26, డిసెంబర్ 2010, ఆదివారం
మొదలయ్యింది...
జగన్, బాబుల దీక్షలు ఏదోలా ముగిసిపోయాయని మురిసిపోతున్న కొత్త సీఎం కిరణ్ కుమార్ కు షాక్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు. మరో దీక్షను ఎదుర్కోమంటూ సవాల్ విసిరారు. మరో సమస్యను తెచ్చి ఆయన తలపై పెట్టారు. ప్రతిపక్షాలు దీక్ష చేస్తే ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు.. కానీ పాలకపక్షమే ప్రభుత్వంపై పోరాటం మొదలుపెడితే.. ఈ రాష్ట్ర పాలనను ఏమని అర్థం చేసుకోవాలి. అసలు కాంగ్రెస్ నేతల దీక్షకు కారణం ఏమిటో తెలుసా..?
ఇంకా డిసెంబర్ 31 రానేలేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను సమర్పించలేదు. అసలు నివేదికలో ఏం ఉండొచ్చో కచ్చితంగా ఎవరికీ తెలియనేలేదు. అయినా, హడావిడి మొదలయ్యింది. కొత్త ఏడాది ప్రారంభం ఎలా ఉండొచ్చో అప్పుడే నేతలు మనకు సంకేతాలను అందించేస్తున్నారు. నిన్నా మొన్నటి దాకా చంద్రబాబు, జగన్ దీక్ష చేస్తే ఇప్పుడు దాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందిపుచ్చుకున్నారు. తమ ప్రభుత్వంపైనే సత్యాగ్రహానికి సిద్ధమవుతున్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ మొదలుపెట్టే విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి కన్నా ఓ అడుగు ముందే ఉండాలనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకే, 26-12-10 ఆదివారం రోజున తెలంగాణ ఎంపీలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విద్యార్థుల కేసుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించి, అందుకు ఆదివారం సాయంత్రం వరకూ గడువు విధించారు. ఈలోపు కేసుల ఎత్తివేతపై ప్రకటన చేయకపోతే రేపటి నుంచి నిరాహార దీక్ష చేపడతామని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు ప్రకటించారు. దేశ ద్రోహులపై తప్ప మిగిలిన అన్ని కేసులూ ఎత్తివేయవచ్చని, తమకు చట్టాల గురించి చెప్పాల్సిన అవసరం లేదంటూ ఆయన చెప్పారు. గన్ పార్క్ వద్ద నిరాహారదీక్ష చేయడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు.
అంతేకాదు.. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేస్తామంటూ ఘాటైన వార్తను మీడియాకు అందించారు. దీనికి తోడు 18 బెటాలియన్ల బలగాలను కేంద్ర నుంచి రప్పించాల్సిన అవసరం ఏముందన్నదీ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రికి వేసిన ప్రశ్న. తెలంగాణ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసులు ఎత్తివేయకపోతే తామంతా పదవులకు రాజీనామా చేస్తామని జరిగే పరిణామాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని చేనేత మంత్రి శంకరరావు హెచ్చరించారు.
మరోవైపు తెరాస శ్రేణులను ఉత్తేజపరిచే పనిలో కేసీఆర్ కూడా తీరికలేకుండా ఉన్నారు. అవసరమైతే మళ్లీ దీక్ష చేస్తానని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలూ ఈ విషయంలో కాస్త సీరియస్ గానే ఆలోచిస్తున్నా, ప్రస్తుతం వారి అధినేత తలపెట్టిన రైతుగర్జనపైనే దృష్టి పెట్టారు. మొత్తంమీద ముందున్నది ముసళ్ల పండుగేనన్న మాట.. సంక్రాంతి రాజధాని దాటేవారూ.. జర జాగ్రత్త..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి