8, నవంబర్ 2011, మంగళవారం
బీరాలు పోయారు.. బెదిరించారు.. చివరకు తోక ముడిచారు
పెట్రోల్ ధరలు పెరిగీ పెరగగానే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ అగ్గిమీద గుగ్లిలం అయ్యారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని, ధరల పెంపుతో సామాన్యుడి జీవితం అతలాకుతలమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఎంపీలంతా మద్దతు ఉపసంహరించమంటున్నా, ప్రధానితో భేటీకోసం ఆగామన్నారు. వెనక్కి తగ్గకపోతే, సర్కార్ నుంచి వైదొలగడానికీ సిద్ధమేనన్నారు. మమత మాటలతో యూపీఏ విచ్చిన్న ఖాయమనే అంతా అనుకున్నారు. మన్మోహన్ సర్కార్ ధరలు తగ్గించమని స్పష్టంగా ప్రకటించడంతో, యూపీఏ నుంచి తృణమూల్ చీలిపోతుందనే చాలా మంది అంచనాకు వచ్చారు. మమత పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడింది. TMC కి చెందిన 18 మంది లోక్ సభ ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ ఎంపీలు మంగళవారం ప్రధానితో ములాఖత్ అయ్యారు. రాజీనామా లేఖలు ఇచ్చి వస్తారనుకుంటే, రాజీ పడి వచ్చారు. సమావేశం అయ్యాక, ప్రధానికి తమ అసంతృప్తిని తెలయజేశామని, సామాన్యులు ఈ ధరల పోటును భరించలేరని చెప్పామని, ప్రధాని కూడా తమతో ఏకీభవించారని స్టేట్ మెంట్ ఇచ్చారు. మరోసారి ధరలు పెరిగితే మాత్రం మద్దతు ఉపసంహరిస్తామంటూ, ప్రస్తుతానికి ఉన్న అనుమానాలను పటాపంచలు చేశారు.
ఆది నుంచీ అంతే..
మమత వ్యవహార శైలిని దగ్గరనుంచి పరిశీలించినవారికి, ఆమెదంతా హడావిడిగానే కనిపిస్తుంది. ఆవేశంగా ముందడుగు వేయడం, ఆ తర్వాత వెనక్కి తగ్గడం మమతకు కొత్తేమీ కాదు. రెండువేల సంవత్సరంలోనూ వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ఇలానే ముప్పుతిప్పలు పెట్టారు మమతా బెనర్జీ. పెట్రోల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ, సెప్టెంబర్ 30,2000 న మంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ, వాజ్‌పేయి హామీ ఇవ్వడంతో వారంలో వెనక్కి తగ్గారు. అదే ఏడాది డిసెంబర్ 3న పంజాబ్‌లో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. కానీ ప్రధాని ఆమోదించకపోవడంతో పదవిలోనే కొనసాగారు. 2001, మార్చి లో తెహల్కా కుంభకోణం బయటపడ్డప్పుడు , ఎన్డీఏకు తృణమూల్ మద్దతు ఉపసంహరించింది. ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి.. కాంగ్రెస్‌కు స్నేహహస్తం చాచింది. అప్పట్లో బెంగాల్‌లో ఎన్నికలు ఉండడంతో బెంగాల్ దీదీ.. కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. కానీ, మే నెలలో జరిగిన ఎన్నికల్లో తృణమూల్‌కు చావు తప్పి కన్ను లొట్టపోయింది. దారుణంగా ఓడిపోవడంతో మమత మనసు మరోసారి మారింది. జూన్-జులైల మధ్య కాంగ్రెస్‌తో సంబంధాలు తెంచుకుని, మళ్లీ ఎన్డీఏ వైపు అడుగులు వేశారు. ఆగస్టు 27న ఎన్డీఏలో అధికారికంగా చేరారు. ఆ తర్వాత మళ్లీ ఎన్డీఏను వదిలిపెట్టి, యూపీఏతో సంబంధాలు కొనసాగిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి