హస్తిన చర్చలకు మరో మూడురోజులే గడువు. మరి చర్చలకు వెళ్లేది ఎవరు? పిలిచింది ఇద్దరినే. మూడో ప్రాంతం వారి భాగస్వామ్యం మాటేమిటి? అసలు ఏ స్థాయి నేతలు చర్చలకు వెళతారు? కాంగ్రెస్, టిడిపి నుంచి హాజరయ్యేదెవరు?.. రెండు రోజుల నుంచి ఆసక్తి కలిగిస్తోన్న ప్రశ్నలివి. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చర్చల ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో చర్చలకు వెళ్లే నేతలెవరన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు మాత్రమే ఆహ్వానితులు కావడంతో మూడో ప్రాంతం వారిని పిలవకుండా చర్చలు ఎలా ఫలవంతమవుతాయన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ చర్చల్లో ఆంధ్ర-తెలంగాణ ప్రాంత నేతలు మాత్రమే పాల్గొంటే రాయలసీమ వాసులమనోభావాలు కేంద్రానికి ఎలా తెలుస్తాయని ప్రశ్ని స్తున్నారు. అలా కాకుండా రాయలసీమ ప్రతినిధు లు మాత్రమే హాజరవుతే మరి ఆంధ్రప్రాంత మనో భావాలు ఎలా తెలుస్తాయన్నది మరో ప్రశ్న. మూ డు ప్రాంతాల ప్రతినిధులను ఆహ్వానిస్తే తప్ప చర్చ లకు ఫలితం ఉండదన్న కొత్తవాదన వినిపిస్తోంది.
చర్చల్లో ఎవరెవరు?
ఇక కాంగ్రెస్ నుంచి పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, గాదె వెంకటరెడ్డి తెలుగుదేశం నుంచి యనమల రామకృష్ణుడు, నాగం జనార్దన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నుంచి పార్టీ అధ్యక్షుడు కెసిఆర్, ప్రొఫెసర్ జయశంకర్, సిపిఐ నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, జి.మల్లేష్ సిపిఎం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, బిజెపి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, హరిబాబు, పీఆర్పీ నుంచి చిరంజీవి, కోటగిరి విద్యాధరరావు మజ్లిస్ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
పీఆర్పీ వాదనేంటి?
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా జనవరి 5న రాజకీయ పార్టీలను చర్చలకు కేంద్ర హోమంత్రి పిలిచే సమయానికి.. స్పష్టమైన అభిప్రాయంతో ఉన్న ఏకైక పార్టీ ప్రజారాజ్యమనే చెప్పాలి. పార్టీ పెట్టిన తర్వాత సామాజిక తెలంగాణకు సై అన్న చిరంజీవి.. సమైక్య ఉద్యమం మొదలుకాగానే ఆ వైపు మొగ్గు చూపారు. ఇది పార్టీలోని తెలంగాణ వాదులకు నచ్చలేదు. దీంతో వారంతా పార్టీ నుంచి బయటకు వచ్చి... ప్రజా తెలంగాణ పార్టీ పేర .. మరో కుంపటి పెట్టుకున్నారు. ఇక తెలంగాణ కావాలని డిమాండ్ చేసేవారెవరూ పార్టీలో లేరు కాబట్టి.. హోమంత్రితో భేటీలో సమైక్యవాదాన్నే పూర్తిగా వినిపించనుంది ప్రజారాజ్యం. ఈ విషయంలో ఇప్పటికే.. పార్టీ కీలక నేతలతో చిరంజీవి చర్చలు కూడా జరిపారు. తెలంగాణ విషయంలోనే పార్టీ చీలిపోయింది కాబట్టి.. పీఆర్పీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకూడదన్నది తెలంగాణ వాదుల వాదన. ప్రస్తుతం ఉపప్రాంతీయ పార్టీగా.. ప్రజారాజ్యం మారిపోయిందని ఎద్దేవా చేస్తన్న ఆ పార్టీ మాజీ నేతలు.. తమనూ చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ రకంగా ఈ వాదన పీఆర్పీని ఇరుకున పెట్టేదే. అయితే.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రజా పార్టీకి ఇంకా గుర్తింపు లేకపోవడంతో.. వారిని పిలిచే అవకాశాలు ఎంతమాత్రమూ లేవు. లోక్‌సత్తాను కూడా గుర్తింపు లేదన్న ప్రాతిపదికపైనే పక్కన పెట్టారు. కాబట్టి.. పీఆర్పీనుంచి బయటకు వెళ్లేవారిని పిలిచే ఛాన్స్ లేదనే తెలుస్తోంది.
టీడీపీ దారెటు?
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమేనంటూ ప్రణబ్ కమిటీకి తెలుగుదేశం పార్టీ రాసిన లేఖలోని సారాంశమిది. తెలంగాణ ఇస్తే తమకు ఎలాంటి అభ్యరమూ లేదంటూ స్పష్టమైన ప్రకటన కూడా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తెలంగాణపై కేంద్ర ప్రకటనకు ముందు.. ముఖ్యమంత్రి రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ ఇదే అభిప్రాయాన్ని ఆ పార్టీ చెప్పింది. కానీ.. ఆ తర్వాత మాత్రం పార్టీ వైఖరి అనూహ్యంగా మారిపోయింది. సీమాంధ్ర నాయకులు రాజీనామాలు చేస్తున్నా.. వారిని వారించే ప్రయత్నాన్ని కూడా పార్టీ అధినేత చంద్రబాబు చేయలేదు. ప్రజాభీష్టమంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. దీంతో.. సమైక్యవాదంవైపు మొగ్గుచూపినట్లు కనిపించింది. ఇక తెలంగాణలో మలివిడత ఆందోళనల్లో.. టీడీపీ ఎమ్మెల్యేలూ చురుగ్గా పాల్గొన్నారు. రాజీనామాలు చేశారు. టిడీపీకి చెందిన సీమాంధ్ర నేతలు సమైక్య వాదం వినిపిస్తుంటే.. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం.. ప్రత్యేక వాదన్ని వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలానే.. రెండు ప్రాంతాల మధ్య విడిపోయింది తెలుగుదేశం పార్టీ. ఇదే సమయంలో.. జనవరి5న చర్చలకు రమ్మని చిదంబరం పిలుపునివ్వడంతో.. పార్టీ వైఖరిని స్పష్టం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
టిడిపి తరపున ఆంధ్రా ప్రాంతం నుంచి ఒకరు.. తెలంగాణ నుంచి మరొకరు హోంమంత్రి నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. మరి.. ఈ ఇద్దరూ తెలంగాణకు మద్దతిస్తారా... లేక.. సమైక్యవాదమే సరైందంటారా... అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ విషయంలోనే ఆచితూచి స్పందిస్తున్నారు టీడీపీ ఉభయప్రాంతాల నేతలు. పార్టీ వైఖరి నేరుగా చెప్పకుండా.. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తమ అభిప్రాయాన్ని స్పష్టం చేయకుండా.. కాంగ్రెస్ పార్టీ వైఖరి ముందుగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ రకంగా.. హోంమంత్రి సమక్షంలో కాంగ్రెస్ అనుసరించే విధానాన్నే టీడీపీ కూడా ఫాలో కావచ్చు.
కాంగ్రెస్సే కీలకం
ఇంతకాలం ఏదో రకంగా తెలంగాణపై నెట్టుకొచ్చేసిన కాంగ్రెస్ పార్టీ.. హోమంత్రితో భేటీలో ఏ అభిప్రాయాన్ని చెబుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశం. అన్ని పార్టీలతో కలిసి సమావేశంలో పాల్గొనాలి కాబట్టి.. కచ్చితంగా పార్టీ వైఖరిని వెల్లడించాల్సిందే. ఓవైపు ప్రత్యేకవాదం.. మరోవైపు సమైక్య వాదంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఏ వాదానికి తలొగ్గుతుందన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే.. 2004 ఎన్నికల మేనిఫెస్టోలోనే తెలంగాణ విషయాన్ని ప్రస్తావించడమేకాక.. రాష్ట్రపతి ప్రసంగంలోనూ కాంగ్రెస్ చేర్చింది కాబట్టి.. ఇప్పుడు కొత్తగా నిర్ణయాన్ని చెప్పాల్సిన అవసరం లేదన్నది ఆ పార్టీ.. తెలంగాణ సీనియర్ల అభిప్రాయం.
అధిష్టానం సూచించిన మేరకే.. అభిప్రాయం చెబుతామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నా.. పరిస్థితి మాత్రం వేరుగానే ఉండొచ్చు. అనవసర వివాదానికి తావివ్వకుండా.. రెండు ప్రాంతాల నేతలనూ.. తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశాన్నే ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
2, జనవరి 2010, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి