30, అక్టోబర్ 2011, ఆదివారం
దాంట్లో మనది రెండో స్థానం
1995లో 10720 మంది... 2000లో 16603 మంది.. 2004లో 18241 మంది ...2009లో 17368 మంది.. 2010లో 15964 మంది...
ఇవీ దేశవ్యాప్తంగా నమోదైన రైతు ఆత్మహత్యలు. ఇవన్నీ నోటి లెక్కలు కాదు.. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన నివేదికలోని నిజాలు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత పదిహేనేళ్లలో దేశంలో అత్యధికమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంకెల్లో చెప్పాలంటే, రెండు లక్షల 56 వేల 913 మంది వ్యవసాయం చేయలేక బలవంతగా ప్రాణాలు తీసుకున్నారు.
పొలం సాగు చేద్దామంటే చేతిలో డబ్బుండదు.. అప్పోసొప్పో చేసి విత్తనాలు కొంటే, ఆ తర్వాత ఎరువులు దొరకవు. క్యూలల్లో రోజుల తరబడి వేచి ఉండి ఏదోలా ఎరువులు సంపాదించి వేసినా, పొలం తడపడానికి నీరందదు. పొలంలో మోటరు ఉన్నా, కరెంటు ఉండదు. కళ్లముందే పంటలు ఎండుతుంటే, వాటిని చూడలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..
అన్ని కష్టాలు పడి, ఆరుగాలం శ్రమించి పంటపడించినా రైతుకు లాభం ఉండడం లేదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకదు. అంతా దళారీల ఇష్టారాజ్యం. పెట్టిన పెట్టుబడికి, వచ్చిన ఆదాయానికి పొంతనే ఉండదు. ఇల్లు గడిచేదెలా..? చేసిన అప్పు తీర్చేదెలా..? ఇక రైతు ముందు కనిపిస్తోంది ఒకే మార్గం... ప్రాణత్యాగం. రైతు ఆత్మహత్యలు ప్రమాదకరస్థాయిలో పెరిగిపోవడానికి కారణం అదే.
గత పదిహేనేళ్లలో దేశంలో చోటుచేసుకున్న ఆత్మహత్యల సంఖ్య.. గతంలో ఎప్పుడూ లేదు. 1995 నుంచి 2010 మధ్య రెండు లక్షల 56 వేల 913 మంది సూసైడ్ చేసుకున్నా, ఇందులో 2003 నుంచి 2010 మధ్య జరిగిన ఆత్మహత్యలే ఎక్కువ. ఈ ఎనిమిదేళ్లలో లక్షా 35 వేల 756 మంది చనిపోయారు. ప్రతీ ఏటా 15 వేలకు పైగానే ఈ మరణాలుంటున్నాయి తప్ప, దిగువకు మాత్రం రావడం లేదు. ఈ ఆత్మహత్యలు కూడా మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. 2003 నుంచి జరిగిన ఆత్మహత్యల్లో 65 శాతం మరణాలు.. ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. వీటిల్లోనూ మహారాష్ట్రది మొదటిస్థానం కాగా.. రెండోస్థానం మనరాష్ట్రానిదే.
ప్రభుత్వం ఘనంగా చెప్పుకునే పథకాలు, అభివృద్ధి ఫలాలు రైతులకు అందడం లేదనడానికి ఈ లెక్కలే ఓ సాక్ష్యం. అంతేకాదు.. వ్యవసాయం రోజురోజుకూ దుర్భరమవుతోందని, రైతు బతకడమే కష్టమవుతోందని ఈ లెక్కలే చెబుతున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గ్లోబలైజేషన్ రాక ముందు మన దేశంలో వ్యవసాయం ప్రధానంగా సబ్సిడీలతోనే నడిచింది. గ్లోబలైజేషన్ వచ్చిన తరువాత సబ్సిడీలు రద్దయ్యాయి. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకోక ఏమి చేస్తారు?