పాకిస్థాన్‌లోని లాహోర్‌లో 19 సంవత్సరాల క్రితం జరిగిన వరుస పేలుళ్ళలో భారత జాతీయుడైన సరబ్‌జిత్‌సింగ్ నిందితుడని అక్కడి ప్రత్యేక కోర్టు నిర్ధారించి అతడికి ఉరిశిక్ష విధిస్తే, హైకోర్టు, సుప్రీంకోర్టులు ధ్రువీకరించాయి.అతడి మెడపైన ఉరి అనే కత్తి వేలాడుతోంది. ఈ పందొమ్మిదేళ్ళలో మన దేశంలో పాక్ జాతీయుల ప్రమేయం గల పేలుడు సంఘటనలు లెక్కకు మిక్కిలిగా జరిగాయి.
అన్నింటికన్నా పదహారేళ్ళ క్రితం ముంబైలో సంభవించిన వరుస పేలుళ్ళ నిందితులంతా పాక్‌కి పారిపోయి శిక్షలను తప్పించుకుంటున్నారు. వారిని అప్పగించమని మన దేశం కోరినప్పుడల్లా అసలు అటువంటివారెవరూ మావద్ద లేరని పాక్ పాలకులు బుకాయిస్తూ వస్తున్నారు. అలాగే, పార్లమెంటు మీద దాడి కేసులో అఫ్జల్ గురు అనే వ్యక్తికి సుప్రీంకోర్టు ఖరారు చేసిన మరణశిక్షను అమలు జరగనివ్వకుండా మన దేశంలో అడుగడుగునా నాయకులంతా అడ్డుపడుతున్నారు. మనది లౌకికవాద దేశం, పాక్‌ది ఇస్లామిక్ దేశం.అదీ తేడా. ఇక్కడ మత ప్రస్తావన అప్రస్తుతం అయినా, ఇరుగుపొరుగు దేశాల్లో పరిస్థితిలో ఎంత తేడా ఉందో వివరించడానికే ఈ ప్రస్తావన.
వాస్తవానికి సరబ్జిత్ సింగ్ అమాయకుడనీ,అతడిని పోలిన మంజిత్‌సింగ్ అనే వ్యక్తికి బదులు సరబ్జిత్నే మంజిత్గా నిర్ధారించి
పాక్ కోర్టులు సరబ్‌జిత్‌కి ఉరిశిక్ష విధించాయని అతడి కుటుంబ సభ్యులు నెత్తీ నోరూ మొత్తుకుంటున్నప్పటికీ వారిది అరణ్య రోదనే అవుతోంది. సరబ్జిత్ అమృతసర్ సమీప పట్టణమైన భికివిండికి చెందిన పశువుల కాపరి.అతడు పశువులను మేపుకుంటూ పొరపాటున పాక్ భూభాగంలో ప్రవేశించినందుకు అతడిని పాక్ జవాన్లు అరెస్టు చేశారు.అప్పటి నుంచి అతడు పాక్ పోలీసుల అధీనంలోనే ఉన్నాడు.అటువంటి వ్యక్తి లాహోర్ వరుస పేలుళ్ళతో సంబంధం కలిగి ఉండటం అసాధ్యం.అయితే,ఈ వాదాన్ని పాక్ పోలీసులు, నాయకులు తోసిపుచ్చుతున్నారు. పాక్ జాతీయులు మన దేశంలో ప్రవేశించినంత ఎక్కువగా, మనవారు పాక్ భూభాగంలో ప్రవేశించిన సంఘటనలు చాలా అరుదు. వాస్తవాధీన రేఖ వద్ద నిరంతర నిఘా ఉన్నా, ముళ్ళ కంచె ఉన్నా పాక్ చొరబాటుదారులు మన దేశంలోకి అధిక సంఖ్యలో ప్రవేశించడం,వారిలో అనేక మంది భద్రతాదళాలతో ఎదురు కాల్పుల్లో మరణించడం సర్వసాధారణం. అలాగే, పట్టుబడి జైళ్ళలో ఉన్న పాక్ జాతీయుల్లో ఉరి వంటి కఠినాతికఠినమైన శిక్షలకు గురి అయిన వారు చాలా అరుదు.అయినప్పటికీ, భారత భూభాగంలోకి పొరపాటున వచ్చిన తమ జాతీయులను భారత భద్రతాదళాలు కాల్చి చంపుతున్నాయనీ, మానవతా దృక్పథాన్ని అణు మాత్రం ప్రదర్శించడంలేదని పాక్ నాయకులు తరచు యాగీచేస్తూ ఉంటారు.
వాస్తవాలను నిగ్గు తేలిస్తే,పాక్ నుంచి వచ్చే వారిలో అధిక సంఖ్యాకులు లష్కర్ ఎ తోయిబా, జైష్ ఎ మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందినవారే.వీరిలో కూడా ఆత్మాహుతి దళాలకు చెందినవారు ఎక్కువ మంది ఉన్నారు.అందువల్ల పాక్ నుంచి జరిగే చొరబాట్లు ఉద్దేశ్యపూర్వకమైనవి, మన వైపు నుంచి పాక్ భూభాగంలోకి జరిగే అక్రమ ప్రవేశాలన్నీ పొరపాటున జరిగినవే. పాక్ జలాల్లోకి ప్రవేశించిన భారత మత్స్యకారుల్లో ఎంతో మంది ఇప్పటికీ పాక్ జైళ్ళలో మగ్గుతున్నారు. వారిపై విచారణ జరిపించిన దాఖలాలు చాలా తక్కువ. ఈ నేపధ్యంలో సరబ్జిత్ వంటి అమాయకులు పాక్ దళాలకు చిక్కి ఎన్ని అవస్థలు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సరబ్‌జిత్‌కి విధించిన మరణశిక్షను సైనిక పాలకుడైన పూర్వపు అధ్యక్షుడు ముషార్రఫ్ నాల్గేళ్ళ కిందటే ధ్రువీకరించారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అభ్యర్ధనపై శిక్ష అమలు జరపకుండా వాయిదా వేశారు. ఈలోగా పాక్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వం కూడా ముషార్రఫ్ మాదిరిగానే సరబ్‌జిత్‌కి శిక్ష అమలు జరిపేందుకే నిర్ణయించుకుంది. మళ్ళీ దౌత్యపరమైన ఒత్తిడి తేవాలన్న సరబ్జిత్ కుటుంబ సభ్యుల డిమాండ్ సమంజసమైనద
సరబ్జిత్కు ప్రమేయం ఉందని చెబుతున్న లాహోర్ పేలుళ్ళ సంఘటన కన్నా మన పార్లమెంటు మీద జరిగిన దాడి సంఘటన తీవ్రాతి తీవ్రమైనది. జాతీయ భద్రతాదళం (ఎన్ఎస్జి) కమెండోలు ప్రాణాలకు తెగించి పోరాడటం వల్ల ప్రధాని, ఉపప్రధాని, పార్లమెంటు ఉభయ సభల అధ్యక్షులతో సహా పార్లమెంటు సభ్యులు సురక్షితంగా బయట పడ్డారు. అరుదైన సంఘటనల్లో అరుదైనదిగా అభివర్ణితమైన పార్లమెంటుపై దాడి సంఘటనలో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురూకి మరణశిక్షను సుప్రీంకోర్టు ఖరారుచేసినా అది అమలు జరగడం లేదు. దీంతో పోలిస్తే అక్కడ సరబ్‌జిత్‌కి ప్రమేయం ఉందని చెబుతున్న సంఘటన సర్వసాధారణమైనదే.అయినప్పటికీ అతడికి శిక్షను అమలు జరిపేందుకే పాక్ సన్నాహాలు చేస్తోంది. నేరానికి తగిన శిక్ష పడాలని న్యాయశాస్త్రం ఘోషిస్తున్నా, మన దేశంలో క్షమాగుణం,జాలి,దయ ఎక్కువ కనుక ఎంతటి ఘోరాతి ఘోరానికి పాల్పడిన వారైనా శిక్షల నుంచి తప్పించుకోగలరు. లేదా, ఏళ్ళ తరబడి శిక్షలు వాయిదా పడేట్టు చేసుకోగలరు.
లాహోర్ పేలుళ్ళ కన్నా తీవ్రమైన వరుస పేలుళ్ళు 1993లో ముంబైలో సంభవించాయి. వాటికి సూత్రధారులైన దావూద్ ఇబ్రహీం, మెమన్ సోదరులను అప్పగించాలని మన దేశం కోరినప్పుడల్లా వారెవరూ తమ దేశంలో లేరంటూ పాక్ బుకాయిస్తోంది. అలాగే,ముంబై దాడుల సూత్రధారులను అప్పగించాలన్న భారత్ డిమాండ్‌ని తోసిపుచ్చుతోంది.వారిపై కనీసం తమ చట్టాల కిందనైనా విచారణ జరిపించి శిక్షలు పడేట్టు చూడాలన్న మన ప్రభుత్వ డిమాండ్ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. పైగా, తగిన ఆధారాలు ఇవ్వలేదంటూ భారత్‌పై నెపం వేస్తోంది. మరో వంక భారత జాతీయునిపై ఉరిశిక్ష జరిపేందుకే నిర్ణయించుకుంది.పాక్ ద్వంద్వ ప్రమాణాలకు ఇదే నిదర్శనం.అమెరికా అనుసరిస్తున్నదీ ద్వంద్వ ప్రమాణాలే కనుక పాక్ ద్వంద్వ ప్రమాణాలపై నోరెత్తడం లేదనే అనుకోవాలి
25, జూన్ 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఏమిటి మీ ధైర్యం, మీరు మతతత్వ వాదుల్లాగా మాట్లాడుతున్నారు. అసలు అఫ్జల్ గురును ఉరి తీయాలి అనడం మత తత్వమైపోయిందన్న విషయం తెలీదా మీకు. అర్జంటుగా మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి లేదంటే మీరు సెక్యులరిస్టులు కాదని జనాలూ డిసైడ్ చేస్తారు.