28, అక్టోబర్ 2011, శుక్రవారం
నెంబర్ 2 ఎవరు?
బొత్స సెక్రటేరియెట్ గడప ఎందుకు తొక్కడం లేదు..?
సర్కార్లో కిరణ్ తర్వాత ఎవరు?
డిప్యూటీ సీఎం కేవలం చెస్ బోర్డులో పావు మాత్రమేనా..?
రాష్ట్రంలో నెంబర్ వన్ ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చెప్పేసింది. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా నెంబర్ 2 ఎవరనే? కిరణ్ తర్వాత సర్కార్ లో కీలక వ్యక్తి ఎవరనే..? అది పీసీసీ అధ్యక్షుడు, రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణా? లేక, డిప్యూటీ సీఎం గా ఛాన్స్ దక్కించుకున్న దామోదర్ రాజనర్సింహనా..? ఇక్కడే ముసుగులో గుద్దులాటలు, కాంగ్రెస్కు అలవాటైన రాజకీయాలు తెరపైకి వచ్చాయి.
వైఎస్ హయాంలో నెంబర్ 2 ఎవరన్నది అందరికీ సుస్పష్టం. తన తర్వాత రోశయ్యే అంటూ వైఎస్ చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. కీలక బాధ్యతలను అప్పజెప్పారు. అందుకే వైఎస్ హెలికాప్టర్ అదృశ్యం కాగానే, రోశయ్య నేతృత్వంలో కేబినెట్ సమావేశం కాగలిగింది. ఇప్పటి విషయానికి వస్తే, కిరణ్ తర్వాత ఎవరన్నది ఆయన ఎవరికీ చెప్పడం లేదు. అలా చేస్తే, తన పదవికే ముప్పు వస్తుందన్నది ఆయన భయం కావచ్చు. సర్కార్లో మరో కుంపటి మొదలైతే తట్టుకోవడం కష్టమే. పైగా, బాధ్యతలు అప్పజెప్పడానికి రోశయ్యలాంటి పెద్దమనిషి, అజాత శతృవు కేబినెట్లో లేనేలేరు. ఎవరో ఒకరిని ఎంచుకుందామా అంటే, మంత్రుల మధ్య గ్రూపు రాజకీయాలు తలెత్తడం ఖాయం అందుకే, సీఎం ఈ విషయంలో ధైర్యం చేయలేకపోతున్నారు.
సీఎం మాట అటుంచితే, నెంబర్ 2 పోస్టుపై ఆశలు పెట్టుకున్నవారి జాబితా మాత్రం పెద్దగానే ఉంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఈ హోదా కోసం తెగ ఆరాటపడిపోతున్నారు. ఎలాగూ పార్టీ ప్రెసిడెంట్ ను కాబట్టి, సీఎం తర్వాత అంతా తానే అని ఫీలవుతున్నారు. ఆ సంకేతాలను మిగిలిన మంత్రులకు ఇవ్వడానికి గతంలో గాంధీభవన్లోనే మంత్రులతో మీటింగులు పెట్టారు. సీఎం నోట అధికారికంగా తన హోదాను ప్రకటించుకోవాలని ఫీలయ్యారు. మొదట్లో మిగిలినమంత్రులూ అదే జరుగుతుందనుకున్నా, సీఎం పెదవి మెదలకపోవడంతో, బొత్సను పట్టించుకోవడం మానేశారు. ఇది బొత్సలో మరింత అసంతృప్తిని రగిలించింది. అందుకే, 60 రోజులుగా ఆయన సెక్రటేరియెట్ గుమ్మం తొక్కలేదు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిగిన కేబినెట్ మీటింగ్కు హాజరైనా, సెక్రటేరియెట్ లో జరిగిన సమావేశానికి మాత్రం రాలేదు. 40 రోజుల పాటు సమ్మె జరిగినా, సెక్రటేరియెట్కు వచ్చి సమీక్షించలేదు. చివరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ ప్రకటనను సైతం తన ఇంటినుంచే చేశారు తప్ప, సెక్రటేరియెట్కు రాలేదు. దీంతో, కేబినెట్ నుంచి బొత్సను తొలగించాలంటూ కిరణ్ గ్రూప్ హైకమాండ్ పై ఒత్తిడి తెస్తోంది.
ఇక డిప్యూటీ సీఎంగా దామోదర రాజనర్సింహ ఎంపికైనా, ఆయనకు దక్కిన బాధ్యతలు అంతంతమాత్రమే. సీఎం వెళ్లడానికి ఇబ్బందికరమైన పరిస్థితులున్న చోటకు మాత్రమే ఆయన వెళ్లగలుగుతున్నారు. ఉద్యోగులతో చర్చలు జరిపిన కేబినెట్ సబ్ కమిటీకి నేతృత్వం వహించారు. అంతటితోనే ఆయన పని అయిపోయింది. చివరకు తనంతట తాను నిర్ణయం తీసుకోలేని పరిస్థితి డిప్యూటీ సీఎంది. ఉద్యోగుల డిమాండ్లన్నింటికీ సీఎం ఆమోదం తెలిపితే తప్ప సమ్మె విరమణ జరగలేదు. అంతేకాదు.. రాజనర్సింహ నెంబర్ 2 అంటే ఎవరూ లెక్కచేసే పరిస్థితి లేదు. ఆయనకు పదవి దక్కడంపైనే మిగిలిన మంత్రుల్లో అసంతృప్తి రగులుతోంది. అందుకే, డిప్యూటీ దక్కినా నెంబర్ 2 అన్న సంకేతాలను సీఎం ఇంతవరకూ ఇవ్వలేదు. చెప్పాలంటే... సర్కార్లో ఇప్పుడు ఒకే ఒక్క నెంబర్ ఉంది.. అదే నెంబర్ వన్.. కిరణ్ కుమార్.. మరో నెంబర్ ను తన వెనుక ఎదిగేలా చేయాలనుకోవడం లేదు కిరణ్ కుమార్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి