26, అక్టోబర్ 2011, బుధవారం
కుక్క ప్రేమ...!
వీధి కుక్కను చూస్తే చాలు మనకు ఎక్కడ లేని కంపరం పుట్టుకొస్తుంది. అది ఇంటి ముందు తచ్చాడుతుంటే, రాళ్లిచ్చిమరీ కొట్టి తరిమేస్తాం. అలాంటి కుక్కదే ఈ కథ. అవును, దాని ప్రేమే ఈ కథ. అయితే.. ఇది కుక్క తల్లిప్రేమ..
మా ఇంటి దగ్గర ఓ ఊరకుక్క ఈ మధ్యే ఏడు పిల్లలను కనింది. మా గోడను ఆనుకొని ఓ గుంటను తవ్వి అందులో పిల్లల్ని పెట్టింది. పిల్లల్ని కనడానికి ఓ రోజు ముందే ఆ పెద్ద గుంటను తవ్వుకుంది. అది తవ్వుతున్నప్పుడు చూసిన నాకు, అది ఎందుకలా చేస్తుందో అర్థం కాలే. కానీ, ఆ తర్వాతి రోజు బుజ్జిబుజ్జి పిల్లలు కనపడేసరికి విషయం అర్థమయ్యింది. తన పిల్లల కోసం ఎంత రక్షణ తీసుకుందోనని. అది పిల్లల్ని పెట్టి అప్పుడే పదిరోజులైపోయింది. దానికి తిండి దొరుకుతుందో లేదోనని ఇంట్లో మిగిలిన అన్నాన్ని, ఇతర పదార్థాలను ఓ రోజు దాని ముందుకు వేశాను. ఆ సమయంలో అది పిల్లలకు పాలిస్తోంది. లేచి వచ్చి తింటాదేమో అని అనుకుంటే అంగుళమైనా కదల్లేదు. పిల్లలను పాలు తాగిన తర్వాత తీరిగ్గా వచ్చి తినింది.
ఇక నిన్న రాత్రి ఒక్కసారిగా చినుకులు మొదలయ్యాయి. చూస్తుండగానే, భారీవర్షంగా మారిపోయింది. ఇంతలో ఇంటి పక్క నుంచి కుక్కపిల్లల అరపులు. అయ్యో వర్షంలో తడిసిపోతున్నాయోమోనని వెళ్దామంటే కరెంట్ లేదు. పైగా వర్షం. ఇక గొడుగు టార్చ్ వేసుకొని గోడ పక్కగ చూసే సరికి ఒకే ఒక్క పిల్ల కనపడుతోంది. మిగిలిన కుక్కపిల్లలన్నీ తల్లిచాటున వెచ్చగా బొజ్జున్నాయి. దేనిమీద వర్షం పడకూడని తన తలతడుస్తున్నా ఆ తల్లికుక్క వాటిని కవర్ చేస్తూ పడుకుంది. ఓ కుక్కపిల్ల మాత్రం బయటకు వచ్చేసింది. ఈ లోగా మా ఆవిడ కంగారు. ఏదైనా సంచి తీసుకెళ్లి వాటిపై వర్షం పడకుండా కప్పమని. అలా వెళ్దామంటే పక్కరోడ్డులోంచి వెళ్లాలి. పైగా కరెంట్ లేదు. పోనీ ఏదోలా వెళ్దామంటే, ఆ కుక్క భయపడి వెళ్లిపోతే ఆ పిల్లలకు ఆ మాత్రం రక్షణ కూడా ఉండదేమోనన్న అనుమానం. ఇక ఏమీ చేయలేక వదిలేశాం. కాసేపటికే వర్షం తగ్గిపోవడంతో సంతోషించాం. తాను తడుస్తున్నా, తన పిల్లలు తడవకూడదని ఆ కుక్క పడ్డ తాపత్రయం చూస్తే, మనుషులం చాలా తక్కువనుపించింది. కుక్కప్రేమ ముందు మనిషి ప్రేమ నిలవదనిపించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కుక్కలు పిల్లలను పెట్టినప్పుడు వాటికి ఎక్కువ ఆహారము కావాలి , మేము కూడా మా వీధి కుక్కలకు అలంటి సమయములో పెడతాము , ఒక అద్భుతం చెప్పనా కొన్ని సార్లు మగ కుక్కలు కూడా ఆకలి వేసినప్పుడు రాత్రుళ్ళు మా ఇంటి గేటు కొడతాయి , మేము కుక్కను పెంచుతాము కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది వాటికి పెడతాము , లేకపోతె పాలు పోస్తాము