11, మార్చి 2011, శుక్రవారం
మరోసారి ముంచెత్తిన సునామీ
ప్రళయం...మహా ప్రళయం.... జపాన్‌లో ప్రకృతి ప్రకోపం...జపాన్ టోక్యో సముద్ర గర్భంలో సంభవించిన భూకంపం మహోగ్రంగా మారి.... సునామీగా మారింది. టోక్యోకు సమీపంలో సముద్ర గర్భంలో భూకంపం సంభవించింది. జపాన్ ఉత్తర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారింది. సముద్రపు నీరు ఊళ్లకు ఊళ్లను ముంచెత్తడంతో... పరిస్థితి భయానకంగా మారింది. రిక్తర్ స్కేల్‌పై 8.4గా భూకంప తీవ్రత నమోదైంది. మొత్తం జపాన్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆయిల్ రిఫైనరీలు తగలబడతున్నాయి. ఎయిర్ పోర్టులు నీటమునిగాయి. ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నారు. జపాన్‌లో సంభవించిన సునామీ ఆగ్నేయాసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. రష్యాకు కూడా ముప్పు పొంచి ఉంది. ఈ నెల 19న చంద్రుడు భూమికి అతి దగ్గరగా రానున్నాడు. సూపర్ మూన్ ప్రభావంతో... భారీ విధ్వంసం తప్పదని శాస్తవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. దానివల్లే ఇప్పుడు ఈ సునామీ వచ్చిందా అన్నది ఇంకా తేలలేదు..
జపాన్‌లోని సుండాయ్ నగరం సునామీ దెబ్బకు తీవ్రంగా నష్టపోయింది. రోడ్లపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా సముద్రపు నీరు నగరంలోకి ప్రవేశించింది. ఏదో ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేసినట్టు, గేట్లు తెంచుకుని నీరు ముందుకు ఉరికినట్టు .... తీరం నుంచి అతివేగంగా నీరు నగరంపై పడింది. అంతే రోడ్లపై ఉన్న కార్లు మునిగిపోయాయి. ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయాయి. వాహనాల్లో ఉన్నవారిలో కొందరికి బయటకు వచ్చే అవకాశం కూడా చిక్కలేదు. చూస్తుండగానే నీటిమట్టం పెరిగిపోయి... భవనాలూ మునిగిపోయాయి. సెండాయ్ నగరం మొత్తం అల్లోకల్లోలమైంది. సునామీతో జపాన్ ఉత్తర ఫసిఫిక్ కోస్ట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అలలు 10 మీటర్ల ఎత్తు ఎగిసిపడ్డాయి. సముద్రంలో లంగరు వేసిఉన్న భారీ నౌకలుకూడా ఆ ఉధృతికి తీరంవైపు కొట్టుకువచ్చాయి. గత 16 ఏళ్లలో ఇంతటి భయంకరమైన భూకంపం, సునామీ రావటం ఇదే తొలిసారి. రష్యా, తైవాన్, ఫిలిప్పీన్, మార్షల్ ఐలాండ్స్, ఇండోనేషియా, హవాయ్‌లకు కూడా సునామీ అలెర్ట్ ఇచ్చారు. అయితే మన దేశానికి ఎలాంటి ప్రమాదం లేదని వాతావరణ విభాగం తెలిపింది. జపాన్ సునామీకి సంబంధించిన తాజా వీడియోను, సముద్రపు నీరు ఎలా నగరంలోకి చొచ్చుకువస్తుందో కనిపించే దృశ్యాలను కింద ఉన్న వీడియోలో మీరు స్పష్టంగా చూడవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి