రాంచి : జార్ఖండ్ లో రెండవ దశ పోలింగ్ కు ఒక రోజు ముందు సాయుధ నక్సల్స్ లాతెహార్ జిల్లాలో ఒక ప్రయాణికుల రైలును తమ అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 700 మంది ప్రయాణికులతో రైలు బారకానా నుంచి ముగల్ సరాయికి వెళుతుండగా బుధవారం తెల్లవారు జామున లాతెహార్ జిల్లాలో హిల్ గఢ్ స్టేషన్ లో 200 మందికి పైగా మావోయిస్టులు రైలుపై దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం.ఇదిలా ఉండగా, తాము పిలుపు ఇచ్చిన 24 గంటల జార్ఖండ్ - బీహార్ బంద్ బుధవారం ప్రారంభం కాగా మావోయిస్టులు పాలమావు జిల్లాలో ఉటారి రోడ్ స్టేషన్ ను పేల్చివేశారు. మావోయిస్టులు కొందరు స్టేషన్ లో బాంబు పేలుడుకు పాల్పడినట్లు పాలమావు డిప్యూటీ కమిషనర్ అమితాభ్ కౌశల్ తెలియజేశారు. అయితే, ఈ పేలుడు వల్ల ఎంత మేరకు నష్టం వాటిల్లిందో వెంటనే నిర్థారణకు రాలేకపోయారు.24 గంటల బంద్ సందర్భంగా మావోయిస్టులు బుధవారం బీహార్ ఔరంగాబాద్ జిల్లాలో బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీస్ (బిడిఒ)లో బాంబు పేల్చారు. వారు పొరుగున ఉన్న గయ జిల్లాలో ఎనిమిది ట్రక్కులకు నిప్పంటించి, ఒక డ్రైవర్ ను కాల్చి చంపారు.వందలాది మంది నక్సలైట్లు బుధవారం తెల్లవారు జామున సుమారు 3 గంటలకు ఔరంగాబాద్ జిల్లాలో బిడిఒ కార్యాలయంపైకి విరుచుకు పడి ఆయన చాంబర్ ను, పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాల్ ను పేల్చివేసినట్లు అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ (ఎడిజిపి) నీలమణి తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆఫీసులో ఎవరూ లేరు.
మరొక సంఘటనలో నక్సలైట్లు తెల్లవారు జామున సుమారు ఒంటి గంటన్నరకు బారాచట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రాండ్ ట్రంక్ రోడ్ (జాతీయ రహదారి నంబర్ 2)పై ఎనిమిది ట్రక్కులను అటకాయించి వాటికి నిప్పంటించారు. పారిపోవడానికి ప్రయత్నించిన ఒక ట్రక్కు డ్రైవర్ ను వారు కాల్చి చంపారు. అతనిని లక్ష్మణ్ యాదవ్ గా గుర్తించారు. జార్ఖండ్ లోని లాతెహార్ లో పోలీసులు ఇటీవల ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులను వధించడం పట్ల నిరసన సూచకంగా రెండు రాష్ట్రాల బంద్ కు నక్సలైట్లు పిలుపు ఇచ్చారు.రైలు హైజాక్ కాలేదు :ఇలా ఉండగా లాతెహార్ జిల్లాలోని బారకానా నుంచి ముగల్ సరాయ్ వెళుతున్న ప్యాసింజర్ రైలును మావోయిస్టులు హైజాక్ చేయలేదని జార్ఖండ్ హోం శాఖ కార్యదర్శి ప్రకటించారు. తమ డిమాండ్లను సాధించుకునే క్రమంలో గ్రామస్థులే రైలును ఆపివేశారని ఆయన స్పష్టం చేశారు. ఒక గంట వ్యవధిలో సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
22, ఏప్రిల్ 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి