారు. ఇక రేసింగ్ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడం, పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో .. పైగా, గాయపడింది వీఐపీ కొడుకు కావడంతో ఎవరూ వాస్తవాలను రాయడానికి సాహసించడం లేదు.
ఇప్పటికే థౌజెండ్ సీసీ పైబడిన బైక్ లను కొన్న వీఐపీలు వరసగా ప్రాణాలు కోల్పోతున్నారు. బాబూమోహన్ కుమారుడు, కోట శ్రీనివాసరావు కుమారుడు గతంలో ఇలాంటి బైక్ లపై వెళ్తూ ప్రాణాలు పోగొట్టుకోగా, ఇప్పుడు ఆయూజ్ ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అసలు 60 కిలోమీటర్లకు మించి వెళ్లడానికీ పనికిరాని రోడ్లున్న హైదరాబాద్లో గంటకు 200-300 వేగంతో దూసుకెళ్లగలిగే బైక్ లకు పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారన్నది అర్థంకాదు. రవాణాశాఖ, పోలీసులు ఈ విషయంపై ఇకనైనా దృష్టి పెట్టాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మన రోడ్ల మీద బైక్‌లో అరవై డెబ్బై కిలోమీటర్ల స్పీడుతో పోతేనే సినిమా కనిపిస్తుంది. అలాంటిది వంద పైన పోతే యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయా? ఇప్పటికైనా తల్లి తండ్రులు మేల్కొని తమ పిల్లలని కట్టడి చేయడంతో బాటు, పోలీసులు కూడా ఈ రేసుల మీద ఉక్కు పాదం మోపాలి.