6, ఏప్రిల్ 2013, శనివారం
సీనియర్ పై హక్కెవరిది..?
నందమూరి తారకరామారావు, తెలుగు ప్రజలపై ఆయన చూపించినంత ప్రభావం మరెవరూ చూపించలేదన్నది జగమెరిగిన సత్యం. నటుడిగా, రాజకీయవేత్తగా ఆయన ప్రజల్లో ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. రాష్ట్రంలో తొలి కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాక, రాజధానికే పరిమితమైన రాజకీయాన్ని గ్రామాల్లోని రచ్చబండ వరకూ తీసుకెళ్లారు. సామాన్యులను రాజకీయ స్రవంతిలోకి తెచ్చారు. అందుకే, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనాఎన్టీఆర్ నిర్మించిన తెలుగుదేశం పార్టీ పునాదులు ఇంతవరకూ కదలకుండా అలానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని కాపాడుతున్నాయి.
ఇంతకాలం లేనిది ఇప్పుడో సమస్య వచ్చి పడింది. జూనియర్ ఎన్టీఆర్ పై వివాదం సంగతి అలా ఉంచితే, సీనియర్ ఎన్టీఆర్ పైనా వివాదం రాజుకొంటోంది. ఆయన ఫోటోను తమ ఫ్లెక్సీల్లో ముద్రించుకుని వైఎస్సార్ సీపీ కొత్త తరహా రాజకీయానికి తెరతీసింది. దీనిపై అటు టీడీపీ నేతలు, ఇటు వైఎస్సార్ సీపీ నేతలూ మాటలతూటాలు విసురుకున్నారు. ఎన్టీఆర్ ఫోటోను వెంటనే ఫ్లెక్సీల్లో నుంచి తొలగించాలని టీడీపీ డిమాండ్ చేస్తే, టీడీపీకే ఎన్టీఆర్ ఫోటోను పెట్టుకునే హక్కులేదంది వైఎస్సార్ సీపీ. దీంతో, ఎన్టీఆర్ ఎవరి సొత్తన్న అనుమానం అందరిలోనూ తలెత్తుతోంది.
తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టారు కాబట్టి, ఆయన బొమ్మను వాడుకునే హక్కు ఆ పార్టీనేతలకే ఉందన్నది ఒక వాదన. అయితే, ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన వెంటనే, వెన్నుపోటు పొడిచి, స్వయంగా ఆయన్నే పార్టీనుంచి గెంటివేసి, చీలిక శాఖనే అధికార శాఖగా మార్చుకుని, ఎన్టీఆర్ మరో పార్టీ పెట్టేలా చేసింది ఈ నేతలే. అప్పుడే టీడీపీకి ఎన్టీఆర్ కు సంబంధాలు తెగిపోయాయి. ఈ టీడీపీ నేతలకైతే ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మను వాడుకునే హక్కు లేదనే చెప్పాలి.
అంతేకాదు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టింది టీడీపీ. ఎన్టీఆర్ బతికున్నంతకాలం కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే పోరాడారు. వైఎస్ కాంగ్రెస్ నే నమ్ముకుని బతికారు. ఆయన మరణాంతరం ఆయన కుటుంబం ఆ పార్టీ నుంచి చీలిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ ను పెట్టుకుంది. అప్పుడు వైఎస్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగానే పనిచేశారు. కాబట్టి, ఎన్టీఆర్ ఫోటోను వాడుకునే హక్కు జగన్ పార్టీ నేతలకూ లేదు. ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది ఆ పార్టీలో చేరినంతమాత్రాన, వారు ఆ పార్టీకి చెందిన వాళ్లు అవుతారేమోగానీ, ఎన్టీఆర్ మాత్రం ఆ పార్టీకి చెందనే చెందరు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి వైసీపీలో చేరినా ఆమె ఫోటోను వాడుకునే హక్కుంటుందేమో గానీ, ఎన్టీఆర్ ఫోటోను మాత్రం వాడుకునే హక్కు వైఎస్సార్ సీపీకి ఉండదు.
ఇక కాంగ్రెస్ లో చేరిన మరికొంతమంది ఎన్టీఆర్ ఫోటోను వాడుకుంటూనే ఉన్నారు. దగ్గుబాటి దంపతులే ఇందుకు పెద్ద ఉదాహరణ. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ నేతల ఫోటోలతో పాటు, ఎన్టీఆర్ ఫోటోనూ వాళ్లు వాడుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన ఎన్టీఆర్ ను ఆ పార్టీ ప్రచారానికి వాడుకోవడం నిజంగానే దౌర్భాగ్యం.
టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ ఏపార్టీ నేతలకైనా ఎన్టీఆర్ ఇప్పుడు ఓట్లు రాల్చే యత్రం మాత్రమే. అంతేగానీ, ఆయనపై గౌరవంతోనో, ఆయన అడుగుజాడల్లో నడవాలనో ఏమాత్రం లేదు. అందుకే, ఎన్టీఆర్ కు అసలైన అభిమానులంతా ఇప్పుడు పోరాడాల్సిన సమయం వచ్చింది. ఎన్టీఆర్ ను ఏ పార్టీ కూడా ప్రచారానికి వాడుకోకూడదని ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే, ఈ పార్టీల కుళ్లు రాజకీయాలను చూసి, ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి