5, ఏప్రిల్ 2013, శుక్రవారం
మూడుముక్కలాటలో.. బాద్ షా
Categories :
badhsha . entertainment . news . ntr . POLITICS . tdp . tollywood . TOP . vijayawada . ysrcp
బాద్ షా గా అభిమానుల ముందుకు దూసుకువచ్చిన జూనియర్ ఎన్టీఆర్, రోజురోజుకూ అనవసరమైన వివాదాల్లో కూరుకుపోతున్నాడు. ఇప్పటికే తమ కుటుంబ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి దాదాపుగా దూరమైన జూనియర్, ఇప్పుడు తమ వర్గంలో మరింత వ్యతిరేకతను తెచ్చుకుంటున్నాడు. ఎన్టీఆర్ పరిస్థితిని అవకాశంగా చేసుకున్న వైఎస్సార్ సీపీ, తన ప్రచారం కోసం జూనియర్ ను జోరుగా వినియోగించుకొంటోంది. దీంతో, ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
జూనియర్ కు, టీడీపీ కి మధ్య పెరిగిన వైరం, ఇటీవలి బెజవాడ పర్యటనలో బయటపడింది. మలబార్ గోల్డ్ కార్యక్రమానికి జూనియర్ హాజరైనప్పుడు కేవలం, అతని ఫోటోలతోనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అభిమానులు. ఎన్టీఆర్ ఎప్పుడు వచ్చినా హడావుడి చేసే టీడీపీ నేతలు, అధిష్టానం నుంచి అందిన ఆదేశాలతో ఈ కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. చివరకి, ఎన్టీఆర్ వర్గమైన వంశీకూడా పార్టీ కారణంగా, అతన్ని కలవలేదు. టీడీపీ నేతలు ఒక్కరు కూడా ఎన్టీఆర్ కు స్వాగతం పలుకుతూ చిన్నపాటి ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో, టీడీపీ వేరు, ఎన్టీఆర్ వేరు అన్న అభిప్రాయం ఖరారైపోయింది.
జూనియర్ ఎవరి సొంతం?
ఎన్టీఆర్ పరిస్థితిని సాకుగా చేసుకున్న వైఎస్సార్ సీపీ నేతలు అతన్ని సొంతం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే షర్మిల విజయవాడ టూర్ సందర్భంగా, బెజవాడలో భారీ పోస్టర్ ను వేసి, అందులో ఎన్టీఆర్ ఫోటోనూ చేర్చారు. ఇది వివాదాస్పదమైనా ఎవరూ తొలగించలేదు. టీడీపీ నేతలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో, వైఎస్సార్ సీపీ నేతలు మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారు. కృష్ణాజిల్లాలో వీలైనంతగా జూనియర్ ఫోటోలను తమ ఫ్లెక్సీలలో వాడుకుంటున్నారు. మచిలీపట్నంలో అయితే మరో అడుగు ముందుకేసి, సీనియర్ ఎన్టీఆర్ ఫోటోనూ ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ నేతలు హడావుడిగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెట్టి, ఆ ఫ్లెక్సీని తొలగించాలని డిమాండ్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ సంగతి సరే, జూనియర్ ఫోటోను వాడుకున్నప్పుడు సదరు పెద్దమనుషులు ఎందుకు స్పందించలేదో..!
జూనియర్ కావాలనే చేస్తున్నారా..?
వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలలో జూనియర్ ఫోటో ఉందంటూ మీడియా రాద్దాంతం చేస్తున్నా, అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నా ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. తన ఫోటోను ప్రత్యర్థి పార్టీ ఫ్లెక్సీల్లో ఎలా వాడతారంటూ ప్రశ్నించలేదు. ఇదంతూ చూస్తుంటే, ఏది జరిగినా మన మంచికే అన్న అభిప్రాయంతో జూనియర్ ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికీ ప్రత్యేక కారణం ఉంది. టీడీపీతో వైరం వల్లే ఇంతకు ముందు విడుదలై దమ్ము సినిమాకు ఓపెనింగ్స్ దక్కలేదు. ఎంతో కష్టపడి చేసినా, లాభాలను తెచ్చిపెట్టడంలో ఆ సినిమా విఫలమయ్యింది. సరిగ్గా ఇప్పుడు అత్యధిక భారీ బడ్జెట్ తో బాద్ షా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఎలాగూ టీడీపీ తనకు దూరం అయ్యింది. ఇప్పుడు కోరి వస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కూడా వద్దనుకుంటే, దాని ఎఫెక్ట్ తన సినిమా కలెక్షన్లపై పడొచ్చేమోనని ఎన్టీఆర్ అనుమానిస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా, వైఎస్సార్ సీపీలో తన అనుంగు మిత్రుడు కొడాలి నాని ఉన్నారు కాబట్టి, తన ఫోటో వాడుకున్నా తప్పులేదన్నట్లుగా భావిస్తున్నట్లున్నారు. అయితే, పైకి మాత్రం తనదాకా ఈ విషయం ఇంకా రాలేదన్నట్లుగా జూనియర్ ప్రవర్తిస్తున్నారు.
కాంగ్రెసోళ్లూ మొదలెట్టారు
టీడీపీ ఇంతకాలం జూనియర్ ను వాడుకొంది. వైఎస్సార్ సీపీ ఇప్పుడే వాడుకోవడం మొదలుపెట్టింది. అలాంటప్పుడు తామెందుకు వాడుకోకూడదనుకుంటున్నట్లున్నారు కాంగ్రెస్ నేతలు. బాద్ షా రిలీజ్ సందర్భంగా విజయవాడలో దేవినేని నెహ్రూ కొడుకు, అవినాష్ పేరుతో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నెహ్రూ ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. అవినాష్ ను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలని ఆయన భావిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కు వీర ఫ్యాన్ అయిన నెహ్రూ, తన కొడుకును, జూనియర్ ఎన్టీఆర్ కు దగ్గర చేస్తున్నట్లు కనిపిస్తోంది. యూత్ లో , తమ సామాజిక వర్గంలో ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ ను తమ వైపు తిప్పుకోవడానికి అవినాష్, జూనియర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పైగా, మల్ బార్ గోల్డ్ కార్యక్రమానికి ఎన్టీఆర్ వచ్చినప్పుడు, తెరవెనుక సహకారాన్ని అవినాష్ అందించారంటూ ప్రచారం సాగుతోంది. జన సమీకరణ భారీగా చేసింది కూడా అవినాషే అని జూనియర్ అభిమానులు చెప్పుకుంటున్నారు.
వైఎస్సార్సీపీ, అవినాష్ లు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో, టీడీపీ నేతలూ రంగంలోకి దిగారు. బాద్ షా రిలీజ్ సందర్భంగా బెజవాడలో భారీగా పోస్టర్లు రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ను తమ చేతులారా వదులుకోవడం ఎందుకని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ మూడుముక్కలాట జూనియర్ కు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అన్నది.. బాద్ షా కలెక్షన్లే తేల్చనున్నాయి. బాద్ షా ఒడ్డున పడితే గానీ, ఈ ఫ్లెక్సీల వ్యవహారంపైనా, తానేపార్టీ వ్యక్తినన్నదానిపైనా ఎన్టీఆర్ పెదవి విప్పకపోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి