25, జనవరి 2011, మంగళవారం
లాల్‌చౌక్ చుట్టూ రాజకీయం
జాతీయ పతాకాన్ని ఎవరైనా విమర్శిస్తే.. వాడు దేశద్రోహిగా భావిస్తాం. జెండా ఎగరవేయడానికి అడ్డంకులు సృష్టిస్తే.. దేశభక్తి లేదనుకుంటాం. అదే పనిని ప్రభుత్వాలు చేస్తే ఏమనాలి..? రిపబ్లిక్ డే సందర్భంగా లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఎగరవేయవద్దంటున్నాయి యూపీఏ, కాశ్మీర్ సర్కార్‌లు. బీజేపీ మాత్రం ఎగరవేస్తామంటోంది..? అసలు లాల్‌చౌక్‌లో జెండా ఎగరవేయడానికి ఇంత ప్రాధాన్యం ఎందుకు?
గణతంత్రదినోత్సవం... భారతదేశ సార్వభౌమత్వానికి నిదర్శనం. బ్రిటీష్ పాలన నుంచి బయటపడి... గణతంత్ర రాజ్యంగా మన దేశం ఎదిగిన రోజు జనవరి 26, 1950. దానికి నిదర్శనంగానే.. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతీచోటా జెండావందనం ఘనంగా జరుగుతుంది. త్రివర్ణపతాకం రెపరెపలాడుతుంది. దేశమంతా ముక్తకంఠంతో జయహో భారత్ అంటుంది. జాతీయ గీతాన్ని గొంతెత్తి పాడుతుంది.
మన ఆయుధ సంపత్తిని, శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి సగర్వంగా చాటిచెప్పే రోజు రిపబ్లిక్ డే. త్రివిధ దళాల కవాతుతోపాటు.. మన అమ్ములపొదిలో ఉన్న విలువైన అస్త్రాలను సైతం ప్రభుత్వం రిపబ్లిక్ పెరెడ్‌లో ప్రదర్శిస్తుంది. దేశంపై జరిగే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనే సత్తా మనకుందన్న విశ్వాసం ఈ రిపబ్లిక్‌డే నిర్వహణలో అడుగడుగునా కనిపిస్తుంది.
కానీ.. ఈ సారి అంతటి విశ్వాసం కేంద్ర ప్రభుత్వంలో కనిపించడం భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్‌లో రిపబ్లిక్ డేన ఫ్లాగ్ హోస్టింగ్‌పై సర్కార్ వెనుకడుగు వేస్తోంది. శ్రీనగర్‌లోని చారిత్రక ప్రాంతమైన లాల్‌చౌక్‌లో జెండా ఎగరవేయాలన్న బీజేపీ నిర్ణయాన్ని తీవ్రంగా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. లాల్‌చౌక్‌లో జెండా ఎగరవేయడానికి వీల్లేదన్న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నిర్ణయానికి వంతపాడుతోంది.
ఏక్తాయాత్రకు అడ్డంకులు
రాష్ట్రీయ ఏక్తా యాత్ర. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. దేశం నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలతో.. జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు చేరుకోవాలన్నది బీజేపీ నేతల ప్రణాళిక. శ్రీనగర్‌లోని కీలక ప్రాంతమైన లాల్‌చౌక్‌లో జనవరి 26న జాతీయ జెండాను ఎగరవేయాలన్నది ఆ పార్టీ లక్ష్యం.
దేశం నలుమూలల నుంచి కార్యకర్తలను శ్రీనగర్ దిశగా బీజీపీ కొన్ని రోజులుగా తరలించడం మొదలుపెట్టింది. రైలు, రోడ్డుమార్గాల్లో బీజేపీ కార్యకర్తలు లాల్‌చౌక్‌లో జెండా ఎగరవేయడానికి ప్రయాణమయ్యారు. కానీ, ఈ యాత్రకు జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్ గానీ ఏమాత్రం సుముఖంగా లేవు. అందుకే యాత్రను విరమించుకోమంటూ బీజేపీని కోరాయి. దానికి బీజేపీ అంగీకరించకపోవడంతో, ప్రభుత్వమే రంగంలోకి దిగింది. బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ నిలువరిస్తోంది. బెంగళూరు నుంచి బయలుదేరిన ట్రైన్‌ను మార్గమధ్యనుంచే వెనక్కి పంపించేసింది. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టారు.
అంతేకాదు.. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులను సైతం మూసివేయించింది. ఏక్తాయాత్రలో పాల్గొనడానికి జమ్మూ విమానాశ్రయానికి చేరుకున్న బీజేపీ అగ్రనేతలు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లను అరెస్ట్ చేసింది. సరిహద్దులు దాటించి పంజాబ్‌లోని మాదాపూర్‌కు తరలించింది. కాశ్మీర్‌లోకి అడుగుపెడితే అరెస్ట్ చేస్తామంటూ బీజేపీ కార్యకర్తలకు అక్కడి ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సరిహద్దులను దాటుతున్న కార్యకర్తలను జైళ్లకు తరలిస్తోంది. పంజాబ్-జమ్మూ సరిహద్దుల్లో ఉన్న లఖన్పూర్ వద్ద జనవరి 25 సాయంత్రం నాటికి పోలీసులు, బీజేపీ కార్యకర్తల మోహరింపుతో యుద్ధవాతావరణం నెలకొంది.
జెండా ఎందుకు ఎగరవేయకూడదు..?
మనది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. మన రాజ్యాంగంలోని అవతారికలోనే ఈ మాటలను చెప్పుకున్నాం. కానీ, ఆచరణలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ చేపట్టిన ఏక్తాయాత్రపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. అసలు శ్రీనగర్‌లోకి ఎవరూ వెళ్లకూడదని.. లాల్‌చౌక్‌లో జెండా ఎగరవేయకూడదనీ.. కేంద్ర ప్రభుత్వమూ చెబుతుండడం అందరినీ విస్తుపరుస్తోంది. అసలు త్రివర్ణ పతాకాన్ని లాల్‌చౌక్‌లో ఎందుకు ఎగరవేయకూడదు..? శ్రీనగర్ మన భూభాగంలో లేదా ..? జాతీయ జెండా ఎగరవేయడానికే స్వేచ్ఛ లేనప్పుడు.. దాన్ని మన దేశంలో భాగం అనుకోవచ్చా..?
లాల్‌చౌక్‌లో జెండా ఎగరవేయడమే తప్పని కేంద్రం భావిస్తోంది. జమ్ముకాశ్మీర్‌లోని ప్రభుత్వం వద్దని చెప్పింది కాబట్టి.. కేంద్రం కూడా అదే పాట పాడుతోంది. ఓ ప్రాంతంలో జాతీయ జెండాను ఎగరవేయొద్దని ప్రభుత్వమే ప్రకటించడం కన్నా సిగ్గుచేటు మరొకటి ఉండకపోవచ్చు. బీజేపీ యాత్ర రాజకీయ ప్రయోజనాల కోసమే అని కాంగ్రెస్ చెబుతుంటే.. జాతీయ సమైక్యత కోసమే అంటోంది బీజేపీ.
జాతీయజెండాను ఎగరవేయొద్దని చెబుతున్న వారిని నియంత్రించడం మాని, జెండా ఎగరవేయడానికి వెళుతున్న వారిని కట్టడి చేయాలనుకోవడంపై బీజేపీ మండిపడుతోంది. ఇది వేర్పాటు వాదులకు కొమ్ము కాయడమేనని తీవ్రంగా విమర్శించింది. కాశ్మీర్ కూడా దేశంలో అంతర్భాగమని.. వేర్పాటువాదులను సవాల్ చేయడానికే ఈ యాత్రను చేపట్టామని బిజేపీ యువమోర్చా ప్రకటించింది. కేంద్రం కూడా జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి మద్దతు పలకడంపై బిజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. కాశ్మీర్ సర్కార్ మాత్రం ఇందుకు సిద్ధంగా లేదు. లాల్‌చౌక్‌లో జెండా ఎగరవేస్తే.. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందంటూ భయపడుతోంది. అందుకే, బీజేపీ యాత్రకు అడ్డుతగులుతోంది.
లాల్‌చౌక్‌కు ఎందుకంత ప్రాధాన్యం
కాశ్మీర్‌లోని చారిత్రక ప్రాంతం లాల్‌చౌక్. చరిత్రలో నిలిచిపోయే ఎన్నో సంఘటనలకు ఈ ప్రాంతమే సాక్షి. శ్రీనగర్‌లో సాధారణ కూడలిగా ఉన్న ఈ ప్రాంతం.. చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకోవడానికి కారణం భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్న కీలక ప్రకటనను నవంబర్ 2, 1947న లాల్‌చౌక్‌లోనే నెహ్రూ చేశారు. ఆ సమయంలో ఆయనతో పాటు అప్పటి కాశ్మీర్ ప్రధాని షేక్ అబ్దుల్లా కూడా ఉన్నారు..
ఆ తర్వాత కూడా ఎన్నో కీలక సంఘటనలు లాల్‌చౌక్‌లో చోటు చేసుకున్నాయి. కాశ్మీర్ పొలిటికల్ పార్టీలకు, వేర్పాటువాద సంస్థలకు ధర్నాలు, సభలు నిర్వహించుకోవడానికి ఇదే ప్రధాన వేదిక. నిత్యం ఏదో ఓ అలజడి ఈ ప్రాంతంలో చోటు చేసుకుంటూనే ఉంటుంది. 1980లో బజాజ్ ఎలక్ట్రికల్స్ లాల్‌చౌక్‌లో క్లాక్ టవర్‌ను నిర్మించింది. అప్పటినుంచి దీనికి మరింత గుర్తింపు వచ్చింది.
1992లో ఈ లాల్‌చౌక్‌కు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కాశ్మీర్‌లో పరిస్థితులను నిరసిస్తూ.. బిజేపీ అప్పటి అధ్యక్షుడు మురళీమనోహర్ జోషి క్లాక్‌టవర్‌పై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. దీంతో వేర్పాటు వాదులు మరింత రెచ్చిపోయారు. ఆ తర్వాత కాశ్మీర్‌లో ఆందోళనలు ఎక్కువయ్యాయి. 1993లో హింసాత్మక సంఘటనలు ఎక్కువగా జరగడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. ఏప్రిల్ 10, 1993న లాల్‌చౌక్‌లో ఆందోళనకారులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో దాదాపు 125 మంది చనిపోయారు.
అప్పటి నుంచి 2009 వరకూ బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో లాల్‌చౌక్‌లో జెండా వందనం జరిగేది. అయితే.. ఈ ప్రాంతానికి రాజకీయ ప్రాధాన్యం లేకపోవడంతో 2010 నుంచి భద్రతా దళాలు రద్దు చేశాయి. నిరుడు లాల్‌చౌక్‌లో త్రివర్ణపతాకం ఎగరవేయలేదు. దానికన్నా ముందే, 2008లో అమర్‌నాథ్ భూ వివాదం చెలరేగిన సమయంలో వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. పాకిస్తాన్ జెండాలను లాల్‌చౌక్‌లో ఎగరవేశారు. వందలాదిమంది తరలివచ్చి క్లాక్‌టవర్‌కు పాక్ జెండాను కట్టారు. దీన్ని అక్కడి ప్రభుత్వం చూస్తూ ఉండిపోయిందే తప్ప.. అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయింది.
లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ప్రభుత్వం ఎగరవేయకపోవడం.. అదే సమయంలో ప్రతీ ఆందోళనలోనూ పాకిస్తాన్ జెండాలను కడుతుండడంపై బీజేపీ ఎప్పటినుంచో ఆగ్రహంతో ఉంది. అందుకే, ఈ రిపబ్లిక్ దినోత్సవానికి త్రివర్ణపతాకాన్ని ఎగరవేయాలని సంకల్పించింది. వేలాదిగా తరలవెళ్లి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకొంది. కానీ, దీనికి కాశ్మీర్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం అడ్డుపడడంతో బీజేపీ సంకల్పం నెరవేరేలా కనిపించడం లేదు.
లాభనష్టాల మాట
పాకిస్తాన్ జెండా ఎగరవేయడానికి లేని అడ్డు... మన దేశ జాతీయ పతాకాన్ని ఎగరవేయడానికి ఏమిటన్నది బిజేపీ ప్రశ్న. చెప్పాలంటే దీనికి సమాధానం చెప్పే స్థితిలో కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ లేవు. పైగా, ఈ మధ్య కాలంలో వేర్పాటు వాదుల కార్యకలాపాలు కాశ్మీర్‌లో ఎక్కువవుతున్నాయి. అందుకే.. జాతీయ సమైక్యతను చాటి చెప్పడానికి బిజేపీ ఈ యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ సారి కూడా లాల్‌చౌక్‌లో జెండా ఎగరవేయకపోతే, వేర్పాటు వాదలకు భయపడినట్లవుతుందన్నది బీజేపీ అభిప్రాయం. ఓరకంగా ఇది నిజమే.. దీన్ని అలుసుగా తీసుకొని, వేర్పాటు వాదులు దేనికైనా తెగించవచ్చు.
అయితే.. బీజేపీ యాత్రలోనూ కొన్ని తప్పులున్నాయి. కొంతమంది వెళ్లి లాల్‌చౌక్‌లో జాతీయపతాకాన్ని ఎగరవేస్తే ఏ తప్పూ లేదు. కానీ వేలాది మందితో తరలిరావడమే సమస్య. ఇంత పెద్ద ఎత్తున బిజేపీ నేతలు కాశ్మీర్‌లోకి వెళితే అది అనవసర ఆందోళనలకు దారి తీస్తుంది. ఏ మాత్రం అదుపుతప్పినా... అది ఎక్కడివరకూ పోతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే యాత్రకు అడ్డంకులు.
ఏడాదికి పైగా అల్లర్లు ఆందోళనలతో అట్టుడికిన కాశ్మీరం.. ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా కనిపిస్తోంది. ఆందోళనకారులు కాస్త వెనక్కితగ్గడంతో శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమయంలో మళ్లీ బీజేపీ యాత్రతో ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయో అన్న ఆందోళన కాశ్మీర్ సర్కార్‌ది. పైగా, బీజేపీ కార్యకర్తలు కాశ్మీర్‌లోకి వస్తే.. తాము కూడా పోటీ యాత్రను చేస్తామంటూ జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకుంది. ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన అల్లర్లలో జేకేఎల్‌ఎఫ్‌దే ప్రధాన పాత్ర. ఈ సంస్థ అధ్యక్షుడు యాసిన్ మాలిక్.. కాశ్మీర్ వేర్పాటువాదుల్లో ప్రధాన వ్యక్తి. అందుకే, యాత్రకు ఒమర్ సర్కార్ అనుమతించడం లేదు. ఒకవేళ నిజంగా కాశ్మీర్‌లో జెండా ఎగరవేయడమే బీజేపీ అభిమతమైతే.. లాల్‌చౌక్‌కు సమీపంలోని స్టేడియంలో జరిగే ప్రభుత్వ అధికార కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఒమర్ అబ్దుల్లా స్వయంగా ఆహ్వానం పలుకుతున్నారు. కానీ, అందుకు బీజేపీ సిద్ధంగా లేదు.
వేర్పాటువాదులకు ఎక్కడ కోపం వస్తుందోనని లాల్‌చౌక్‌లో జెండా ఎగరవేయవద్దంటోంది సర్కార్. సరే, అలాగే కానిద్దాం. కానీ, రేపు కాశ్మీర్ అంతటా త్రివర్ణపతాకం ఎగరవేయవద్దు.. మాకిష్టం లేదని యాసిన్ మాలిక్ తదితరులు ప్రకటిస్తే.. రిపబ్లిక్ డేను నిలిపివేస్తుందా..? ఇప్పుడు వెనక్కి తగ్గితే రేపు ఇదే జరగొచ్చు.. వేర్పాటు వాదులకు బలం పెరగవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బీజేపీవాళ్ళు ఎగురవేస్తే వాళ్ళకు పేరొస్తుందని కుళ్ళుకొనేబదులు కాంగ్రేసోళ్ళే ఎగరవేయవచ్చు కదా:) లాల్‌చౌక్‌కు సమీపంలోని స్టేడియంలో జరిగే ప్రభుత్వ అధికార కార్యక్రమంలో పాల్గొనమనేబదులు అక్కడకూడా వారే మరో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయవచ్చుకదా:) ఒక ఊర్లో ఒక చోటే ఎగురవేయాలన్న రూలేం లేదుకదా:)
Congress appeasement of minorities harm India.
Note: Do you know that Congress is in the hands of minorities (that Italian, a minority).
Why minorities work against the nation?