11, జనవరి 2012, బుధవారం
అండమాన్ ఆదివాసీలతో నగ్న నృత్యాలు చేయిస్తున్న టూరిస్టులు
Categories :
andaman . atrocities . jarawa tribe . news . nude dance . TOP . tribes
అండమాన్‌లో టూరిస్టుల అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ నివసించే అరుదైన గిరిజన జాతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయం బయటపడింది. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులను అడవుల్లోకి తీసుకువెళుతున్న టూరిస్ట్ కంపెనీలు.. అక్కడ నివసించే ఆదివాసీలతో నగ్న నృత్యాలు చేయిస్తున్నాయి. జరావా తెగకు చెందిన వారికి డబ్బులు ఇస్తామంటూ మభ్య పెట్టి డ్యాన్సులు చేయిస్తున్నారు. దీనికి స్థానిక పోలీసులు కూడా సహకరిస్తున్నారు. ఈ తెగలో కేవలం 403 మంది మాత్రమే జీవించి ఉన్నారు. ఇలాంటి వారిని కాపాడాల్సిన సర్కార్ కూడా దీనిపై దృష్టి పెట్టడం లేదు. ఈ దృశ్యాలను ఓ టూరిస్ట్ చిత్రీకరించి, బ్రిటన్‌లోని ది గార్డియన్ పత్రికకు అందించారు. ఈ వీడియోపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గానే స్పందించింది. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా అండమాన్ అధికారులను ఆదేశించింది. అయితే, అండమాన్ డీజీపీ మాత్రం, ఈ వీడియో కొత్తది కాదని, పదేళ్ల క్రితానిదని ప్రకటించారు. అప్పట్లో జరావా తెగలో చాలామంది బట్టలు వేసుకునేవారు కాదని, ఇప్పుడు వారిలో మార్పు వచ్చిందని అన్నారు. ఇక గార్డియన్ పత్రిక మాత్రం ఈ విషయాన్ని ఖండించింది. ఇది తాజా వీడియోనే అని ప్రకటించింది. జరావా తెగ మనిషి తొలితరం జాతుల్లో ఒకటిగా భావిస్తారు. దాదాపు 30వేల సంవత్సరాల క్రితమే వీరు ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అండమాన్లో నివసిస్తున్న నాలుగు అరుదైన జాతుల్లో ఇదీ ఒకటి. వాస్తవానికి అండమాన్కు సొంత హక్కుదారులు ఈ నాలుగు తెగల వారే. స్వేచ్ఛగా జీవించే వీరికి, బ్రిటీష్ కాలంలోనే కష్టాలు మొదలయ్యాయి. అండమాన్కు వలసలు మొదలైనప్పటినుంచి ఈ తెగల జీవితాలు ఛిద్రమైపోయాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి