10, మార్చి 2011, గురువారం
2050... భూగోళానికి ప్రమాదం
Categories :
మనం ఉంటున్న భూమికి.. మనకు ఆవాసమైన భూమికి అతిపెద్ద ప్రమాదం వచ్చిపడబోతోంది. మనిషి మనుగడనే ప్రశ్నార్థకం చేయబోతోంది.. ఆ ముప్పు కూడా మరెంతో దూరంలో లేదు.. జస్ట్ 40 ఏళ్లు.. ఈ నాలుగు దశాబ్దాల్లోనే క్రమక్రమంగా ఆ పెనుప్రమాదం మనపై పడగవిప్పి బలి తీసుకోబోతోంది.. మరి దాన్ని మీరు ఎదుర్కోగలరా.. అసలా ప్రమాదం ఏమిటి?
ఓ ప్రమాదం.. పెను ప్రమాదం...
ఆకాశం నుంచి అగ్నిగోళాలు విరుచుకుపడవు..
ఈ భూమిని అగ్నిగుండంగా మార్చేయవు..
భారీ భూకంపాలు రావు.. మన ఆవాసాలను కూల్చేయవు..
సునామీ కూడా ముంచెత్తదు.. ఈ భూమిని మింగేయదు...
కానీ.. రాబోయే ప్రమాదం మాత్రం మహా ప్రమాదకరమైంది..
ఇదేదో తీరప్రాంతాల్లో ఉన్నవారికో.. లేదంటే నదీతీరాల్లో ఉన్నవారికో వచ్చే ప్రమాదం కాదు..
అలాగని ఎడారుల్లో ఉన్నవారికి మాత్రమే ఎదురయ్యే ముప్పు అంతకన్నా కాదు..
ప్రపంచమంతటికీ ఎదురయ్యే ముప్పు..
ప్రతీ మనిషి ప్రాణానికీ పొంచిఉన్న ముప్పు..
అదే.. 2050
ఇది 2012 .. యుగాంతం లాంటిది కాదు.. .ఒక్కసారిగా భూమిని నాశనం చేసేయదు..
క్రమక్రమంగా భూమి స్వరూపాన్నే మార్చేసే ప్రళయం..
మనిషి జీవితాన్నే సమూలంగా మార్చేసే మహాప్రళయం..
ఈ ప్రళయం ఎలా ఉండబోతోంది..? ఈ 2050కి అర్థం ఏమిటి? అసలు 2050లో ఏం జరుగుతుంది..? మనకొచ్చే ప్రమాదమేమిటి?
2050లో ఏం జరుగుతుంది?
2050 నాటికి భూగోళ స్వరూపం మారిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏమాత్రం ఉండవు. ఇది మేం చెబుతున్న మాట కాదు.. పర్యావరణ వేత్తలు.. పరిశోధకులు.. శాస్త్రవేత్తలు చెబుతున్న విషయం. దీనికి కారణం ఏమిటో.. భూమిని ఇలా మార్చేది ఎవరో తర్వాత తెలుసుకుందాం. ముందు... 2050 నాటికి ఈ భూమిపై ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూద్దాం..
ఇప్పటికే మనం ప్రమాదకర యుగంలోకి అడుగుపెట్టేసాం. ఇప్పటికే మనల్ని ఇబ్బందిపెట్టే సమస్యలు మొదలైపోయాయి. మరో రెండు మూడేళ్లలో ఇవి తీవ్ర రూపాన్ని దాల్చుతాయి. ముందుగా మనపై విరుచుకుపడేది.. పెట్రోల్ డీజిల్ ధరలు. ఇప్పటికే చుక్కలనంటుతున్న ఆయిల్ ధరలు.. మరింత ఎగబాకుతాయి. ప్రస్తుతం మనం లీటరు పెట్రోలుకు చెల్లిస్తున్నమొత్తం మరో ఐదేళ్లలో రెట్టింపు కావచ్చు. అంత ఖర్చుపెట్టినా ఒక్కోసారి మనకు పెట్రోల్ దొరకదు. వాహనాల్లో ప్రయాణం మరింత భారం అయిపోతుంది. ఆయిల్ నిల్వలు అడుగంటిపోతాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
పెట్రోల్ అయిపోయిందన్న బోర్డులు తరచూ కనిపిస్తాయి. పెట్రోల్ బంకుల దగ్గర గంటలకొద్దీ క్యూల్లో నిలబడాలి. అయినా, పెట్రోల్ దొరుకుతుందన్న గ్యారెంటీ ఉండదు. ఇప్పుడు జరుగుతున్నట్లు కార్ల దొంగతనాలు అప్పుడు జరగవు. పెట్రోల్ దొంగలు పెరిగిపోతారు. రోడ్డు పక్కన ఎక్కడైనా కార్ పార్క్ చేసి వెళ్లితే... తిరిగి వచ్చే సరికి ట్యాంక్ ఖాళీ అయిపోతుంది.
నిత్యావసరాల ధరలు మరింత పెరిగిపోతాయి. ఆహార పదార్థాలు సరిపడా లభించవు. చెప్పాలంటే.. మనం చెల్లించే మొత్తానికి, మనకు దక్కే మొత్తానికి మధ్య పొంతనే ఉండదు. ఓ రకంగా అన్నింటికీ రేషన్ పద్దతి మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఆకలి కేకలు తప్పవు. మనం సంపాందించే దానిలో సింహభాగాన్ని కడుపునింపుకోవడానికి ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. సామాన్యుడి పరిస్థితి మరీ దుర్భరంగా మారుతుంది.
2030 తర్వాత.. మంచినీటికి కటకట ఏర్పడుతుంది. పరిశుభ్రమైన నీరు ఎవరికీ అందదు. 50, 60 రూపాయలకు దొరికే బ్రాండెడ్ మినరల్ వాటర్ బాటిల్ కొనడానికి.. వేలల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మున్సిపల్ వాటర్ కనెక్షన్లలో నీటి సరఫరా ఆగిపోతుంది. నీటికోసం పోరాటాలు చేయాల్సి ఉంటుంది. అవి మరింత భయకరరూపాన్ని దాల్చుతాయి. కొన్నిచోట్ల రక్తపాతాన్ని సైతం సృష్టిస్తాయి.
క్రమంగా భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎండలు మండిపోతాయి. అంతేకాదు.. అనూహ్యంగా వరదలు విరుచుకుపడతాయి. ఇళ్లను ముంచెత్తుతాయి. అంతుచిక్కని రోగాలు మరింతగా వ్యాపిస్తాయి. లక్షలాది మందిని బలితీసుకుంటాయి. అదో భయంకరమైన భవిష్యత్తు.. ఊహించుకుంటేనే వెన్నులో ఒణుకు పుడుతుంది.
2050 నాటికి ఈ భూమిపైన మనిషి సుఖంగా జీవించే పరిస్థితులు కనుమరుగవుతాయి. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా, అది మనిషి ఆకలిని ఏమాత్రం తీర్చలేదు. డబ్బున్నవాళ్లకు మాత్రమే సౌకర్యాలు అందుతాయి. సాధారణ మధ్యతరగతి జనానికి ఒక్కపూట గడవడమే గగనం అయిపోతుంది. చెప్పాలంటే... మనిషి జీవితమే నరకం అవుతుంది. ఈ భూమిపై బతకడమే కష్టమవుతుంది. ఇదే మనిషిని ముంచెత్తే ప్రళయం.
జనవిస్పోటం
మనకు భూమి ఎన్నో ఇచ్చింది. ఉండడానికి నివాసమయ్యింది. తినడానికి తిండినిస్తోంది. జీవించడానికి అవసరమైన ఎన్నో వనరులను అందిస్తోంది. అలాంటి భూమికి.. మనమేం ఇస్తున్నాం... ఒక్కసారి ఆలోచించండి. భూగోళాన్ని మనం దోచుకుంటున్నాం. భూమి స్వరూపాన్ని మార్చేస్తున్నాం. అంతేకాదు.. ఇప్పుడు మనమే భూమికి భారంగా మారాం. ఈ భారమే.. సమీప భవిష్యత్తులో అనూహ్యమైన ముప్పును మనకు తెచ్చిపెట్టబోతోంది. అందులోనూ.. ఈ ముప్పు ఎక్కువగా ఉంది మన దేశానికే.
అవును, అనూహ్యంగా పెరుగుతున్న జనాభానే ఇప్పుడు భూమికి శాపమవుతోంది. ప్రస్తుతం 2011 చివరికల్లా ప్రపంచ జనాభా 700 కోట్లను దాటిపోతుంది. ఇదే స్థాయిలో జనసంఖ్య పెరుగుతూపోతే.. 2050 నాటికి జనవిస్ఫోటనం ఖాయంగానే కనిపిస్తోంది. అప్పటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరే ప్రమాదం పొంచిఉంది. ఇదే జరిగితే.. ప్రపంచం అల్లకల్లోలం కావడంఖాయం. 2050 నాటికి జనవృద్ధితో ఎక్కువగా ఇబ్బందులు పడే దేశాల లిస్టులో ముందున్నది మనదేశమే. ఇప్పటికే దాదాపు 110 కోట్లను మన దేశజనాభా దాటిపోయింది. 2050 నాటికి ఇది మరింత వృద్ధి చెంది 150 కోట్లను దాటిపోవచ్చని అంచనా. ఈ స్థాయిలో జనం దేశంలో నివసించాలంటే.. మన దేశస్వరూపాన్ని చాలావరకూ మార్చాల్సి ఉంటుంది.
పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలికసదుపాయాలు ఏర్పడాల్సి ఉంటుంది. దీనికోసం అదనంగా ఇళ్లు భూమిపై నిర్మించాల్సి ఉంటుంది. జనాభా పెరిగేకొద్దీ, గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోతుంటాయి. వీరంతా పట్టణాలకు వలసరావాల్సి ఉంటుంది. వీరందరూ నివసించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం అంత సులువైన పనేమీ కాదు. పైగా, జనాలు పెరిగేకొద్దీ నగరాలు, పట్టణాలు విస్తరిస్తూనే ఉంటాయి. ఇవి విస్తరిస్తున్నకొద్దీ, పంటపోలాలు.. అడవులు మాయమవుతుంటాయి. ఇవన్నీ కాంక్రీట్ కట్టడాలుగా రూపాంతరం చెందుతాయి.
మనదేశంలో పచ్చనిపంటలతో కళకళలాడాల్సిన ఎన్నో పొలాలు.. నివాసయోగ్యాలుగా మారిపోయాయి. వ్యవసాయభూములు ప్లాట్లుగా కన్వర్ట్ అవుతున్నాయి. 2050 నాటికి ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. వ్యవసాయ భూముల విస్తీర్ణం చాలావరకూ తగ్గిపోతుంది. దీనివల్ల మనం రెండు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ పొలాలనుంచి రావాల్సిన ఆహారధాన్యాల దిగుబడి ఆగిపోతుంది. అదే సమయంలో పెరిగిన జనాభాకు మరింతగా ఆహారం కావాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు ఒకదానికొకటి పూర్తి విరుద్ధమైన అంశాలు. ఇదే అసలు సమస్యకు కారణం.
మనదేశంలో మాత్రమే కాదు.. ప్రపంచమంతా ఇలాంటి ఉత్పాతాన్నే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆహారధాన్యాలను వినియోగించే వారి సంఖ్య, వినియోగించే మోతాదు విపరీతంగా పెరుగుతుంది. కానీ, ఆ స్థాయిలో ఉత్పత్తిమాత్రం కావు. దీంతో డిమాండ్ పెరిగి.. ధరలు పెరుగుతాయి. ఉన్నతవర్గాలకు మాత్రమే ఆహారపదార్ధాలు అందుబాటులో ఉంటాయి. సామాన్యుడు జీవించడం కష్టమైపోతుంది. కరువు కాటకాలు, ఆకలి కేకలు ఎక్కువవుతాయి. దోపిడీలు, దాడులు పెరిగిపోతాయి. పైగా, సాగు కోసం, జనావసరాల కోసం అడవులను అంతం చేయడం మరింత వేగవంతమవుతుంది. దీనివల్ల పర్యవరణ సమతుల్యం పూర్తిగా దెబ్బతిని, మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి.
జనాభా పెరిగేకొద్దీ, సహజవనరులను ఉపయోగించుకోవడం ఎక్కువవుతుంది. జనం అవసరాలకు తగ్గట్లుగా ఉత్ప్తతులను తయారుచేయడానికి పరిశ్రమలు మరింత శక్తిని వాడుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా వందేళ్ల వాడుకోవల్సిన వనరులను మనం పదేళ్లలోనే వాడేస్తాం. ఆయిల్ కొరత ఏర్పడ్డా... నీటికి కటకట వచ్చినా.. ఇదే కారణం. అందుకే.. ఈ భూమికున్న ప్రధాన ముప్పు ఎవరో కాదు.. మనిషి మాత్రమే. 2050నాటికి భూగోళ స్వరూపాన్ని మార్చేది కూడా మనిషే.
బతకడం ఎలా?
అందరికీ సరిపడే ఆహారం లేకపోతే.. మనుషులు జీవించగలరా..?
దాహం తీర్చుకోవడానికి నీరు దొరకకపోతే మనం బతకగలమా..?
మన వాహనాలకు అవసరమైన ఇంధనం లభించకపోతే.. కాలుకదపగలమా..?
అడవులు నాశనమైతే వర్షాలు కురుస్తాయా..?
పంటపొలాలు మాయమైతే ఆహారధాన్యాలు ఉత్పత్తి అవుతాయా?
జనాభా పెరిగిపోతే వచ్చిపడే ఉత్పాతాలేమిటో ఈ ప్రశ్నలే చెబుతాయి. ఇతర గ్రహాలపై మనం జీవించగలమా లేదా అని ఎన్నో ఏళ్లుగా పరిశోధిస్తున్నాం. మనకు సరిపడే గ్రహాలకోసం వెదుకుతున్నాం. కానీ, మన భూమిపైనే మనం భవిష్యత్తులో ఎలా జీవించగలం అన్నదాన్ని ఆలోచించలేకపోతున్నాం. పాతికేళ్ల క్రితం ఈ భూమిపై కనిపించిన దృశ్యాలు.. పచ్చని చెట్లు.. పంటపొలాలు ఇప్పుడు కనిపిస్తున్నాయా..? అలాంటిది.. మరో నలభై ఏళ్ల తర్వాత ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి..
ప్రస్తుతం భూమిపై మనం సృష్టించిన వినాశనానికి నిదర్శనమే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు. వాతావరణం వేడెక్కిపోతోంది. కాలాలు మారిపోతున్నాయి. అకాల వర్షాలు కురుస్తున్నాయి. వీటన్నింటికి కారణం అడవులు అంతరించిపోవడం. అదే సమయంలో వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి కాలుష్యం మరింతగా వాతావరణంలో కలవడం. ప్రస్తుతం విడుదలవుతున్న కాలుష్యం 2050 నాటికి రెట్టింపు కావచ్చని ఐక్యరాజ్యసమితి అంచనాలు చెబుతున్నాయి. అంటే.. అప్పటి వాతావరణం మరింత ఘోరంగా ఉండొచ్చు.
2050 నాటి పరిస్థితులను ఎదుర్కోవడం కోసం మనం ఇప్పటినుంచే సిద్ధం కావాల్సి ఉంటుంది. మానవజాతి మనుగడకు ముప్పు ఏర్పడకూడదంటే.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారధాన్యాల ఉత్పత్తిపైనా, వ్యవసాయరంగంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి. పంటపొలాలను నివాసప్రాంతాలుగా మార్చకుండా కఠినమైన చట్టాలను ప్రభుత్వాలు రూపొందించాలి. ప్రస్తుతం మన వ్యవసాయ రంగ దిగుబడి భవిష్యత్తు అవసరాలను ఏమాత్రం తీర్చలేదు. దిగుబడులను రెట్టింపు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. మేలైన సాగుపద్దతులను రైతులకు అలవాటు చేయాలి.
ఇక నీటి వనరులను వినియోగించుకోవడమూ కీలకమే. నీటి వృధాకు అడ్డుకట్ట వేసి, ప్రతీ నీటి చుక్కను వినియోగించుకునే పరిస్థితిని సృష్టించాలి. సహజవనరులైన పెట్రోల్,డీజిల్, బొగ్గులపై ఆధారపడడం తగ్గించి సంప్రదాయేతర ఇంధనాలను ఉత్పత్తి చేయాలి. పర్యావరణానికి మేలు చేసే హైడ్రోజన్ ఫ్యూయల్, సోలార్ ఎనర్జీని మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవాలి.
అడవులు అంతరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉంది. ఇది ప్రభుత్వాలకే వదిలిపెట్టడానికి వీలులేదు. చెట్లను నరకకుండా చూడాలి. వీలైనన్ని చెట్లను పరిసర ప్రాంతాల్లో పెంచాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది.. జనాభా నియంత్రణ. ఇప్పటికే భూమికి భారంగా మారాం. జనాభా వృద్ధికి కళ్లెం వేయకపోతే, అన్ని దేశాలూ పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికోసం కఠినమైన కుటుంబనియంత్రణా పద్ధతులను అమలు చేయాలి. ప్రతీ ఒక్కరు జనాభా పెరిగితే, తలెత్తే దుష్పరిణామాల గురించి తెలుసుకోవాలి. జనం ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి. జనాభాను నియంత్రించగలిగితే.. మనం చాలా సమస్యలను అధిగమించినట్లే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి