11, మార్చి 2011, శుక్రవారం
తప్పు ఎవరిది?
తెలంగాణ సాధన కోసం చేపట్టిన మిలియన్ మార్చ్ విజయవంతం అయ్యింది. అదే సమయంలో హింసాత్మకమూ అయ్యింది. దాడులకు తెగబడింది తెలంగాణ వాదులేనని ఓ వర్గం.. కాదు కాదు.. మఫ్లీలో ఉన్న పోలీసులని మరో వర్గం.. వాళ్లూ కాదు నక్సలైట్లేనంటూ మరో వర్గం.. ఎవరికి తోచిన ప్రకటన వారు చేసేశారు. కానీ, అది నిజమేనా.. అసలు ట్యాంక్‌బండ్‌పై విధ్వంసం ఎందుకు జరిగింది?
"తెలంగాణ వాదులు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తామన్నారు.. కానీ దాన్ని హింసాత్మకంగా మార్చారు. ధ్వంస రచన చేశారు" సీమాంధ్ర నేతలు చెబుతున్న మాట ఇది. "మార్చ్ హింసాత్మకమవుతుందనే అనుమతి ఇవ్వలేదు" సభలో హోంమంత్రి ప్రకటన. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల ధ్వంసానికి తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యమాన్ని నడిపిస్తున్న కోదండరామ్, కేసీఆర్ లాంటి నేతలే బాధ్యత వహించాలన్నది ఆంధ్రా నేతల డిమాండ్. అంతా బాగుంది.. కానీ, మిలియన్ మార్చ్ శాంతియుతంగా నిర్వహించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందా..? అడుగడుగునా అడ్డంకులు సృష్టించి.. ఉద్యమకారులను నిర్భంధించి.. వీలైనంతవరకూ మార్చ్‌ను నిర్వహించకుండా చేయాలనే అనుకుంది. బారికేడ్లను, ముళ్లకంచెలను ఏర్పాటు చేసి జనాల్ని రోడ్డుమీదే తిరగకుండా చేసేసింది. కానీ, మార్చ్‌ను ఆపలేకపోయింది.
ఇక్కడ మనం చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆందోళనకారులను కట్టడి చేయడానికి, ఓ క్రమపద్ధతిలో మార్చ్‌ను నిర్వహించకుండా చేసింది పోలీసులు. ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న లీడర్లను అరెస్ట్ చేయకుండా ఉండే పరిస్థితి మరోలా ఉండేదనడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా, బాధ్యతను పూర్తిగా వారిమీదే పెట్టే అవకాశం పోలీసులకు ఉండేది. విగ్రహాలు ధ్వంసం కాకుండా చూసే పరిస్థితి ఉండేది. లీడర్లను అరెస్ట్ చేసినప్పుడు ట్యాంక్‌బండ్‌పైకి చేరిన వారిని కంట్రోల్ చేసే వారే లేరు. పైగా, ఉద్యమాన్ని అణిచివేస్తున్నారన్న ఆవేశం ఆందోళనకారుల్లో స్ఫష్టం కనిపించింది. అదే విగ్రహాలపై దాడికి పురిగొల్పింది. మీడియాపై దాడి చేసినా, అది అందులో భాగమే.
ఇంటర్ పరీక్షకు ఇబ్బంది కలగకూడదని మార్చ్‌ను ఉదయం నుంచి మధ్యాహ్నానికి మార్చుకున్న విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తించలేదు. విద్యార్థులకోసం అంత దిగి వచ్చినప్పుడు.. మార్చ్‌కు అనుమతి ఇస్తే ప్రభుత్వం సొమ్మేం పోయింది. లేదంటే, ఆ మార్చ్‌ను అధికారికంగా ఇందిరాపార్క్ దగ్గర నిర్వహించుకోడని చెబితే, తెలంగాణ వాదులు దానికీ అంగీకరించేవారేమో..? ఇవన్నీ చేయకుండా, ఇప్పుడు విగ్రహాలు కూలిపోయాయని, తెలంగాణ వాదులు అరాచక శక్తులని చెప్పడం సరికాదు.
తెలంగాణ వాదులు కూడా ఓ విషయాన్ని స్ఫష్టంగా తెలుసుకోవాలి. దాడులు, దౌర్జన్యాలతో ఉద్యమ స్వరూపం మారిపోతుంది. లక్ష్య సాధన కష్టమవుతుంది. నిర్భంధం మరింత ఎక్కువవుతుంది. పైగా, సంఘ విద్రోహశక్తులు ఇలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. వాటిని తమ స్వార్థానికి వాడుకొంటాయి. శాంతియుతంగా పోరాడితే, తుపాకులు సైతం ఏమీ చేయలేవని నిరూపించిన చరిత్ర మన భారతీయులది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రస్తుతం జరిగిన హింసాత్మక ఘటనలకు మాత్రం ప్రభుత్వానిదే భాద్యత.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
baagaa samardinchu kunnaaru..rEpulu chEsEvaadu...murder lu chEsEvaallu koodaa vaallavaalla reasoning lu cheptaaru...vaallanee tappu pattakoodadoo..maree..haa haa..