2, ఫిబ్రవరి 2010, మంగళవారం
పాపం పసివాళ్లు..
స్కూలు వెళ్లివస్తానమ్మా అంటూ కారెక్కిన చిన్నారి వైష్ణవి.. కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన ఆ చిన్నారి.. కుటుంబ కక్షలకు బలైపోయింది. వైష్ణవిని కిడ్నాప్ చేసి.. అత్యంత దారుణంగా హతమార్చారు ప్రభాకర్ బంధువులు. అందరి మధ్యా చలాకీగా తిరిగే నాగవైష్ణవి.. ఇప్పుడు ఇనుప కొలిమిలో బూడిదగా మిగిలింది. వైష్ణవి కిడ్నాప్ వార్త.. ఆమె కుటుంబంలో విషాదాన్నే నింపింది. సంఘటన జరిగినప్పటి నుంచీ..
ఆమె తల్లిదండ్రులు ప్రభాకర్, నర్మదల గుండెలు బరువెక్కాయి. అయినా.. ఎక్కడో చిన్న ఆశ. తమ చిన్నారి సురక్షితంగా తిరిగివస్తుందన్న నమ్మకం. కానీ.. ఆ ఆశలు అడియాశలయ్యాయి. వైష్ణవి ప్రాణం తీయడానికే కిడ్నాప్ చేయించిన ఆమె మామయ్య వెంకట్రావు.. అనుకున్న పని చేసేశారు. ఏమాత్రం జాలి లేకుండా.. కాస్తైనా కనికరం చూపకుండా.. ఆ పసిప్రాణాన్ని తీశారు. ఈ వార్త తెలియడంతోనే.. వైష్ణవిని ప్రాణంలా పెంచిన పలగాని ప్రభాకర్ గుండె షాక్‌కు గురయ్యింది. తన చిట్టితల్లి ఇక లేదన్న వార్త తట్టుకోలేని ఆ హృదయం.. ఆగి పోయింది.
కిడ్నాప్ చేసిన ముఠా ప్రాణాలు తీయడానికి ఏమాత్రం వెనకడుగు వేయదని మొదటిరోజే తెలిసిపోయింది. కిడ్నాప్ చేసే క్రమంలో, కారు డ్రైవర్‌ను కూడా హత్య చేశారు. ప్రభాకర్ పిల్లలిద్దరినీ కిడ్నాప్ చేయాలన్నదే దుండగుల ప్లాన్ అయినప్పటికీ, వైష్ణవి అన్న సాయిశిరీష్ మాత్రం.. కారు దిగి పారిపోవడంతో తప్పించుకోగలిగాడు. లేదంటే.. ఆ చిన్నారి కూడా ఈ పాటికి విగతజీవిగానే కనిపించేవాడేమో.. ఇక కిడ్నాప్‌ను ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైష్ణవిని తీసుకువెళ్లిన మరుక్షణమే స్పందించి ఉంటే.. ఎంతో కొంత ఉపయోగం ఉండేదన్న ఆభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైష్ణవిని ఇంతకు ముందుకూడా ఓ సారి కిడ్నాప్ చేశారు. అయితే.. సురక్షితంగానే వదిలిపెట్టారు. ఈ సమయంలో కిడ్నాపర్లు కోరినంత డబ్బు ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పైగా.. కిడ్నాపర్ల నుంచే సమాచారం వస్తుందంన్నట్లుగా ఎదురుచూశారు. రెండు రోజులైనా.. అటువైపు నుంచి ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో.. బంధువులపై దృష్టి పెట్టారు.
వైష్ణవిని చంపించిన వెంకట్రావుకు, ఇంతకుముందు కిడ్నాప్లోనూ భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసును వేగంగా ఛేదించడంలో పోలీసులు విఫలం చెందారు. అయితే... ఇక్కడ కేవలం పోలీసులను మాత్రమే నిందించలేం. కిడ్నాప్ జరిగిన వెంటనే ప్రభాకర్ బంధువులపై అనుమానాన్ని వ్యక్తం చేయలేదు. మొదటి భార్య గురించి, వెంకట్రావు గురించి.. గత కిడ్నాప్ విషయాలను చెప్పలేదు. రెండు రోజుల తర్వాత సుదీర్ఘంగా విచారిస్తే తప్ప.. పూర్తి సమాచారం చెప్పలేదు. ఆ తర్వాతే.. ఈ కేసులో చిక్కుముడి వీడిపోయింది. మొదటి రోజే బంధువులను విచారించి ఉంటే.. నాగవైష్ణవి ప్రాణాలతో దక్కే అవకాశం ఎక్కువగానే ఉండేది. మొత్తానికి వైష్ణవి కిడ్నాప్ విషాధంగా ముగిసింది. హంతకులను కఠినాతికఠినంగా శిక్షించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు.
కిడ్నాపుల రాష్ట్రం
చిన్నారుల కిడ్నాప్‌లో మన రాష్ట్రం దేశంలోనే ఐదోస్థానంలో ఉంది. 2007లో రాష్ట్రంలో 1499 మంది, 2008లో 1431 మంది, 2009 దాదాపు 15వందల మంది చిన్నారులు కిడ్నాప్ అయ్యారు. వీరిలోనూ పదేళ్లలోపున ఉన్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. డబ్బు కోసం ఆస్తిపరుల పిల్లలను కిడ్నాప్ చేయడం చాలాకాలంగా వస్తున్నదే. దీంతో పాటు.. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, వ్యాపార లావాదేవీల కారణంగానూ.. చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని ఇటీవలి కేసులను పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ తరహా కేసుల్లో చాలావరకూ పిల్లల ప్రాణాలను కర్కశంగా తీసేస్తున్నారు. వైష్ణవి హత్యకేసు కూడా ఈ కోవలోదే. పాత కేసులను పరిశీలిస్తే.. 2009లో నల్గొండ జిల్లాకు చెందిన శ్వేత, శివ అనే చిన్నారులను పాతకక్షల నేపథ్యంలో కిడ్నాప్ చేసి హతమార్చారు. 2008లో తిరుపతిలో ఆయేషా అనే అమ్మాయిని సమీప బంధువులే కిడ్నాప్ చేసి చంపేశారు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మొయినుద్దీన్ అనే బాలుడిని ఆస్తికోసం బంధువులే చంపేశారు. రాజేంద్రనగర్‌లో రియల్ఎస్టేట్ విభేదాలు.. నవీన్ అనే పిల్లాడి హత్యకు దారితీశాయి. ఇలా చూసుకుంటూ వెళితే.. ఎన్నో కేసులు..
డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ అయితే.. ఒకటి రెండు రోజుల్లోనే.. ఏదో ఓ సమాచారం వస్తుంది. డబ్బు ఇవ్వాలన్న డిమాండ్‌ను కిడ్నాపర్లు చేస్తారు. డబ్బు ముట్టజెప్పితే, చాలావరకూ పిల్లలను వదిలివేస్తారు. లేదంటే.. ఫోన్‌కాల్స్ ఆధారంగా పోలీసులే చేధించి విడిపిస్తారు. కానీ.. కక్ష తీర్చుకోవడానికే కిడ్నాప్ జరిగితే మాత్రం.. ప్రాణాలతో వదులుతారన్న ఆశలేదు. కనీసం కిడ్నాప్ ఎందుకు చేశారన్న సమాచారమూ తెలియదు. ఇక్కడే చురుగ్గా వ్యవహరించాల్సిన పోలీసులు.. అన్ని కేసులనూ ఒకే గాటన కట్టేస్తున్నారు. సమాజంలో వచ్చిన మార్పుకు అనుగుణంగా కిడ్నాప్ కేసులను చూడడంలో విఫలమవుతున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే.. రాష్ట్రం మొత్తాన్ని విషాధంలో నింపిన వైష్ణవి కిడ్నాప్.
కిడ్నాప్ జరిగిన తర్వాత ప్రతీక్షణమూ ఎంతో విలువైనదే. పిల్లలను ప్రాణాలతో దక్కించుకోవడానికి ఉపయోగపడేదే. కిడ్నాప్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి కాబట్టి.. సాధారణ పోలీసులు దీన్ని టేకప్ చేస్తే.. వెంటనే చేధించడం కష్టం. పైగా.. ఒక్కో కేసులో ఒక్కో కోణం ఉంటుంది కాబట్టి.. దీనికి స్పైషలైజ్డ్ పోలీసులు కావాల్సి ఉంటుంది. అందుకే.. టాస్క్‌ఫోర్స్ తరహాలో ప్రత్యేక పోలీసు విభాగాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. వైష్ణవి హత్యను తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మరింతగా చొరవచూపించాల్సి ఉంది. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి కిడ్నాప్‌లను అరికట్టాల్సి ఉంది.
ఎక్కడపడితే అక్కడ.. ఎప్పుడుపడితే అప్పుడు చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. పగటిపూటే... అందులోనూ నడిరోడ్డుపైనే తెగబడి.. పిల్లలను ఎత్తుకుపోతున్నారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైష్ణవి విషయంలోనూ జరిగింది ఇదే. స్కూల్ వెళుతున్న కారును అడ్డగించి మరీ.. ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. కారు డ్రైవర్‌ను హత్యచేస్తున్నా.. చుట్టూ ఉన్నజనం చూస్తూనే ఉన్నారే తప్ప.. అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. ఓ రకంగా ఎవరూ పట్టనట్లే ఉన్నారు. నేరాలు విచ్చలవిడిగా జరగడానికి ఇదో కారణం. ఎవరూ ఏమీ అడగరు.. ఎవరూ అడ్డుకోరన్న ధీమాతోనే.. దుండగులు రెచ్చిపోతున్నారు.
కిడ్నాప్‌తో ఎన్నో అనర్థాలు..
ఎవరిపిల్లలను వారే కాపాడుకోవాలి. వారు జాగ్రత్తగాఉండేలా చూసుకోవాలి. కిడ్నాప్‌లకు గురవ్వకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలను ఒంటరిగా వదలకూడదు. వారి వెంట పెద్దవాళ్లుగాను, ఇతర పిల్లలు గానీ ఉండేలా చూసుకోవాలి. స్కూల్‌కు పంపేటప్పుడు వీలైనంతవరకూ పేరెంట్స్ వెళ్లడమే శ్రేయస్కరం. లేదంటే.. స్కూల్ బస్సులో అయినా పంపించండి.. రిక్షాలు, ఆటోలు ఎక్కించడమూ శ్రేయస్కరం కాదు. అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పాలి. ఎవరైనా బిస్కెట్లు, చాకెట్లు ఇస్తున్నా.. తీసుకోవద్దని చెప్పాలి. ముఖ్యంగా ఆడపిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు రాష్ట్రంలో చాలా ఎక్కువగా సంచరిస్తున్నాయి. అమ్మాయిలను కిడ్నాప్ చేసి.. వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోనూ తాజాగా.. ఇలానే ఆడపిల్లలను ఎత్తుకెళ్లడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు.
కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లల భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. శత్రువుల సమాచారాన్ని పిల్లలకు చెప్పి.. వారితో జాగ్రత్తగా ఉండమనాలి. ఒకవేళ, పొరపాటున కిడ్నాప్ లాంటి సంఘటనలు జరిగితే.. వీలైనంత వేగంగా పోలీసులను సంప్రదించాలి. కేవలం.. డబ్బుకోసమే కిడ్నాప్ జరిగిందని భావించకూడదు. వ్యాపారపరంగా, కుటుంబ పరంగా కిడ్నాప్ జరగడానికి అవకాశాలున్నామో ఆలోచించాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అనుమానాలను పోలీసులకు చెప్పాలి. పోలీసులకూ విచారణలో పూర్తిగా సహకరిస్తే తప్ప.. కిడ్నాప్ కేసులు చేధించడం సాధ్యం కాదు. లేకపోతే.. బిడ్డ ప్రాణాలతో వస్తాడన్న గ్యారెంటీ కూడా ఉండదు.
ఓ చిన్ని తార రాలిపోయింది.. కిడ్నాపర్ల చెరలో విలవిలలాడి, విగతజీవిగా మారింది. వైష్ణవిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ పసిపిల్లే ప్రాణమనుకుంటున్న .. ఆమె తండ్రి ప్రభాకర్ గుండె ఆగిపోయింది. హఠాత్తుగా ఎదురయైన ఆ కష్టాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. ఒక కిడ్నాప్.. ఆ కుటుంబంలోని రెండు ప్రాణాలను బలితీసుకొంది. వైష్ణవి తల్లి, అన్నల పరిస్థితి ఇప్పుడేమిటి? వారికి తోడుండేది.. తోడ్పాటు అందిచేది ఎవరు?
ఇక ఈ పిల్లలను కిడ్నాపర్ల బారినుంచి కాపాడే ప్రయత్నంలో కారు డ్రైవర్ లక్ష్మణరావు కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతనిపై ఆధారపడ్డ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. ఆ కుటుంబాన్ని ఆదుకునే దెవరు? వారి శోకాన్ని తీర్చేదెవరు....
వైష్ణవి కిడ్నాప్ వ్యవహారం ముగ్గురు ప్రాణాలను బలితీసుకొంది. కిడ్నాప్‌కు ప్లాన్ చేసినవారి సమస్యలు తీరిపోయిందా.. అంటే సమస్య మరింత పెరిగిందనే చెప్పాలి. కిడ్నాప్ చేయడం ఐపీసీ 363 ప్రకారం నేరం. రుజువైతే.. ఏడేళ్లదాకా శిక్ష పడుతుంది. హత్య కూడా చేస్తే.. ఐపీసీ 364, 302 కింద కేసు నమోదవుతుంది. రుజువైతే.. మరణశిక్ష పడుతుంది. వైష్ణవిని చంపడానికి ప్లాన్ చేసిన ప్రభాకర్ బంధువు.. వెంకట్రావు ఇప్పుడీ కేసులోనే ఇరుక్కున్నారు. ఆయనతో పాటు.. కిడ్నాప్ చేసినవారందరూ నేరస్థులే. వైష్ణవి హత్యకేసు చిక్కుముడి వీడిపోయింది కాబట్టి.. వీరందరికీ శిక్షపడడం ఖాయమే. అంటే.. వీరిపైనే ఆధారపడ్డ కుటుంబాలు కూడా వీధిన పడినట్లే..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చిన్నారి వైష్ణవి కొలిమిలో మసైన తరువాత పరిశీలనలో తేలిన విషయాలుఃప్రకాశం బ్యారేజి, కనకదుర్గవారధి,కృష్ణానది ఎన్నో హత్యలకు మూగసాక్షులుగా ఉన్నాయి.
విజయవాడ నగర నేరగాళ్లు హత్యలు చేసి మృతదేహాలను తాడేపల్లిమండలం సీతానగరం లో పడవేస్తున్నారు.మహిళలను వంచించి, మోసగించి వారిని శారీరకంగా, ఆర్థికంగా దోచుకుని తాడేపల్లి ఏరియావైపు తీసుకువచ్చి దారుణంగా హతమారుస్తున్నారు.విజయవాడ-మంగళగిరి బైపాస్‌రోడ్డు వెంబడి మృతదేహాలను కాల్చివేస్తున్నారు.కృష్ణానది దాటించి కృష్ణాయపాలెం వద్ద మృతదేహాలను గోనెసంచిలో కుక్కి కొండవీటివాగులో గిరాటేసి వెళ్లిపోతున్నారు. కృష్ణానదిలో తేలియాడే శవాలను ఇటునుంచి అటు, అటు నుంచి ఇటు నెట్టివేసుకుంటూ తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారు.మంగళగిరి నుంచి కృష్ణాకెనాల్ జంక్షన్ వరకు హతుల మృతదేహాలను రాత్రివేళల్లో రైల్వేట్రాక్‌పై పడవేస్తున్నారు.కిడ్నాప్ చేసి తాడేపల్లి బకింగ్‌హామ్ కెనాల్ వద్ద వాహనాలు మార్చి తీసుకువెళుతున్నారు. తాడేపల్లిని కూడా విజయవాడ పోలీసు పరిధిలోకి తేవాలి.