9, ఏప్రిల్ 2010, శుక్రవారం
యుద్ధం మొదలయ్యింది...
Categories :
పోలీసులపై నక్సలైట్లు పైచేయి సాధించారా?
నక్సలైట్ల ఎత్తుగడలు పోలీసులకు అంతుబట్టడం లేదా?
చింతల్‌నార్ సంఘటన ఎందుకు జరిగింది?
నేపాల్ సరిహద్దుల నుంచి.. దక్షిణ భారతం దాకా విస్తరించిన మావోయిస్టులను ఏరివేయడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన.. ఆపరేషన్ గ్రీన్‌హంట్ సమస్యల్లో చిక్కుకొంది. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో గాలిస్తున్న సీఆర్‌పీఎఫ్ బలగాలను చావుదెబ్బ కొట్టారు మావోయిస్టులు. ఈనెల ఆరో తేదీన తెల్లవారుఝామునే మెరుపు దాడి చేశారు. దాదాపు వెయ్యిమంది నక్సలైట్లు కలిసికట్టుగా చేసిన ఈ దాడి.. 75 మంది సీఆర్‌పిఎఫ్ సిబ్బంది ప్రాణాలు తీశారు. మావోయిస్టుల దాడిలో మైన్‌ప్రూఫ్ వెహికల్ కూడా తునాతునకలయ్యిందంటే.. ఇది ఎంత పెద్ద దాడో అర్థం చేసుకోవచ్చు.
మావోయిస్టుల దాడి వెనక అతిపెద్ద వ్యూహమే కాదు.. భారీ ప్రణాళిక కూడా ఉంది. దేశంలో నక్సలిజాన్ని తుదముట్టించడానికి మొదలైన.. గ్రీన్‌హంట్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని చింతల్‌నార్ వద్ద బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేసుకున్నాయి సాయుధ బలగాలు. అక్కడి నుంచి అడవుల్లోకి వెళుతూ.. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అడవుల్లోకి అడుగుపెట్టాల్సిన పోలీసుల అవసరమే.. మావోయిస్టులకు బలమయ్యింది. అడవుల్లో అణువణువూ తెలిసిన అన్నలు... పోలీసులకు ఉచ్చు బిగించారు. కూబింగ్ నిర్వహించి తిరిగి వస్తున్న పోలీసులపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. భారీ విధ్వంసక మందుపాతరలు పేల్చి.. ఆపై తూటాల వర్షం కురిపించారు. ఏం జరుగుతుందో తెలిసే లోపలే.. సాయుధ బలగాలు ప్రాణాలను కోల్పోయాయి. అంతేకాదు.. వీరికి సహాయంగా వస్తున్న బృందాలను టార్గెట్ చేసుకున్నారు. మావోయిస్టులు.
సాధారణంగా.. ఓ దాడి చేసిన తర్వాత అక్కడినుంచి సుధూర ప్రాంతాలకు వెళ్లిపోవడం నక్సలైట్లకు అలవాటు. కానీ.. చింతల్‌నార్ సంఘటన జరిగిన రెండు రోజులకే.. దానికి సమీపంలో ఉన్న పోలంపల్లి బేస్ క్యాంప్‌పై.. విరుచుకుపడ్డారు. దీన్నిబట్టి.. సాయుధ బలగాలతో హోరాహోరీ పోరుకే.. మావోయిస్టులు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. గ్రీన్‌హంట్‌ను పూర్తిస్థాయిలో ఎదుర్కోవడానికి ప్రిపేర్ అయిన విప్లవసైన్యం.. సీఆర్‌పీఎఫ్ బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడానికే భారీ దాడులు చేస్తున్నారు. తాజాగా బీహార్‌లోని ఓ గ్రామంపై వందమంది నక్సల్స్ దాడి చేశారు.
ఇక.. ఇప్పుడే భారీస్థాయిలో దాడులు చేయడానికి ప్రధాన కారణం వేసవి కమ్ముకువస్తుండడమే. వేసవిలో చెట్ల ఆకులు రాలిపోవడంతో.. సుధూరప్రాంతాలను చూడడానికి అవకాశం ఉంటుంది. మావోయిస్టులు దాక్కోవడానికి వీలైన పొదలు ఎండిపోతాయి. ఈ సమయంలో పోలీసులు అడవిలోకి అడుగుపెడితే.. మావోయిస్టులు ఉనికిని త్వరగానే గుర్తించే అవకాశం ఉంటుంది. ఇలా అడవుల్లోకి రాకూడదంటే.. వరస దాడులతో బెంబేలెత్తించాల్సి ఉంటుంది. సరిగ్గా ఆ పనే చేస్తున్నారు దండకారణ్యంలోని నక్సలైట్లు. పెద్ద ఎత్తున దాడులు చేస్తే.. అడవిలో అడుగు పెట్టడానికి పోలీసులు భయపడతారన్న అంచనానే.. ఈ దాడులకు పురి కొల్పుతొంది. పైగా.. మావోయిస్టులకు అడవిని మించిన యుద్ధక్షేత్రం మరొకటి లేదు. అడవిలో అనుపానులు అన్నీ తెలిసిన మావోయిస్టులు.. పోలీసులపై పై చేయి సాధించడానికి అవకాశం ఎక్కువ. అందుకే.. ముందు ముందు ఈ తరహా దాడులు మరిన్నిజరిగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
బలోపేతమవుతున్న మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లో తాజా దాడితో మావోయిస్టుల వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. సైనిక బలగాలనే చావుదెబ్బ కొట్టారంటే.. ఎంత బలంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సైనిక బలగాలకు కేంద్ర ప్రభుత్వం అండ ఉంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించగల రాష్ట్ర, కేంద్ర నిఘా సంస్థలు ఉన్నాయి. అతిపెద్ద పోలీస్ వ్యవస్థ కూడా ఉంది. అత్యాధునిక ఆయుధాలు.. వాహనాలు.. కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రభుత్వ బలగాల సొంతం. ఇక నక్సలైట్ల విషయానికి వస్తే.. కొంతమంది దగ్గరే సెల్‌ఫోన్లు ఉంటాయి. కమ్యూనికేషన్ కోసం.. ప్రత్యేక పరికరాలూ ఉంటాయి. కానీ.. పోలీసులతో పోల్చితే ఇవన్నీ సాధారణమైనవే. పైగా.. మావోయిస్టులు ఉండేది.. ఏ సదుపాయాలు లేని అడవుల్లో. అయినా.. సైనిక బలగాలపై ఇంత పెద్ద దాడి చేయగలిగారు.
వాస్తవానికి మావోయిస్టుల బలమంతా.. అడవిలోనే ఉంది. సామాజిక అంతరాలను ఆధారంగా చేసుకుని.. ఆదివాసీల్లో మావోయిస్టులు సులువుగా చొచ్చుకుపోగలిగారు. వారి మద్దతు వల్లే ఇప్పుడు ఇంత పెద్ద దాడిని చేయగలిగారు. చింతల్‌నార్ దాడిలో వెయ్యి మంది పాల్గొన్నా... అందులో మావోయిస్టుల సంఖ్య చాలా తక్కువ. దీనికి నిదర్శనం.. సీఆర్‌పీఎఫ్ సిబ్బందిలో చాలామందికి విషపు బాణాలు గుచ్చుకోవడమే.. ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల్లో మావోయిస్టులకు ప్రధాన బలం... ఈ ఆదివాసీలే. దండకారణ్యంలోని ప్రతీగ్రామంలోనూ ప్రత్యేక విప్లమ కమిటీలు పనిచేస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి ముసలివారి దాకా అందరూ ఇందులో సభ్యులే. వీరంతా మావోయిస్టులకు అనుబంధ సభ్యులు. రక్షణ కోసం అందరికీ ఆయుధాలను అందించి.. తమకు అనుకూలంగా మలుచుకున్నారు నక్సలైట్లు. దండకారణ్యంలోకి అడుగుపెట్టి చూస్తే.. ఇలా తుపాకులతో తిరిగేవారే మనకు కనిపిస్తారు. మావోయిస్టులకు కీలక సమాచారాన్ని అందించేది కూడా వీరే. ఆదివాసీలు కొన్ని దశాబ్దాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రజాప్రభుత్వాల వల్ల వారికి న్యాయం జరగకపోవడంతో.. మావోయిస్టుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ అడవి బిడ్డలను అర్థం చేసుకుని... ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకుంటే తప్ప.. నక్సలైట్లపై ఆధిపత్యం చెలాయించడం సాధ్యం కాదు.
యుద్ధానికి సన్నద్ధం
ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి.. ఎప్పుడూ లేనంత పెద్ద స్థాయిలో.. మావోయిస్టులు సిద్ధమయ్యారు. దేశ వ్యాప్తంగా చూస్తే.. 30 నుంచి 40 వేల మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. వీరికి అదనంగా మరో 50 వేల మంది దాకా అనుబంధ సభ్యులున్నారు. దాదాపు 20 రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే.. ఎక్కువమంది ఉండేది మాత్రం జార్ఖండ్,బీహార్,ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాల మధ్య విస్తరించిన దండకారణ్యంలోనే. ఇక్కడినుంచే.. యుద్ధ ప్రణాళికలు రూపొందుతాయి. అందుకే.. ఆపరేషన్ గ్రీన్‌హంట్ కొనసాగుతోంది కూడా ఈ ప్రాంతంలోనే..
మావోయిస్టులను కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు ఎప్పటినుంచో గమనిస్తూనే ఉన్నాయి. ఇటీవలికాలంలో.. మావోయిస్టులకు పెద్ద ఎత్తున విదేశీసాయం అందుతున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. ముఖ్యంగా ఫిలిప్పైన్స్‌లో విప్లవ పోరాటం చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఫిలిప్పైన్స్.. నుంచి.. మన దేశంలోని నక్సలైట్లకు శిక్షణ అందుతోందని తెలుస్తోంది. గుజరాత్‌లో ఇటీవల అరెస్ట్ అయిన ఓ ఇద్దరు మావోయిస్టులు.. పశ్చిమ బెంగాల్‌లో అరెస్ట్ అయిన తెలుగు దీపక్ ఇదే విషయాన్ని విచారణలో వెల్లడించారు. దీనిపై దృష్టిపెట్టాలంటూ.. కేంద్ర ప్రభుత్వం.. ఫిలిప్పైన్స్ ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరింది. అక్కడినుంచి.. మన దేశానికి ఎవరెవరు వస్తున్నారన్నదానిపై ఆరా మొదలయ్యింది. ఇప్పటికే ఎల్‌టీటీఈ నుంచి.. నేపాల్‌లోని మావోయిస్టుల నుంచి సాయం అందుకొని బలోపేతమైన నక్సలైట్లు.. ఇతర దేశాల సాయంతో.. మరింత శక్తిని కూడదీసుకొంటున్నారు.
ఇక ఆయుధాల విషయానికి వస్తే.. పాత కాలం నాటి సింగిల్‌బ్యారెల్ గన్స్ మావోయిస్టుల దగ్గర లేవు. ఇప్పుడంతా లేటెస్ట్ వెపన్స్. సాయుధ బలగాలకు దీటుగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు. మావోయిస్టుల అమ్ములపొదిలో ప్రధానంగా ఉంది AK-47. దళ కమాండర్ల దగ్గర నుంచి.. కేంద్ర కమిటీ సభ్యుల దాకా చాలామంది చేతుల్లో ఇవే ఉంటున్నాయి. గ్రీన్‌హంట్ నేపథ్యంలో.. దళంలోని సభ్యులందరికీ వీటిని అందిస్తున్నారు. అత్యాధునిక రైఫిల్స్ లిస్ట్‌లో ఉండే.. AK-57, ... మెషిన్‌గన్స్.. అభివృద్ధి పరిచిన పేలుడు పదార్థాలు.. సైన్యం ఎక్కువగా వాడే SLRలు.. రాకెట్ లాంచర్లు.. ఇలా ఎన్నో రకాల ఆయుధాలను సంపాందించుకున్నారు. వీటిలో సగం విదేశాలనుంచి వస్తుంటే.. మిగతా సగం.. సాయుధ బలగాలపై దాడులు చేసి దోచుకెళుతున్నారు. భారత సైన్యంకోసమే ప్రత్యేకంగా డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఇన్‌సాస్ తుపాకులూ.. మావోయిస్టుల చేతుల్లోకి వెళ్లాయంటే.. ఆయుధాలను ఎలా సంపాదిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.. ఆయుధాల కోసమే.. గత రెండు మూడేళ్లుగా.. పోలీస్ ఆయుధ కేంద్రాలపైనా... బేస్‌క్యాంపులపైనా తరచుగా దాడులు చేస్తున్నారు. చింతల్‌నార్ దాడిలో దాదాపు 50 లక్షల రూపాయల విలువైన ఆయుధాలు మావోయిస్టుల సొంతమయ్యాయి. సైన్యం తరహాలో తయారవుతున్న మావోయిస్టులు.. అందరికీ ఆయుధాలు అందించడం కోసం.. ప్రత్యేకంగా ఖర్మాగారాలనూ ఏర్పాటు చేసుకుంటున్నారు. దండకారణ్యంలో చాలా చోట్ల ఇలాంటివి ఉన్నాయి. Ak-47 అచ్చుగుద్దినట్లు తయారు చేయగల నైపుణ్యమూ మావోయిస్టుల వద్ద ఉంది. ఇక తమ ఉనికి లేని ప్రాంతాలను సేఫ్‌జోన్లుగా ఎంచుకొని.. పేలుడు పదార్థాలనూ సిద్దం చేసుకుంటున్నారు. కొంత కాలం క్రితం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మావోయిస్టుల ఆయుధ గోడౌన్ బయటపడింది.
సిగ్గుచేటు
చింతల్‌నార్ దాడి.. ప్రభుత్వానికి గుణపాఠం లాంటింది. అత్యాధునిక ఆయుధాలు ఉండి.. సైనిక శిక్షణ పొందిన సీఆర్‌పీఎఫ్ బలగాలు.. మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకొని ప్రాణాలు పొగొట్టుకోవడం అంటే.. ఎంత సిగ్గుచేటో ప్రభుత్వానికి తెలిసివచ్చింది. కానీ.. అసలు లోటుపాట్లను గుర్తించి సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం జరగడం లేదు. మావోయిస్టులను అణగదొక్కాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకు సరైన వ్యూహాన్ని మాత్రం అమలు చేయడం లేదు. పారామిలటరీ బలగాలను అడవుల్లోకి పంపిస్తే సరిపోతుందనుకుంటుందే తప్ప.. మావోయిస్టుల బలాన్ని మాత్రం అంచనా వేయడం లేదు. మావోయిస్టుల బలమంతా.. గెరిల్లా వార్‌పేర్. ఎదురుగా నిలబడి పోరాటం చేయరు. మాటువేసి మట్టుబెడతారు. అనూహ్యంగా విరుచుకుపడతారు. ఎప్పుడు ఏ సమయంలో వస్తారో తెలియదు. అందుకే.. ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి.. వారినే వెతుక్కుంటూ వెళుతున్న సమయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి.. ఇక్కడే పొరపాటు జరిగింది. అడవుల్లోకి వెళ్లి ఎవరూ లేరన్న అతి విశ్వాసం.. సీఆర్‌పీఎఫ్ జవాన్ల కొంప ముంచింది. నిఘా వైఫల్యంతో పాటు.. బలగాల మధ్య సమన్వయ లోపంవల్లే ఇలా జరిగిందన్నఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే.. మావోయిస్టుల ఏరివేతకు వైమానిక దాడులు చేయాలన్న ఆలోచన ఎప్పటినుంచే కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. కొన్ని కారణాల వల్ల దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకురాలేదు. ఎయిర్‌ఫోర్స్ కూడా అందుకు సిద్ధంగా లేదు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైతే నిర్ణయం మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చింతల్‌నార్ లాంటి సంఘటనలు ఇంకా జరిగితే త్వరలోనే నక్సల్స్‌పై గగనతల దాడులు మొదలుకావచ్చు. గగనతల దాడులు మొదలైతే మాత్రం.. పచ్చని అడవులు పెద్ద ఎత్తున నాశనం కావచ్చు. అంతేకాదు.. నక్సలైట్లుగా భావించి ఆదివాసీల పైనా బాంబు దాడులు జరగొచ్చు. ఇది ఉద్యమాన్ని మరింత పెంచుతుందే తప్ప తగ్గించదు. అయితే.. వేసవి వస్తుండడం ప్రభుత్వానికి సానుకూలాంశం. ఉపగ్రహాల ద్వారా.. మానవరహిత విమానాల ద్వారా.. దండకారణ్యాన్ని జల్లెడ పడితే.. మావోయిస్టు క్యాంపులను సులువుగానే గుర్తించవచ్చు. దాన్ని బట్టి దాడులకు ప్లాన్ చేసుకోవచ్చు. దానికన్నా ముందు గెరిల్లా యుద్ధతంత్రంలో పారామిలటరీ సిబ్బందికి పూర్తిస్థాయి ట్రైనింగ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే.. అడవుల్లోకి వెళ్లిన వారు సురక్షితంగా వెనక్కి రాకపోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Carpet bombing of Adivasi areas is one option. These adivasis are barbarians who have inherant anger on civilized people/Police. Maoists are cashing on this aspect. They deserve the treatment similar to the tribal areas of Pakistan by the US.
I hope Police would soon eliminate Maoists and these thugs.