7, సెప్టెంబర్ 2011, బుధవారం
సరిగ్గా మూడు నెలల 13 రోజులు
మే 25, 2011... సెప్టెంబర్ 7, 2011.. రెండిటి మధ్యా సరిగ్గా మూడు నెలల పదమూడు రోజుల తేడా.. పైగా, అదీ బుధవారమే.. ఇదీ బుధవారమే. రెండూ ఢిల్లీలో పేలుళ్లే. మొదటిది స్వల్ప తీవ్రత గల బాంబు పేలుడైతే.. రెండోది భారీ తీవ్రత గల బాంబు పేలుడు. రెండూ జరిగింది ఢిల్లీ హైకోర్టు దగ్గరే. మన భద్రతపై ప్రభుత్వాలు ఎంత నిర్లక్షంగా వ్యవహరిస్తున్నాయో.. మన నిఘా వ్యవస్థలు ఎంత మొద్దు నిద్రపోతున్నాయో తెలుసుకునేందుకు.. తాజా పేలుడే ఓ నిదర్శనం.
ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామంటూ పదే పదే.. చెప్పిందే చెప్పే మన రాజకీయనేతలు, దాన్ని ఆచరణలో మాత్రం పెట్టరనడానికి ఢిల్లీ పేలుడే ఓ నిదర్శనం. ఒకే ప్రాంతంలో మూడున్నర నెలల్లోనే రెండోసారి పేలుడు సంభవించిందంటే అది మన పోలీస్ వ్యవస్థ వైఫల్యానికి అతిపెద్ద ఉదాహరణ.
ఢిల్లీ హైకోర్టులో బుధవారం నాడే ప్రజాప్రయోజన వ్యాజ్యాలను స్వీకరిస్తారు. ఆరోజు ఎప్పుడూ లేనంత రద్దీగా ఉంటుంది. కోర్టులోకి వెళ్లాలంటే జనం ఐదో నెంబర్ గేటు దగ్గర పాసులు తీసుకోవాలి. సరిగ్గా అంతా పాసులకోసం క్యూలో ఉన్న సమయంలో సూట్ కేసులో బాంబు తెచ్చి గుట్టుచప్పుడు కాకుండా పేల్చేశారు ఉగ్రవాదులు. ఈ దాడిలో 11 మంది చనిపోగా 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాద చర్యని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని చిదంబరం పార్లమెంట్ లో ప్రకటన చేస్తే, ప్రధాని ఢాకాలో ప్రకటించారు. కానీ, దేశంలో మరో పేలుడు జరగదని వీరు గ్యారెంటీ ఇవ్వగలరా..? ఉగ్రవాద దాడికి మరో ప్రాణం బలికాదని హామీ ఇవ్వగలరా..? అలా చెప్పే ధైర్యం, దమ్ము వీరికి ఉందా..? ఓ పేలుడు జరిగి మూడున్నర నెలలవుతున్నా, ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో మన సర్కార్ ఉంటే.. ఈ హామీలు ఇంకెక్కడినుంచి వస్తాయి..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి