27, మార్చి 2010, శనివారం
మావోయిస్టుల భారీ బడ్జెట్...
Categories :
మావోయిస్టుల బడ్జెట్ ఎంతో మీకు తెలుసా... అక్షరాలా రెండు వేల కోట్ల రూపాయలు. ఆశ్చర్యపోకండి.. ఇందులో సింహభాగం ఆయుధాల కోసమే ఖర్చు పెడుతున్నారు. ఇంతకీ ఇంతడబ్బు ఎలా వస్తోంది.. ఈ సమాచారం ఎలా తెలిసింది అనుకుంటున్నారా.. అయితే చదవండి..
వరుస ఎన్‌కౌంటర్లు.. వరుస అరెస్టులతో నక్సలైట్లను బెంబేలెత్తిస్తున్న పోలీసులకు ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. జార్ఖండ్ పోలీసులకు చిక్కిన ఓ మావోయిస్టు ఇచ్చిన సమాచారం మేరకు.. నక్సలైట్ల బడ్జెట్ వ్యవహారాలు.. ఖర్చులు బయటకు వచ్చాయి. ఒకదేశం మిలటరీ నిర్వహణకు ఎలాంటి వనరులు సమీకరించుకుంటుందో.. దేనిపైన ఆధారపడుతుందో.. అదే తరహాలో మావోయిస్టులు ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది దాదాపు 2 వేల కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్‌నే రూపొందించారు. ఇవన్నీ వసూళ్ల రూపంలో అందుకున్నవే. ఈ రెండు వేల కోట్లలో 800 కోట్లను ఆయుధాల సేకరణకే కేటాయించారు. దళాల చేతి ఖర్చుల కోసం 20 కోట్ల రూపాయలను పక్కనపెట్టారు. మిగిలిన డబ్బును అవసరాలను బట్టి కేంద్ర కమిటీ ఖర్చు పెడుతుంది. అంతేకాదు.. దండకారణ్యంలో తమ పట్టున్న ప్రాంతాల్లో పాలనంతా మావోయిస్టులదే. ఇక్కడ కొన్ని ఆస్పత్రులను, బడులను కూడా మావోయిస్టులు నిర్వహిస్తున్నారు. వాటికయ్యే ఖర్చు కూడా ఈ బడ్జెట్ లోదే.
ఇంత డబ్బు ఎలా వస్తోంది?
మావోయిస్టులకు దేశవిదేశాల నుంచి సాయం అందుతోంది. అయితే.. సాయం కన్నా నక్సల్స్ చేస్తున్న బలవంతపు వసూళ్లే ఎక్కువ. బీడీకార్మికుడి నుంచి కార్పొరేట్ కంపెనీల దాకా ప్రతీ ఒక్కరినుంచీ ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. మనరాష్ట్రంలో బీడీ బండిల్‌పై 5 పైసలను మామూలుగా చెల్లించాలి. ఇక పార్టీ సానుభూతిపరులు నెలకు పది రూపాయలను ఇవ్వాలి. కానీ.. వ్యాపారుల నుంచి మాత్రం నిధులు వరదలా మావోయిస్టులకు చేరుతున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌లో అయితే.. అడిగినంత ఇవ్వాల్సిందే. లేదంటే.. ఆ కంపెనీ ఆస్తులు బూడిదగా మారిపోతాయి. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన రాజకీయ నాయకులు కూడా భారీ ఎత్తున ముడుపులను నక్సలైట్లకు చెల్లించుకుంటున్నారు.
బిజినెస్..
పోలీసులకు తెలిసిన మరో విషయం.. మావోయిస్టులు బిజినెస్ చేస్తుండడం. నిధుల వృద్ధి కోసం బిజినెస్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం ఈ మధ్యే తెలిసింది. ఆంధ్రప్రదేశ్, జార్ఘండ్‌లలో పెద్దఎత్తున ప్రాజెక్టు పనులు జరుగుతుండడంతో వీటిలో ఇన్వెస్ట్ చేశారు. ఈమధ్య ఎన్‌కౌంటర్‌లో హతమైన కొండల్‌రెడ్డి డైరీలో అయితే.. రియల్‌ఎస్టేట్ వ్యాపారంలోనూ డబ్బులు భారీగానే కుమ్మరించినట్లు ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి