21, ఏప్రిల్ 2009, మంగళవారం
కమ్యూనిస్ట్ ల మిత్రద్రోహం
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఒక్కటైన మహాకూటమి ధర్మాన్ని సిపిఎం తుంగలో తొక్కిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ నిప్పులు చెరిగారు. సిపిఐ పోటీ చేయాల్సిన గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సిపిఎం స్నేహపూర్వక పోటీ అంటూ బరిలో దిగడం వెనుక స్వార్థపూరిత కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. మంగళగిరిలో సిపిఎం పార్టీ పోటీలో ఉండడాన్ని నారాయణ మరోసారి తప్పుపట్టారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన మంగళగిరిలో కాంగ్రెస్ అభ్యర్థికి విజయావకాశాలు కల్పించేందుకు సిపిఎం పార్టీ రహస్య ఒప్పందం కుదర్చుకుందని ఆయన దుమ్మెత్తిపోశారు. మంగళగిరిలో సిపిఐ పార్టీ ఓటమిని సిపిఎం కోరుకుంటోందని నారాయణ ధ్వజమెత్తారు. సిపిఐ విజయావకాశాలను దెబ్బతీసేందుకు యత్నిస్తే మాత్రం తాము చూస్తూ ఊరుకోబోమని నారాయణ హెచ్చరించారు. అలాగే వరంగల్ లో కూడా ఇతర పార్టీలకు సిపిఎం నాయకులు అమ్ముడుపోయారని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సోమవారంనాడు గుంటూరులో నారాయణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ పై విధంగా సిపిఎంపై దాడికి దిగారు.కాంగ్రెస్ పార్టీతో లోపయికారీ ఒప్పందం చేసుకున్న తరువాతే మంగళగిరిలో సిపిఎం బరిలోకి దిగిందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మిత్ర ద్రోహానికి సిపిఎం పార్టీ పాల్పడి, తమకు నష్టం కలిగించాలని ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఒక వైపున తాను, చంద్రబాబు, చంద్రశేఖరరావు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకొని కృషి చేస్తుంటే రాఘవులు మాత్రం ఆ ప్రయత్నాలను నీరుగారుస్తున్నారని నారాయణ నిప్పులు చెరిగారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి సిపిఎం పార్టీ ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో బహిరంగంగా వెల్లడించాలని నారాయణ డిమాండ్ చేశారు. ఈ స్థానం నుంచి సిపిఐ పోటీ చేయడం తప్పని పానకాలస్వామి సాక్షిగా చెబితే తాము పోటీ నుంచి వైదొలగుతామన్నారు.అయితే, నారాయణ ఆరోపణలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు కూడా తీవ్రంగానే ప్రతిస్పందించారు. మంగళగిరి సీటు విషయంలో తాము లోపాయికారీ ఒప్పందం చేసుకున్నామంటూ నారాయణ చేసిన ఆరోపణను రాఘవులు ఖండించారు. మార్చి 31న చంద్రబాబు, నారాయణలతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే తాము తమ పార్టీ అభ్యర్థిని మంగళగిరిలో నిలబెట్టామన్నారు. తాము పోటీ చేసే నియోజకవర్గాల జాబితాలో మంగళగిరి పేరును తాము చేర్చామన్నారు. అయితే, సిపిఐ జాబితాలో మంగళగిరి లేదా వినికొండల్లో ఏదో ఒకటి తనకు కేటాయించాలంటూ కోరిన విషయాన్ని రాఘవులు గుర్తు చేశారు. మంగళగిరిలో సిపిఎం అభ్యర్థికి విజయావకాశాలు అధికంగా ఉన్నప్పటికీ పోటీ నుంచి తప్పుకోకుండా సిపిఐ పార్టీయే ద్రోహానికి తలపడిందని రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి సీటు విషయంలో సిపిఎం - సిపిఐ పార్టీల మధ్య అవగాహన కుదరని పక్షంలో చంద్రబాబు నాయుడిని తటస్థంగా ఉండాలని తాను చంద్రబాబు నాయుడిని ముందుగానే ఒప్పించినట్లు రాఘవులు తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి