30, జనవరి 2010, శనివారం
రంగుల మాయ..
మాయాబజార్.. ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమా మీద కుప్పలు తెప్పలుగా ఎన్నో ఆర్టికల్స్ ఇప్పటికే వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. నాక్కూడా ఎప్పటినుంచో ఓ ఆర్టికల్ రాయలని ఉంది. నాకు తెలిసిన స్టోరీ అందరికీ చెప్పాలనుంది. ఎందుకంటే.. నాకు అత్యంత ఇష్టమైన సినిమా మాయాబజారే కాబట్టి. ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు. టీవీలో వచ్చే ప్రతీసారి సినిమా చూడాల్సిందే. అలాగని నా దగ్గర సీడీ లేదనుకుంటారేమో.. అదీ ఉంది. ఖాళీ సమయాల్లో చూసే సినిమాల్లో అదీ ఒకటి.. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అందుకే.. కలర్లో రిలీజ్ అవుతున్న సందర్భంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకోసం..
మాయాబజార్.. తెలుగు సినిమాలకు కొత్త హంగులను అద్దిన చిత్రరాజం. సినిమాలో ప్రతీ ఫ్రేమూ ఓ అద్భుతమే. మాటల్లో వర్ణించలేనంత గొప్పదే. భారతంలో లేని కథను తీసుకొని.. నిజమనుకునేలా అందరినీ నమ్మించిందీ చిత్రం. అందుకే.. అది మాయాబజార్. తెలుగు ప్రజల ముందుకు వచ్చి... యాభై ఏళ్లు దాటినా.. అలాంటి సినిమా.. మరొకటి రాలేదు.. రాబోదు కూడా..
విజయా వారి బ్యానర్లో మార్చి 27, 1957లో విడుదలయ్యింది మాయాబజార్. అప్పటికే ఎంతో పేరుసంపాదించుకున్న నటులందరూ ఇందులో నటించారు. సినిమా విడుదలవడమే ఆలస్యం.. తెలుగు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ప్రతీ థియేటరూ.. ప్రేక్షకులతో నిండిపోయింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిసింది.. ఎన్నో సెంటర్లలో శతదినోత్సవాలను జరుపుకొంది మయాబజార్.
మాయాబజార్లో ఎంతోమంది నటులున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజాలైన ఎన్టీఆర్, అక్కినేని, గుమ్మడి, ఎస్.వి.రంగారావు, సావిత్రి.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతీ ఒక్కరికీ ఎంతో ఇమేజ్ ఉంది. అయితే.. ఈ స్టార్డమ్ వల్లే మాయాబజార్ విజయం కాలేదు. ఈ సినిమాలో హీరో ఎవరని అడిగితే ఎవరి పేరూ చెప్పలేం. కృష్ణుడిగా కథను నడిపించే ఎన్టీఆరా, స్టోరీ మలుపు తిరగడానికి కారణమైన బలరాముడు గుమ్మడా, సినిమా అంతా తనచేతుల్లోకి తీసుకుని మగ,ఆడ పాత్రలను అవలీలగా నటించేసిన సావిత్రా , ప్రేయసి కోసం ఎదురుచూసే అభిమన్యుడు నాగేశ్వరరావా.. కానేకాదు.. తెరపై నుంచి కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసే స్క్రీన్‌ప్లే.. సంభ్రమాశ్చర్యాలలో ముంచేసే స్పెషల్ ఎఫెక్ట్స్.. అద్భుతమై స్క్రిప్ట్.. ప్రేక్షకులను కట్టిపడేసే సంగీతం.. ఇలా అన్నీ కలగలిసి.. తెలుగు సినిమాకు రారాజును చేశాయి. చరిత్రలో.. మాయాబజార్‌కు ఓ అపూర్వ స్థానాన్ని కల్పించాయి. అందుకే.. ఇన్నేళ్లయినా.. ఈ చిత్రం తెలుగు వారి గుండెల్లో గూడు కట్టుకునే ఉంది. ఇప్పటికీ టీవీల్లో మాయాబజార్ వస్తుందంటే.. అతుక్కుని మరీ చూస్తారు. తెలుగు సినిమాల్లో మాయాబజార్ ఓ అపూర్వ కళాఖండం. అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో అత్యుత్తమ చిత్రంగా నిలిచే ఉంది. సినిమా విషయంలో దర్శకుడు కె.వి.రెడ్డి, నిర్మాతలు చక్రపాణి, నాగిరెడ్డిలు, కెమెరామెన్ మార్కస్ బార్ట్లే, రచయత పింగళి నాగేంద్రరావు పనితనం.. స్పష్టంగా తెలుస్తుంది. అందుకే.. ఎప్పటికీ.. మాయాబజార్.. అద్భుతమైన చిత్రమే..
అద్భుతం.. సంగీతం
మాయాబజార్ విజయం వెనుక సంగీతానిది ఎనలేని పాత్ర. ఈ సినిమాలోని ప్రతీపాట సూపర్ హిట్. యాభై ఏళ్లుగా.. ఇప్పటికీ జనం నోళ్లలో ఈ పాటలు నానునూతూనే ఉన్నాయి. ఇక నేపథ్యసంగీతమూ.. సినిమాను మరితంగా రక్తి కట్టించింది. తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు కొన్నే ఉంటాయి. మాయాబజార్ సినిమా నుంచి మాత్రం.. ప్రతీ పాటా ఈ జాబితాలో కనిపిస్తుంది. ఒక్కో పాట ఒక్కో అద్భుతం. ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకం. ఒకదాని స్థాయిని తక్కువగా మరోదాని స్థాయిని ఎక్కువగా చెప్పుకోలేం. సినిమా మధ్యలో పాట పెడుతున్నట్లుగా కాకుండా.. సన్నివేశానికి తగ్గట్లుగా ప్రత్యక్షమవుతాయి. కథను ముందుకు నడిపిస్తాయి. యవ్వనంలోకి ప్రవేశించిన శశిరేఖకు.. బావను చూడమంటూ ప్రియదర్శినిని ఇస్తాడు శ్రీకృష్ణుడు. అది తెరవడమే ఆలస్యం.. నీవేనా నను పిలచినది అంటూ.. ఓ అందమైన పాట మొదలవుతుంది..
మాయాబజార్లో సహజత్వం ఓ పాలు ఎక్కువే. ఎక్కడా యాత్రికంగా చిత్రీకరించినట్లు కనిపించదు. పాటల విషయంలోనూ ఈ పద్దతినే అనుసరించారు. శశిరేఖా, అభిమన్యుల మధ్య ప్రేమను చూపించడంలోనూ... ఈ పాటలే కీలకం. మాటల్లో వర్ణించలేని సన్నివేశం వస్తోందంటే.. అక్కడ ఓ అద్భుతమైన పాట ప్రత్యక్షమవుతుంది. లాహిరి లాహిరి లాహిరిలో అంటూ.. శశిరేఖాభిమన్యులు పడవలో సాగుతూ ఉంటే.. సినిమా చూస్తున్న ప్రతీ ఒక్కరూ ప్రేమమైకంలో ఓలలాడాల్సిందే. మూడు జంటలపై ఈ పాటను చిత్రీకరించి .. ఓ అద్భుతాన్నే చూపించారు దర్శకుడు కె.వి.రెడ్డి
ఇక ప్రత్కేకంగా చెప్పుకోవాల్సింది.. వివాహ భోజనంబు పాటగురించే. మాధవపెద్ది సత్యం గళం నుంచి జాలువారిన ఈ పాట.. జనాన్ని ఎంతోగానే మెప్పించింది. ఘటోచ్కతుడు గాంభీర్యానికి తగ్గట్లుగానే పాడుతూ.. అందరినీ మంత్రముగ్ధులను చేశారు మాధవపెద్ది.
అహానా పెళ్లియంట, చూపులు కలిసిన శుభవేళ, సుందరి నీవంటి దివ్యస్వరూపము.. ఇలా ప్రతీ పాట సూపర్ హిట్టే. ముందుగా ఈ సినిమాకు సాలూరు రాజేశ్వరరావును సంగీతదర్శకుడిగా తీసుకొన్నప్పటికీ.. ఆ అవకాశం ఆ తర్వాత ఘంటసాలకు దక్కింది. దీన్ని ఎంతో చక్కగా ఉపయోగించుకున్న ఆయన.. ఎప్పటికీ మరిచిపోలేని మధురమైన పాటలను అందించారు.
రంగుల్లో మాయాబజార్..
తెలుగు సినీ వినీలాకాశానికి.. సరికొత్త హంగులను అద్దింది విజయవావారి మాయాబజార్. సినిమా నిండా ఎన్నో ఎఫెక్టులు... జనాన్ని కట్టిపడేసే సన్నివేశాలు. బ్లాక్ అండ్ వైట్‌లోనే .. ఇంత గొప్పగా ఉంటే.. కలర్లో కనిపిస్తే.. మరెంత గొప్పగా ఉంటుందో అన్న ఆలోచన అందరికీ రావచ్చు. ఈ ఊహనే నిజం చేసింది గోల్డ్‌స్టోన్ టెక్నాలజీ. విజయావారి అపూర్వ కళాఖండాలను కలర్లోకి మార్చడానికి గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్ రైట్స్ తీసుకొంది. అందులో మాయాబజార్ ఒకటి. సినీ పరిశ్రమకు ఎన్నో మాయలు చూపించిన ఈ మాయాబజార్‌కు రంగుల మాయను అద్ది సరికొత్తగా సిద్ధం చేసింది.. తెలుగు సినిమా హిస్టరీలో ఓ బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్లోకి మార్చడం ఇదే తొలిసారి. మాయాబజార్ సినిమాతో అది మొదలు కావడం విశేషం.
సినిమాల్లో ట్విస్ట్‌లు ఉన్నట్లే.. ఈ రైట్స్ తీసుకున్న తర్వాతే అసలు సమస్య.. ఎదురయ్యింది. విజయవారి మాయాబజార్ నెగిటివ్‌లో 45 శాతం పాడైపోయింది. కేవలం 55 శాతమే ఫిల్మ్బాగుంది. దీంతో.. సినిమాను కలర్లోకి చేయడం సాధ్యం కాదేమోనని అంతా నీరుగారిపోయారు. కానీ.. అప్పుడే ఓ ఆలోచన వీరికి వచ్చింది. రాష్ట్రం నలుమూలలా ఉన్న ప్రింట్లను తెప్పిస్తే.. వాటిలోనుంచి మంచి భాగాలను తీసుకోవాలని నిర్ణయించారు. ఇలా ఓ లారీడు రీల్స్.. గోల్డ్‌స్టోన్ ఆఫీస్‌కు వచ్చిపడ్డాయి. వీటిలోనుంచి ఏరి కోరి.. మంచి మంచి సీన్లన్నింటినీ తీస్తే.. 98 శాతం మంచి రీల్ తయారయ్యింది. అప్పుడు మొదలయ్యింది.. అసలు వర్క్. అయితే... ఆ తర్వాత మరో సమస్యా ఎదురయ్యింది. కొంతభాగాన్ని థియేటర్లో వేసి చూస్తే.. చిన్న ముక్కలా కనిపించిందంట. దాంతో.. స్కోప్‌లోకి మార్చారు.
మాయాబజార్‌ను ఇప్పటికే ఎంతోమంది చూశారు.. చూస్తూనే ఉన్నారు. దీనికి కేవలం రంగులు అద్ది విడుదల చేస్తే .. ఎఫెక్ట్ ఏముంటుంది? అందుకే.. ఈ సినిమా మ్యూజిక్‌ను డీటీఎస్లోకి మార్చాలనుకున్నారు. ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం తయారు చేసిన మ్యూజిక్ ట్రాక్ పూర్తిగా పాడై పోయింది. దీంతో.. ఆనాటి సంగీతం ఏమాత్రం చెడిపోకుండా.. మళ్లీ రీక్రియేట్ చేశారు. అంటే.. గరగరలు.. రీళ్ల శబ్దాలు లేకుండా.. ఆహ్లాదకరమైన సంగీతాన్ని కలర్ మాయాబజార్లో ఆస్వాదించవచ్చన్నమాట. అది కూడా డీటీఎస్లో..
దాదాపు 165 మంది టెక్నీషియన్లు.. ఏడాదిన్నర పాటు పగలూ రాత్రి కష్టపడితే.. మాయాబజార్ రంగుల్లో సిద్ధమయ్యింది. ఆపాత మధురిమలు ఏమాత్రం చెడిపోకుండా.. నవతరానికి నచ్చేలా రంగుల్లో రూపుదిద్దుకొంది. బ్లాక్ అండ్ వైట్‌లోనే రెప్పవేయనీయకుండా చేసిన మాయాబజార్.. కలర్‌లోనూ మరింతగా ఆక్టటుకొనే అవకాశాలున్నాయి.
మాయాబజార్ ఎందుకు చూడాలి?
మాయాబజార్‌కు ఉన్న ప్రత్యేకత ఏమిటి? అసలు కలర్లో చూడాల్సిన అవసరం ఏమిటి? ఈ కోణంలోనూ ఆలోచిస్తే.. ఆసక్తికరమైన ఎన్నో అంశాలు తెలుస్తాయి. భారతంలో లేని స్టోరీని తీసుకొని.. దాన్ని అద్భుతంగా మలచడమే కాదు.. భారతంలో ఉందేమో అన్నంతగా అందరినీ నమ్మించగలిగారు దర్శకనిర్మాతలు. దీనికి తోడు.. సినిమా సంభాషణలు.. ఆర్టిస్టుల ఎక్స్‌ప్రెషన్స్‌ను కలర్లో చూస్తే.. ఆ ఫీలింగే వేరు..
పాండవులెక్కడ?
మాయాబజార్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సినిమా కథ ప్రధానంగా పాండవుల చుట్టూనే తిరుగుతుంది. కానీ.. ఎక్కడా పాండవులు తెరపై కనిపించరు. అసలు పాండవులను చూపించలేదన్న ఊహే ఎవరికీ రాదు. అంతలా కట్టుదిట్టంగా కథనం సాగుతుంది. ద్రౌపది వస్త్రాపహరణం సన్ని వేశాన్ని కూడా.. స్క్రీన్‌లో ఓ మూలకే పరిమితం చేశారు తప్ప.. పూర్తిగా చూపించిందీ లేదు. అంతేకాదు.. వ్యాసమహర్షి రచించిన మహాభారతంలో ఎక్కడా ఈ స్టోరీ ఉండదు. బలరాముడికి ఓ కూతురు ఉన్నట్లు.. ఆమెకు అభిమన్యుడికీ వివాహం జరిగినట్లు వ్యాసమహర్షి ఎక్కడా పేర్కొనలేదు. ఈ కథను తీసుకొని.. అద్భుతమైన సినిమాగా తెలుగు ప్రేక్షకులు ముందుంచారు దర్శకనిర్మాతలు.
మాయాబజార్ సినిమాలోని సంభాషణలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. సినిమా రచయత.. పింగళి నాగేంద్రరావు.. ఈ సినిమా కోసం కొన్ని ప్రత్యేక పదాలను సైతం సృష్టించారు. ఘటోత్కచుడి బంటులు మాట్లాడే పదాలు.. హాస్యపు జల్లును కురిపిస్తాయి. తసమదీయులు, దుషట చతుషటయం అంటూ పలకడం.. ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయంటూ.. ఘటోత్కచుడి సమర్థింపు సినిమాకే హైలైట్.
అంతేకాదు.. రత్నగింబళి, గిల్పం అంటూ కొత్తపదాలనూ ఇందులో ప్రస్తావించారు పింగళి. పౌరాణిక పాత్రల్లో.. అందులోనూ శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్‌ను నిలబెట్టిన సినిమా మాయాబజారే. ఈ సినిమాకన్నా ముందే.. ఓ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో నటించారు. కానీ.. అది హిట్ కాలేదు. దాంతో... మాయాబజార్లో కృష్ణుడి పాత్ర వేయడానికి ఎన్టీఆర్ భయపడ్డారు. కానీ దర్శకుడు కె.వి.రెడ్డి. ఎన్టీఆర్‌ను ప్రోత్సహించి... ఇందులో కృష్ణుడి వేషం వేయించారు. ఇక ఆ తర్వాత హిస్టరీ అందరికీ తెలిసిందే. కృష్ణుడంటే ఎన్టీఆర్ అన్న మార్కు.. అందరి దృష్టిలోనూ ఈ సినిమాతో పడిపోయింది.
అభిమన్యుడిగా అక్కినేని, శశిరేఖగా సావిత్రి నటన ఈ సినిమాలో అమోఘం. తెలుపు నలుపు వర్ణాల్లోనే.. ఎంతో అందంగా కనిపించే వీరిద్దరూ.. ఇప్పుడు రంగుల్లో మరింత అందంగా కనువిందు చేయనున్నారు. ఘటోత్కచుడు.. శశిరేఖగా మారినప్పుడు.. సావిత్రి నటించిన తీరు.. ఆమె ప్రదర్శించిన హావభావాలు.. మాటల్లో వర్ణించలేం. చూసి తరించాల్సిందే. ఘటోత్కచుడిగా ఎస్వీ రంగారావు నటనాచాతుర్యాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఇవన్నీ ఇప్పుడు రంగుల్లో ముస్తాబయ్యి.. ప్రేక్షకులను మరింతగా రంజింప చేయనున్నాయి.. .
బార్ట్లే మ్యాజిక్
లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. మాయాబజార్ అనగానే.. విజయా ప్రొడక్షన్స్, నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి, దర్శకుడు కే.వి.రెడ్డి పేర్లే ఎక్కువగా ప్రస్తావనకు వస్తాయి. కానీ.. ఈ సినిమా విజయం వెనకు ఓ మహావ్యక్తి కృషి ఉంది. అతనే మార్కస్ బార్ట్లే. మాయాబజార్‌కు కెమెరామెన్. బార్ట్లే సృష్టించిన మాయాజాలమే.. ఈ మాయాబజార్. ఆయన తీసిన అద్భుతమైన సీన్లే.. మాయాబజార్‌ను మరవలేని చిత్రంగా మలిచాయి.
మాయాబజార్.. పేరుకు తగ్గట్లుగానే ఎన్నో మాయలు. ఎన్నో వింతలు. కంప్యూటర్లు, గ్రాఫిక్స్ లేని యాభై ఏళ్ల కిందటే ఎన్నో అద్భుతాలను ఈ సినిమా కోసం సృష్టించారు కెమెరామాన్ మార్కస్ బార్ట్లే. ఈ సినిమా పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చే సన్నివేశం.. ఘటోత్కచుడి వివాహభోజనం. రకరకాల వంటకాలతో ఉన్న ప్లేట్ల ముందు ఘటోత్కచుడి భారీ ఆకారాన్ని దాల్చడం.. నోరు తెరవగానే.. ఆహార పదార్థాలు గాల్లో తేలుకుంటూ వెళ్లడం అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. అప్పట్లోనే ఈ సన్నివేశాన్ని ఎలా తీశారో ఎవరికీ అర్థం కాలేదు. అదే మార్కస్ బార్ట్లే గొప్పదనం. డబుల్ ఎక్స్పోజర్ - మాస్క విధానంలో దీన్ని తీసినట్లు ఆ తర్వాతి కాలంలో బార్ట్లే చెప్పారు. సగ భాగానికి ఫార్వర్డ్ యాక్షన్, మిగతా సగానికి రివర్స్ యాక్షన్ ఇస్తే ఈ ఎఫెక్ట్ వస్తుందన్నారు. అయితే.. అలాంటి ఎఫెక్ట్‌ను మళ్లీ ఎవరూ తీయలేకపోయారు.. అదే బార్ట్లే ప్రతిభకు నిదర్శనం.
అంతేకాదు.. అభిమన్యుడు అడవిలోకి వెళ్లినప్పుడు.. దారికి అడ్డంగా.. రాక్షకుడు రోడ్డు రూపంలో ప్రత్యక్షం కావడం... దావానలం వేగంగా వచ్చి.. అభిమన్యుడి రథాన్ని చుట్టుముట్టడం.. బాణం వేయగానే అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోవడం మరికొన్ని అద్భుతాలు. ఇక గాల్లో ఘటోత్కచుడు కనిపించడం.. ఓ కొండపైకి వేగంగా వచ్చి వాలడం.. ఆ వెంటనే.. కొంతభాగం కింద విరిగిపడడం.. అభిమన్యుడికీ.. ఘటోత్కచుడికీ మధ్య యుద్ధం.. అంతా ఓ అద్భుతమే. ఊహల్లోకి కూడా సాధ్యం కాని సన్నివేశాలను.. కళ్లముందు సాక్షాత్కరింపచేశాడు.. కెమెరా మాంత్రికుడు బార్ట్లే.
నిద్రపోతున్న శశిరేఖను ఘటోత్కచుడు గాల్లో తీసుకుపోవడం. శశిరేఖగా మారిపోవడం.. అహనా పెళ్లియంట పాటలో క్షణాల్లో రూపం మార్చుకోవడం.. అన్నీ వింతగానే కనిపిస్తాయి. ఇక విడిదిల్లు కట్టడం దగ్గర నుంచి ప్రతీ సన్నివేశమూ ఓ అద్భుతమే. రత్నకింబళి రెండు వైపులా చుట్టుకుపోవడం, గిల్పం గిరగిరా తిరగడం.. దానిపై కూర్చున్నవాళ్లను కిందపడేయడం.. మాటలకు అందని మాయలే. వీటన్నింటినీ చాలా బాగా కెమెరాలో ఒడిసిపట్టారు బార్ట్లే. వీటిని ఎలా తీసారన్నది ఇప్పటికీ అంతుబట్టని విషయమే.
ఇలా ఈ సినిమాను ఓ అపురూప చిత్రంగా మలచడంలో బార్ట్లే పాత్ర ఎంతో ఉంది. ఆయన సృష్టించిన మాయాజాలం అంతా.. ఇప్పుడు కలర్లో కనిపించనుంది. బ్లాక్ అండ్ వైట్‌లోనే అద్భుతంగా కనిపిస్తే. .. ఇక కలర్లో ఈ ఎఫెక్ట్లు ఎంత అద్భుతంగా కనిపిస్తాయో ఊహించుకోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రంగుల్లో మాయాబజార్ సినిమాను చూడడం నిజంగా మా అదృష్టమే. అయితే ఇక్కడ ఒక్క విషయం. రాముడిని, కృష్ణుడిని, విష్ణువును సినిమాలలో నీలి రంగులో (బ్లూ కలర్ లో) చూపిస్తున్నారు. ఇది తప్పు. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు .... అన్న పోతన పద్యాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఇలాగే ఈ మధ్య ఒక తెలివి తక్కువ సినీ కవి ఒక పాటలో
రామా రామా రామా నీలీ మేఘా శ్యామా
అని ఏడిచాడు. దీని గురించి చర్చ జరగాలి.
అదేమిటండి శంకరయ్య గారు ? నాకు తెలిసి మీరు చక్కని పద్య కవి. మీరిలా వ్రాసారేమిటండి ?
" నీలం " అంటే సంస్కృతంలో నలుపే కదండి. అనవసరంగా ఆ కవిని అలా తిట్టారు ?
ఫణీంద్ర గారూ, నేను చెప్పిందీ అదే. నీలం అంటే నలుపే. నీలమేఘశ్యాముడున్నాడు కాని ఈ "నీలి"మేఘశ్యాముడెక్కడివాడు?
అన్నట్టు... రంగుల మాయాబజార్ నిన్న చూశాను. కొన్ని పాటలు పూర్తిగా, కొన్ని పాటల్లో కొంతభాగం, కొన్ని సన్నివేశాలు, కొన్ని సంభాషణలు కట్ చేశారు. ప్రధాన పాత్రలకు రంగులు వేయడంలో చూపిన శ్రద్ధ బ్యాక్ గ్రౌండ్ విషయం లో చూపించలేదు. మొత్తానికి ఆనందాన్ని కలిగించింది.
ఓ .. అదంటారా ? సంస్కృతంలో " నీల " అన్న విశేషణం తెలుగులోకి వచ్చేసరికి " నీలి " అవుతుంది.
" నీలి మబ్బులు " అని ప్రయోగం. అయితే తెలియనివాళ్ళు అదే అలవాటులో " నీలి మేఘాలు " అని కూడా వ్రాస్తున్నారు.
అంతెందుకు ? ఆరుద్ర వంటి పండితుడే చాలా ఏళ్ళ క్రితమే ..
" నీలి మేఘాలలో ... జాలి కెరటాలలో ..." అన్న పాట వ్రాసాడు. చాలా హిట్ సాంగ్. మీరు వినే ఉంటారు.
బహుశ: మిశ్రమ సమాసం అనుకోవాలేమో !
" ఆర్య వ్యవహారంబు దుష్టంబు గ్రాహ్యంబు " అన్నారుగా !
సారీ, పైన నా కామెంటులో...
" జాలి కెరటాలలో " కాదు; " గాలి కెరటాలలో " అని ఉండాలి.
typing mistake సుమా !