8, నవంబర్ 2011, మంగళవారం
సీన్ రివర్స్: పట్నం నుంచి పల్లెకు
పల్లె రమ్మంటుంది.. పట్నం పొమ్మంటుంది. ఇది పాత సామెతే.. కానీ ఈ మధ్య రూట్ మారింది. ఉపాధి కోసం పట్నాలకు వలసలు పెరిగిపోయాయి. ఇదీ ఇప్పుడు గతమే.. ఎందుకంటే.. పట్నాల నుంచి పల్లెలలకు వలసలు మొదలవుతున్నాయి.. పట్నం పొమ్మంటుంటే... పల్లె మాత్రం ఉపాధి చూపిస్తాం రమ్మంటోంది...
ఖమ్మం జిల్లాలోనే ఏకైక పారిశ్రామిక పట్టణం పాల్వంచ. రెండు స్టీల్ ఫ్యాక్టరీలతో పాటు.. తెలంగాణలోనే అతిపెద్ద పవర్ ప్లాంట్ ఇక్కడ పనిచేస్తున్నాయి. వీటికి అనుబంధంగా చిన్నా చితకా చాలా పరిశ్రమలు కొలువుదీరాయి. వీటిల్లో పనిచేయడం కోసం, ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వందలాది మంది పాల్వంచకు తరలివచ్చారు. ఇంతకాలం ఇక్కడ ఉపాధికి ఢోకా లేకున్నా.. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది.
పాల్వంచలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. జనానికి తగ్గట్లుగా కొత్త పరిశ్రమలు ఏర్పడలేదు. దీంతో, ఉన్నవారికి ఉపాధి కరువయ్యింది. ప్రత్యేకించి మహిళలకు పని దొరకడం గగనంగా మారింది. దీంతో.. మహిళలంతా పల్లెబాట పట్టారు. రోజూ 30-40 కిలోమీటర్లు వెళ్లి మరీ పొలాల్లో పనిచేస్తున్నారు.
పాల్వంచ చుట్టుపక్కల పల్లెల్లో పత్తి,మిరప చేలల్లో పనిచేయడానికి వందలాది మంది నిత్యం వెళుతున్నారు. పని ముగించుకుని సాయంత్రానికి తిరిగి పాల్వంచకు చేరుకుంటున్నారు. కూలీల కొరతతో ఇంతకాలం ఇబ్బందులు పడ్డ రైతులు, తాజా పరిణామంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
స్థానికంగా ఎప్పుడైనా కూలీలు దొరకకపోతే, రైతులు పాల్వంచకు వచ్చి మరీ వీరిని తీసుకువెళుతున్నారు. పాల్వంచ పరిస్థితి త్వరలోనే మరికొన్ని పట్టణాలకు వచ్చినా ఆశ్చర్యం లేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Very interesting!