30, డిసెంబర్ 2010, గురువారం
మళ్లీ గర్జిస్తున్న గుజ్జర్లు
పోరాటం.. మహా పోరాటం.. ప్రభుత్వాన్ని గడగడలాడించే ఉద్యమం. రాజస్థాన్‌లో గుజ్జర్లు సాగిస్తున్న పోరాటం అది. రిజర్వేషన్ల కోసం రెండేళ్లుగా పోరాడుతున్న గుజ్జర్లు మరోసారి తమ దెబ్బను ప్రభుత్వానికి రుచిచూపిస్తున్నారు. ఈ పోరాటం రోజురోజుకూ తీవ్రమవుతుందే తప్ప.. ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. అసలు గుజ్జర్లు ఎందుకు పోరాటం చేస్తున్నారు.. వాళ్లకు కావల్సింది ఏమిటి?
గుజ్జర్లకు కావాల్సింది ఒక్కటే.. అధికారంగా ఎస్టీలుగా గుర్తింపు. దాని సాధన కోసమే.. రాజస్థాన్‌లో మళ్లీ ఉద్యమానికి దిగారు. ఈ సారి మరింత తీవ్రంగా పోరాటం చేయాలనుకుంటున్నారు గుజ్జర్లు. తమకు రిజర్వేషన్ కల్పించడంలో కాంగ్రెస్ సర్కార్ ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. డిసెంబర్ 21 నుంచి ఉద్యమం మొదలుపెట్టారు.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా కేంద్రంగా గుజ్జర్ల ఆందోళన మొదలయ్యింది. రిజర్వేషన్ల విషయంలో ఎలాగైనా ప్రభుత్వాన్ని కిందకు దించాలని సంకల్పం పూనిన ఈ ఉద్యమకారులు... జనజీవనాన్ని స్తంభింపచేసే కార్యక్రమాలను మొదలుపెట్టారు. రైళ్లను అడ్డుకొన్నారు. వేలాది మంది గుజ్జర్లు రైల్వే పట్టాలపై కూర్చుని, రైళ్లను అడ్డుకుంటున్నారు. కేవలం రైళ్లు మాత్రమే కాదు.. రోడ్డు మార్గాలనూ గుజ్జర్లు మూసివేశారు. హైవేలపై వాహనాలను తిరగనివ్వడం లేదు. అన్ని రకాల మార్కెట్లనూ మూసివేయించారు. పూర్తిస్థాయి బంద్‌కు పిలుపునిచ్చారు.
దీనికి తోడు.. డిసెంబర్ 22న రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు... ఆందోళనలను మరింత పెరిగేలా చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో గుజ్జర్లకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించనక్కర్లేదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో గుజ్జర్లతో పాటు, మరికొన్ని వెనుకబడిన వర్గాల్లో అవగహానను కలిగించాలంటూ అశోక్ గెహ్లాట్ సర్కార్‌కు సూచించింది. ఈ తీర్పుపై గుజ్జర్ల ఉద్యమ నేత కల్నల్ కిరోరి సింగ్ భైంస్లా నేతృత్వంలో సమావేశమైన గుజ్జర్లు.. తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే గుజ్జర్లకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చిందని ఉద్యమ నేతలు ఆరోపిస్తున్నారు.
ఢిల్లీపైనే గురి
గుజ్జర్ల పోరాటం తీవ్రరూపం దాల్చుతోంది. రాజస్థాన్‌లో మొదలైన మలివిడత పోరాటం.. ఇప్పుడు ఢిల్లీకి పాకింది. దేశ రాజధానిని నిర్భందిస్తే తప్ప.. ప్రభుత్వం దిగిరాదని భావిస్తున్న గుజ్జర్లు.. తమ ఆందోళలను ఢిల్లీ వైపు మళ్లించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై చాలాకాలంగా పోరాటం చేస్తున్న గుజ్జర్లు ప్రధానంగా రెండే రెండు డిమాండ్లను చేస్తున్నారు. మొదటిది విద్య ఉద్యోగావకాశాల్లో 5 శాతం రిజర్వేషన్‌ను కల్పించడమైతే.. రెండోది ఎస్టీ హోదా. రాజస్థాన్‌లో మాత్రమే పోరాటం చేస్తే తమను పట్టించుకోవడం లేదనుకుంటున్న గుజ్జర్లు ఇప్పుడు ఢిల్లీని దిగ్బంధిస్తున్నారు.
రాజస్థాన్‌లో ఆందోళనలు చేస్తున్న గుజ్జర్లకు హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని గుజ్జర్లు మద్దతు ప్రకటించారు. అంతా కలిసికట్టుగా ఉద్యమం సాగిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లే ఎనిమిదో నెంబర్ జాతీయ రహదారిని దిగ్భధిస్తున్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ జోక్యం చేసుకోవాలని గుజ్జర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హైవేలను దిగ్భంధిస్తున్న గుజ్జర్లు రైలు మార్గాలకూ అడ్డంకులు సృష్టించాలనుకుంటున్నారు.
అంతులేని పోరాటం
గుజ్జర్ల పోరాటం అంటే ఆషామాషీ వ్వవహారం కాదు. ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడంలో గుజ్జర్లకు గుజ్జర్లే సాటి. ఆందోళనలు అత్యంత పకడ్బందీగా.. కలసికట్టుగా సాగించడంలో వారి వ్యూహమే వేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకేసారి కలకలం పుట్టించగలిగే శక్తి వారి సొంతం. సునామీ విరుచుకుపడితే ఎంత భీకరంగా ఉంటుందో.. అంతే తీవ్రంగా ఉంటుంది గుజ్జర్ల ఆందోళన. చిన్న చిన్న ధర్నాలు.. నిరాహారదీక్షలు.. మొక్కుబడి ఆందోళనలు వారికి చేతకావు. చెప్పాలంటే దేశవ్యాప్తంగా సాగే ఆందోళనలు వేరు, గుజ్జర్ల ఆందోళన వేరు. సాధారణ ఉద్యమాలతో పోల్చితే, వీరి ఉద్యమం ఎంతో తీవ్రంగా ఉంటుంది. పైగా.. వారిది సంఘటిత పోరాటం. సమైక్య సిద్ధాంతం.
గుజ్జర్లు అందరిలాంటి వారే. వారిలోనూ ఎన్నో బేధాభిప్రాయాలున్నాయి. రాజకీయ వైరుధ్యాలున్నాయి. కానీ, లక్ష్య సాధన విషయానికి వస్తే మాత్రం అంతా ఒక్కటే. పైగా, పిల్లలు, పెద్దలు, ముసలీ ముతకా చివరకు మహిళలు కూడా ఈ పోరాటంలో చురుగ్గా పాల్గొంటారు. ఆందోళన చేయాలని నిర్ణయించుకోవడం ఆలస్యం.. అంతా కలిసికట్టుగా పోరాటం మొదలుపెడతారు. ఎలాగైనా రిజర్వేషన్‌ను సంపాదించుకోవాలన్నదే గుజ్జర్ల లక్ష్యం.
ఆందోళన ఎలా చేస్తే ప్రభుత్వాలు కదిలివస్తాయో గుజ్జర్లకు బాగా తెలుసు. పైగా ఒకేసారి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల్లో కలకలం పుట్టించడమూ వారికి బాగా తెలుసు. అందుకే.. వారి మొదటి టార్గెట్ రైల్వేలైన్లు. నాలుగేళ్లుగా ఆందోళన చేస్తున్న ప్రతీసారి ముందుగా అడ్డుకొంది రైళ్ల రాకపోకలనే. వారి వ్యవహారం రాజకీయ పార్టీలు చేసినట్లు, పదిపదిహేను మంది వచ్చి, అరగంటో గంటో రైల్‌రోకో చేసి వెళ్లిపోయినట్లు ఉండదు. వేలాదిమంది విరుచుకుపడతారు. జనసంద్రాన్ని తలపిస్తారు. ఒక్కసారి కమిట్ అయితే చాలు వేలాది మంది పట్టాలపైకి వచ్చి కూర్చుంటారు. గంటలు, రోజులు గడిచినా అడుగు కూడా కదపరు. పట్టాలపైనే టెంట్లు వేసేస్తారు. తిండీతిప్పలూ అక్కడే కానిచ్చేస్తారు. పట్టాలపైనే నిద్రపోతారు. గుజ్జర్లు పట్టాలెక్కారంటే.. ఆ పట్టాలపైకి ఇక రైళ్లెక్కవు. మరో దారి చూసుకుంటాయి. చాలా ట్రైన్లు రద్దైపోతాయి. రాజస్థాన్‌లో ఇలానే అలజడి సృష్టిస్తున్నారు గుజ్జర్లు. పట్టాలపై రాళ్లు పోయడం.. పట్టాలను విరగొట్టడం.. పట్టాల కింద సపోర్టింగ్ కోసం వేసిన కంకరను తొలగించడం.. ఇలా మరెన్నో పనులకూ తెగబడతారు.
ఇక హైవేలపై అయితే.. మరీ విధ్వంసాలకు పాల్పడతారు. చెట్లను నరికి రోడ్లపై వేసేస్తారు. లారీలు, బస్సులు వేటినీ కదలనివ్వరు. రోడ్లపైనా గుమికూడి, ప్రతీ దానికీ అడ్డం పడతారు. ఇక బంద్‌లు, రాస్తారోకోలు మామూలే. గుజ్జర్లకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ... రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, ఈ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు.
అసలు గుజ్జర్లు ఎవరు?
రాజస్థాన్‌లో ఎస్టీ గుర్తింపు కోసం పోరాడుతున్న గుజ్జర్లు కొన్ని శతాబ్దాల క్రితం రాజ్యపాలకులు. ఇప్పుడు వెనకబడిన వర్గాలుగా గుర్తింపు పొందినా.. ఒకప్పుడు వీరంతా క్షత్రియులు. మధ్య ఆసియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారతదేశంలోకి వీరు ప్రవేశించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 7 వ శతాబ్దంలో గుజ్జర్లు ఓ వెలుగు వెలిగారు. రాజస్థాన్‌లో రాజ్యాన్ని కూడా స్థాపించారు. అయితే.. ఘజనీ మహ్మద్ దండయాత్రలతో వీరంతా చెల్లాచెదురయ్యారు. ఉత్తరభారతంలో అనేక ప్రాంతాలకు విస్తరించారు. ఆ తర్వాత చిన్న చిన్న రాజ్యాలు వీరి ఆధీనంలో ఉన్నా అక్భర్ కాలం నాటికి పూర్తిగా కనుమరుగయ్యాయి. అప్పట్లోనే చాలామంది గుజ్జర్లు ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ప్రస్తుతం హిందూ,ముస్లిం,సిక్, జైన్ మతాల్లో గుజ్జర్లున్నారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌ల్లోనూ గుజ్జర్లు ఉన్నప్పటికీ రాజస్థాన్‌లోని డాగా ప్రాంతంలోనే ఎక్కువమంది నివసిస్తున్నారు. ఆ రాష్ట్ర జనాభాలో దాదాపు 6 శాతం మంది గుజ్జర్లు ఉన్నట్లు అంచనా.
పాలకుల తప్పిదాలు
దశాబ్దాల తరబడి వీరికి అభివృద్ధి ఫలాలు అందకపోవడంతో.. గుజ్జర్లలో ఆందోళన మొదలయ్యింది. దీనికి తోడు 1994లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమూ ఇప్పటి ఉద్యమానికి కారణం అని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌లో ఉన్న గుజ్జర్లను ఎస్టీలుగా, రాజస్థాన్‌లో ఉన్న గుజ్జర్లను ఓబీసీల కేటగిరీలోనూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. రాజస్థాన్‌లో కీలక వర్గమైన జాట్‌లను 1999లో ఎన్డీఏ ప్రభుత్వం ఓబీసీల్లో చేర్చడం.. గుజ్జర్లలో మరింత ఆగ్రహాన్నికలిగించింది. సామాజికంగా, ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్న జాట్‌లను ఓబీసీల్లో చేర్చడంతో.. గుజ్జర్లకు విద్య,ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. దీంతో, తమను ఎస్టీలుగా గుర్తించి, 5 శాతం రిజర్వేషన్ కావాలని పోరు బాట పట్టారు.
2000 సంవత్సరంలో ఎస్టీ హోదా కోసం పెద్దఎత్తున డిమాండ్ చేశారు గుజ్జర్లు. అయితే.. 2003 అసెంబ్లీ ఎన్నికల నుంచి వీరి డిమాండ్‌కు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. ఎస్టీ హోదా ఇస్తామన్న హామీతో ఎన్నికల్లో గెలిచిన బీజేపీ.. ఆ తర్వాత దాన్ని నెరవేర్చలేదని ఉద్యమకారులు ఆరోపిస్తుంటారు. కానీ, బీజేపీమాత్రం ఆ హామీ ఇవ్వలేదంటుంది. అందుకే.. 2007లో పెద్ద ఎత్తున గుజ్జర్లు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రంలో జనజీవనాన్ని స్తంభింపచేశారు. కత్తులు, కర్రలు పట్టుకొని రైలు పట్టాలపై పడుకొని, హైవేల దిగ్భంధించి... అల్లకల్లోలం సృష్టించారు.
పోలీసులకు, గుజ్జర్లకు మధ్య ఎన్నోసార్లు తీవ్రంగా ఘర్షణలు జరిగాయి. రెండు పోలీస్ స్టేషన్లను ఆ ఆందోళనల్లో గుజ్జర్లు తగలబెట్టారు. ఏడాది పాటు చాలా తీవ్రంగా సాగిన ఉద్యమంలో దాదాపు 72 మంది ప్రాణాలను కోల్పోయారు. చివరకు దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ హోదా ఇవ్వాలా వద్దా అన్నది తేల్చడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ, ఆ కమిటీ ఆ అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే.. గుజ్జర్లు ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలంటూ సూచించింది. దీన్ని పూర్తిగా తిరస్కరించారు గుజ్జర్లు. ఎస్టీ హోదా కావాల్సిందేనని పట్టు బడుతున్నారు. 2008లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో గుజ్జర్ల డిమాండ్ పక్కన పడింది. రిజర్వేషన్ కల్పించడానికి ఏమాత్రం అంగీకరించకపోవడంతో.. మళ్లీ ఆందోళనలు మొదలుపెట్టారు గుజ్జర్లు.
ఒకే ఒక్కడు..
కిరోరి సింగ్ భైంస్లా... మాజీ కల్నల్. సాధారణ సైనికుడిగా ఆర్మీలో చేరి కల్నల్‌గా రిటైర్ అయిన భైంస్లా, ఇప్పుడు గుజ్జర్ల ఉద్యమానికి కేంద్ర బిందువు. తరతరాలుగా తమ వర్గానికి జరుగుతున్న అన్యాయాలను తట్టుకోలేక పోరాటం మొదలుపెట్టారు భైంస్లా. అయితే.. గుజ్జర్లను సంఘటితం చేయడానికి భైంస్లా చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రతీ గ్రామానికి, ప్రతీ ఇంటికీ వెళ్లారు. జాట్‌లను ఓబీసీల్లో చేర్చడం వల్ల
తమకు జరుగుతున్న అన్యాయాలను అర్థమయ్యేలా చెప్పారు. ఎస్టీ హోదా దక్కించుకుంటే ఎంత బాగుపడుతామో కళ్లకు కట్టినట్లు వర్ణించారు. అంతే గుజ్జర్లంతా భైంస్లా వెనక నిలబడ్డారు. పోరాటం మొదలుపెట్టారు. గుజ్జర్లను ఐక్యం చేయడమే కాదు.. పోరాట పంథాలోనూ తనదైన శైలిని చూపించారు భైంస్లా. సైన్యంలో తాను నేర్చుకున్న అనుభవాలను రిజర్వేషన్ పోరాటంలో ఆచరణలో పెట్టారు. అంతేకాదు.. ఆందోళన చేస్తున్న గుజ్జర్ల రక్షణ కోసం ప్రత్యేకంగా ఓ సైన్యాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు.
ఎన్నో రాజకీయపార్టీలు గుజ్జర్ల ఉద్యమాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నించినా, తొలినాళ్లలో రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని కొనసాగించారు. అయితే.. 2008 ఎన్నికల సమయంలో మాత్రం ఆయన బీజేపీకీ చేరువయ్యారు. కానీ, ఆ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోవడంతో రిజర్వేషన్ సాధించాలన్న భైంస్లా కల నెరవేరలేదు. ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గుజ్జర్ల రిజర్వేషన్‌కు పూర్తిగా వ్యతిరేకం. 1981లోనే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ చెత్తబుట్టలో పడేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు కూడా బీజేపీ ప్రోద్భలంతోనే జరుగుతున్నాయని అనుమానిస్తున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.
రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో, గుజ్జర్లు ఇప్పుడు పోరాట పంథాను మార్చారు. ప్రత్యేక రిజర్వేషన్ కోటాను దక్కించుకోవడం కోసం నేరుగా కేంద్రంపై ఒత్తిడి తేవాలనుకుంటున్నారు. అయితే.. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ ఆందోళనలకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మాత్రం, గుజ్జర్ల ఆందోళన మరింత తీవ్రం కావచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
In the coming years, the same tactics will be used by other groups to achieve their Political, Social, Economic, probably Religious & Cultural issues also.
It (this process) is good or bad is open for discussion.