పోలీసుల దిగ్భంధాలు.. అడ్డంకులు.. బ్యారికేడ్లు.. ఇనుపకంచెలు.. తెలంగాణ వాదులను ఏమాత్రం అడ్డుకోలేకపోయాయి. పోలీసులు అణిచివేయాలని చూసిన మిలియన్ మార్చ్ దిగ్విజయం అయ్యింది. అంచనాలకు మించి జనం ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను పీకి పక్కన పడేసి మరీ, ట్యాంక్‌బండ్‌పైకి దూసుకుపోయారు. మిలియన్ మార్చ్‌కు అనుమతి లేదంటూ.. భారీగా అరెస్టులు చేసినా ఉద్యమకారులను మాత్రం ఆపడంలో విఫలమయ్యారు. చివరకు, ట్యాంక్‌బండ్‌వైపు దూసుకువస్తున్నవారిని అడ్డుకోలేక పోలీసులు చేతులు ఎత్తివేశారు. అసలు ముందే, అనుమతి ఇచ్చి ఉంటే ఈ కార్యక్రమం ఎంతో ప్రశాంతంగా జరిగేది. కానీ, పోలీసుల అత్యుత్సాహం, ప్రభుత్వం నిర్లక్ష్యం.. మిలియన్ మార్చ్‌కు అనుమతినివ్వకుండా చేశాయి. దీంతో ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమంలో కొన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మిలియన్ మార్చ్ సందర్భంగా జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు.
- ప్రొఫెసర్ కోదండరామ్‌ను మధ్యాహ్నమే అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిలియన్ మార్చ్ విజయవంతం కావడంతో సాయంత్రం వదిలిపెట్టారు.
- గన్‌పార్క్ నుంచి వస్తున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు కర్రసాము చేస్తూ పోలీసులను ప్రతిఘటించారు. పోలీసుల వ్యాన్‌లో నుంచి తప్పించుకొని హరీశ్‌రావు, రవీంద్రారెడ్డిలు నెక్లెస్‌రోడ్‌కు చేరుకున్నారు. జలవిహార్ నుంచి బోట్‌లో బుద్దుని విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా, నీటిలో దూకుతామంటూ బెదిరించారు.
- ట్యాంక్‌బండ్‌కు ర్యాలీగా బయలుదేరిన టీడీపీ ఎమ్మెల్యేలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
- మధ్యాహ్నం రెండు గంటల నుంచి ట్యాంక్‌బండ్‌పైకి చేరుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. పోలీసులు కూడా ఏమీ చేయలేక, పక్కకు తప్పుకున్నారు. కొంతమందిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినా, ప్రతిఘటించడంతో వెనుదిరిగారు.
- ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్‌లో పాల్గొనడానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు కె.కేశవరావు, మధు యాష్కిలపై విద్యార్థులు దాడి చేశారు. కాంగ్రెస్ నేతల వల్లే తెలంగాణ ఆలస్యమవుతోందంటూ విమర్శించారు. తోపులాట జరగింది. కేశవరావుపై ఏకంగా చెప్పులనే విసిరారు. దీంతో వీరిద్దరూ వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.
- నేతలపై దాడి మఫ్టీ పోలీసుల పనేనని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ విమర్శించారు.
- సాయంత్రం నాలుగు గంటల సమయానికి కేసీఆర్ ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. పోతనామాత్యుడి విగ్రహం దగ్గర ఆయన ప్రసంగించారు. అక్కడే ఆటపాటలను నిర్వహించారు.
- శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తామన్నా అనుమతించకుండా ప్రభుత్వం అష్టకష్టాలు పెట్టినందుకు నిరసనగా ట్యాంక్‌బండ్‌పై కొన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు. పలానాటి బ్రహ్మనాయుడు విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసి హుస్సేన్‌సాగర్‌లో పడేశారు. అన్నమయ్య, శ్రీకృష్ణదేవరాయులు, ఎఱ్ఱాప్రగడ, జాషువా, శ్రీశ్రీ విగ్రహాలు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
- ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపైనా దాడి చేశారు. ఏబీఎన్, జీ24 గంటలు కెమెరాలను ధ్వంసం చేశారు. ఈటీవీ లైవ్ వ్యాన్‌పై దాడి చేశారు.
- ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనలేదు. ఉదయం నుంచి మిలియన్ మార్చ్‌కు నేతలు దూరంగా ఉన్నారు.
10, మార్చి 2011, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి