5, మార్చి 2010, శుక్రవారం
హెల్.. కాప్టర్లు..
ఖమ్మం-కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో హెలికాప్టర్ మిస్సయ్యింది. గంటపాటు.. ఎక్కడుందో తెలియదు. ఎటు వెళుతుందో తెలియదు..
ఏం జరుగుతుందో పోలీసులకు అర్థం కాలేదు. హెలికాప్టర్కోసం పెద్ద ఎత్తున సెర్చింగ్ మొదలయ్యింది. హెలికాప్టర్‌కు ఏం జరిగింది..? బ్రేకింగ్ న్యూస్ఏంటంటే.. ఇలాంటి మిస్సింగ్‌లు మరెన్నో జరగబోతున్నాయి..
రాష్ట్రంలో కలకలం పుట్టించిన ఈ హెలికాప్టర్.. ఏరియల్ సర్వే కోసం.. హైదరాబాద్‌నుంచి బయల్దేరింది. ఖనిజవనరుల సాఖ ఆధ్వర్యంలో సర్వే కోసం శాస్త్రవేత్తలు ఇందులో వెళ్లారు. అయితే.. కొద్దిసేపటికే ఈ ఛాపర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సిగ్నల్ అందకపోవడంతో.. హెలికాప్టర్ ఎక్కడుందో చాలాసేపు తెలియలేదు. ఖమ్మం- కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో హెలికాప్టర్ మిస్ అయినట్లు హైదరాబాద్ నుంచి.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. పోలీసులు హెలికాప్టర్ ఆచూకీ కనిపెట్టడానికి రంగంలోకి దిగారు. ఈ రెండు జిల్లాల్లోనూ పెద్ద ఎత్తునే గాలింపు చేపట్టారు. కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట, చిల్లకల్లు ప్రాంతాల్లో కాసేపు చక్కర్లు కొట్టినట్లు సమాచారం రావడంతో ఆ ప్రాంతాల్లోనూ సెర్చింగ్ మొదలుపెట్టారు.
డీజీపీ కూడా.. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంతలోనే.. నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో ఓ హెలికాప్టర్ దిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీన్ని నిర్దారించుకున్న అనంతరం పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
వైఎస్‌ది కూడా ముందు మిస్సింగే..
సెప్టెంబర్.. రెండు... ఎప్పటిలానే.. ఆరోజు కూడా తెల్లవారింది. వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువచేయాలన్న ఉద్దేశ్యంతో.. వైఎస్ చేపట్టిన రచ్చబండ కార్యక్రమం మరికొన్ని గంటల్లో ప్రారంభం కావాల్సి ఉంది. ఆయన హెలికాప్టర్లో చిత్తూరు వెళ్లడానికి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ.. వాతావరణం అనుకూలించకపోవడంతో కొంతసేపు ఆగిపోయారు. ఉదయం 8 గంటల 38 నిమిషాలకు.. అనుమతి లభించడంతో హెలికాప్టర్ బేగంపేట నుంచి బయల్దేరింది. 5500 అడుగుల ఎత్తులో ప్రయాణించడానికి ఏటీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేఘాలు దట్టంగానే ఉన్నా... దాదాపు అరగంట పాటు.. ఎలాంటి ఇబ్బందిలేకుండానే ప్రయాణం సాగింది.
సమయం 9 గంటల 3 నిమిషాల 20 సెకన్లయ్యింది. అప్పటికి.. 46 నాటికల్ మైళ్ల దూరంలో.. 5600 అడుగుల ఎత్తున హెలికాప్టర్ ప్రయాణిస్తోంది. 50 మైళ్లకు చేరగానే.. 5500 అడుగులకు దిగిరావాలని ఏటీసీ పైలెట్లకు సూచించింది. 9 గంటల 7 నిమిషాల 46 సెకన్లకు.. 120 నాట్స్ వేగంతో, 5500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు పైలెట్లు సమాచారం అందించారు. మరో మూడునిమిషాల్లోకే .. 64 నాటికల్ మైళ్ల దూరానికి హెలికాప్టర్ చేరుకొంది. అక్కడే దట్టమైన మేఘాల్లోకి ప్రవేశించింది. వాతావరణ వివరాలు అందించే హెలికాప్టర్‌లోని రాడార్.. రెడ్ సిగ్నల్ ఇవ్వడం మొదలుపెట్టింది. 9 గంటల 12 నిమిషాల 52 సెకన్లకు హైదరాబాద్‌లోని ఏటీసీని చివరిసారిగా సంప్రదించారు. మరికాసేపటికే.. రాడార్లకు హెలికాప్టర్‌కు మధ్య సంబంధాలు కట్ అయ్యాయి. మేఘాలు అడ్డుగా ఉండడంతో.. నిర్దేశించిన మార్గానికి.. కొద్దిగా ఎడమవైపు వెళ్లాలని పైలెట్లు నిర్ణయించారు. ఆదిశగా ప్రయాణం మొదలుపెట్టారు. అప్పటికీ మేఘాల్లోనూ హెలికాప్టర్ వెళుతోంది. 9 గంటల 16 నిమిషాల 31 సెకన్లకు కుడివైపున మరిన్ని మేఘాలు ఉన్నట్లు పైలెట్లు గుర్తించారు. కృష్ణ దాటిన తర్వాత ఎడమవైపుకు మళ్లాలని నిర్ణయించుకున్నారు. 9 గంటల 20 నిమిషాల 22 సెకన్లకు.. పైలెట్ల సంభాషణలు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డ్ అయ్యింది. కృష్ణానది దాటిన తర్వాత వాతావరణ పరిస్థితి మెరుగుపడుతుందని పైలెట్లు భావించారు. కానీ.. అప్పుడే అసలు సమస్య మొదలయ్యింది.
9 గంటల 21 నిమిషాల 7 సెకన్లకు. .. హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఛాపర్ ప్రయాణించడానికి కీలకమైన ట్రాన్స్మిషన్ ఆయిల్ ప్రెజర్లో తేడాలు వచ్చాయి. అటోపైలెట్ను ఆన్ చేసి.. సమస్యను పరిష్కరించడానికి చెక్లిస్ట్ను వెతకడంలో పైలెట్లు మునిగిపోయారు. 9 గంటల 27 నిమిషాల 24 సెకన్లయ్యే సరికి.. ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. ఎదురుగా నేలను గమనించిన కోపైలెట్ ఎం.ఎస్.ఎన్. రెడ్డి.. గో ఎరౌండ్ అంటూ.. గట్టిగా అరిచారు. ఆ సమయంలో నిమిషానికి 10 వేల అడుగుల వేగంతో కిందకు దిగిపోతోంది. హెలికాప్టర్‌పై అప్పటికే పైలెట్లు నియంత్రణ కోల్పోయారు. ప్రమాదం నుంచి బయటపడడానికి ప్రయత్నించడానికి కూడా.. పైలెట్ల చేతిలో సమయంలేదు. షాక్ నుంచి తేరుకునేలోగానే.. హెలికాప్టర్ వేగంగా దూసుకువెళ్లి... పావురాలగుట్టపై వేగంగా కూలిపోయింది. తునాతునకలవ్వడంతో.. శకలాలు చెల్లాచెదురయ్యాయి. 9 గంటల 27 నిమిషాల 57 సెకన్లకు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ఆగిపోయింది.
హెలికాప్టర్ మిస్ అయ్యిందన్న విషయాన్ని ముందుగా రాడార్‌ను పర్యవేక్షించేవారు గుర్తించాలి. ఏటీసీ ద్వారా.. మిస్ అయిన ప్రాంతంలోని పోలీసులను అలర్ట్ చేయాలి. కానీ.. వైఎస్ హెలికాప్టర్ ఇంకా రాకపోవడంతో చిత్తూరులో ఉన్న అధికారులు వాకబు చేస్తే తప్ప.. హెలికాప్టర్ గల్లంతయ్యిందన్న విషయం తెలియలేదు. ముందు మిస్ అయ్యి.. ఆ తర్వాత.. కొండపై కూలిపోయింది వైఎస్ హెలికాప్టర్..
రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రమాదాలు
రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రమాద మనగానే .. ముందుగా... గుర్తొచ్చేది లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి. మార్చి 3, 2002 న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయారు. భీమవరం నుంచి బయల్దేరిన హెలికాప్టర్... కైకలూరు సమీపంలో చేపల చెరువులో కూలిపోయింది.
దక్షిణాది సినిమాల్లో టాప్‌స్టార్‌గా ఎదిగిన సౌందర్య కూడా... ఇలానే ప్రాణాలు కోల్పోయింది. 2004లో బీజేపీ తరపున రాష్ట్రంలో ప్రచారం చేయడానికి సిద్ధమైన సౌందర్య.. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయల్దేరారు. కానీ కొంతసేపటికే హెలికాప్టర్ కూలిపోయింది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్‌రావు సింధియా కూడా ఇదే తరహాలో దుర్మరణం పాలయ్యారు. 2001 అక్టోబర్ 1న ఢిల్లీ నుంచి టెన్ సీటర్ ప్రైవేట్ ప్లేన్‌లో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు బయల్దేరారు. కానీ.. కొంతసేపటికే.. ఢిల్లీ ఏటీసీతో ప్లేన్ కాంటాక్ట్ కట్ అయ్యింది. లక్నో సమీపంలో కూలిపోయింది. విమానం ప్రయాణిస్తున్న వారందరూ.. ఈ ప్రమాదంలో మరణించారు.
ప్రమాదపు ప్రయాణం
ఎక్కడికైనా త్వరగా వెళ్లాలంటే.. వీఐపీలు ముందుగా ఎంచుకునేది హెలికాప్టర్‌నే. ఎంతదూరాన్నైనా గంటల్లోనే చేరుకోవడం.. కావల్సిన చోట దిగే అవకాశం ఉండడంతో.. హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా బడా రాజకీయ నేతలైతే.. చాపర్ లేనిదే సిటీ కూడా దాటడం లేదు. కానీ ప్రతీ వంద ప్రయాణాల్లో ఇరవై... ప్రమాదకరంగా.. అత్యంత ఉత్కంఠగానే సాగుతున్నాయి.
రాష్ట్రంలో హెలికాప్టర్ల వాడకం విషయానికొస్తే.. ముందు ముఖ్యమంత్రి.. ఆ వెనుకే.. టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఉంటారు. ఎన్నికల సమయంలోనూ అందరికన్నా ముందుగా హెలికాప్టర్ బుక్ చేసుకుంది కూడా కేసీఆరే. కృష్ణానది వరదల్లో మహబూబ్‌నగర్ చిక్కుకున్నప్పుడు.. బాధిత ప్రాంతాలను సందర్శించడానికీ.. హెలికాప్టర్‌నే వాడుకున్నారు. అక్టోబర్ 10, 2009న ఇలా కేసీఆర్ రాజోలిలో దిగాల్సి ఉన్నా.. హెలికాప్టర్ జాడ మాత్రం కనిపించలేదు. అందరిలోనూ టెన్షన్.. చివరకు.. చాలాసేపటి తర్వాత వీపనగండ్లలో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.
హెలికాప్టర్ ప్రయాణాల్లో ఇలాంటి అనుభవాలు కేసీఆర్‌కు ఎన్నో ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు కూడా.. ఎక్కువగా హెలికాప్టర్ ప్రయాణాలు చేసేవారు. ఇటీవల కాలంలో చాలావరకూ తగ్గించినప్పటికీ.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం వాడక తప్పడం లేదు. కొన్నిసార్లు ఇబ్బందిపడుతూనే చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణాలు చేశారు.
ఇక టిఆర్ఎస్ నేత విజయశాంతికీ హెల్ కాప్టర్ తిప్పలు తప్పలేదు. వరంగల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొనడానికి హెలికాప్టర్లో వెళ్లారు. కానీ.. అది దారితప్పడంతో.. అందరిలోనూ కంగారు మొదలయ్యింది. దాదాపు గంటన్నర సేపు గాల్లోనే చక్కర్లు కొట్టి చివరకు.. కడవెండిలో దిగింది. ఇక విమానాలు, హెలికాప్టర్లతో ఎక్కువ ఇబ్బందులు పడింది.. బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడే. విజయవాడలో ఎన్నోసార్లు.. ఆయన ప్రయాణిస్తున్న విమానాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. హెలికాప్టర్లు కూడా చాలాసార్లు మొరాయించాయి. జనవరి 29, 2005న వెంకయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బీహార్‌లోని నక్సల్ ప్రాబల్య ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండయ్యింది. ఆ ప్రాంతం నుంచి రోడ్డు మార్గంలో బయటపడిన కాసేపటికే.. నక్సలైట్లు హెలికాప్టర్‌ను పేల్చేశారు.
మనదగ్గరే ఎందుకు?
మన రాష్ట్రంలో ప్రయాణించే హెలికాప్టర్లకు తరచుగా ఇవే సమస్యలు. అది ప్రభుత్వ హెలికాప్టరైనా.. ప్రైవేటు దైనా.. ప్రాబ్లం మాత్రం ఒకటే. ఒక్కమాటలో చెప్పాలంటే.. హెలికాప్టర్ ప్రయాణం.. మన రాష్ట్రంలో ఏమంత సురక్షితమూ కాదు.. ఇంతకీ దీనికి కారణం ఏమిటి?
హెలికాప్టర్ ప్రయాణం రోడ్డు మీద కారులో వెళ్లినట్లు కాదు. ఎదురుగా రోడ్డు.. వెళ్లాల్సిన మార్గం కనిపించదు. కచ్చితంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చెప్పినట్లుగా వెళ్లాల్సి ఉంటుంది. హెలికాప్టర్ ప్రయాణానికి ముందే.. దిశ,దశ, ఎత్తుకు సంబంధించి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అనుమతులను సైన్యానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ సెంటర్ ఇస్తుంది. సైనిక హెలికాప్టర్ల ప్రయాణాలకు ఇబ్బందులు లేకుండా వీటిని రక్షణ శాఖ ఇస్తుంటుంది. ఇలా అనుమతి లభించిన తర్వాత మాత్రమే.. హెలికాప్టర్ ప్రయాణం మొదలవుతుంది. ఇలా గాల్లోకి లేచిన క్షణం నుంచే మనదగ్గర సమస్యలు మొదలవుతున్నాయి. రాష్ట్ర్లంలోని అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా ఎయిర్‌ఫీల్డ్‌లు, రాడార్ వ్యవస్థ మన దగ్గర లేదు. ఒక్కో రాడార్ పరిధి కొన్ని వందల కిలోమీటర్ల లోపునే ఉంటుంది. శంషాబాద్, బేగంపేట, విజయవాడ, వైజాగ్, తిరుపతిల్లో మాత్రమే రాడార్ కేంద్రాలున్నాయి. అయితే.. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్లాలంటే మాత్రం మనకు తిరుపతి రాడార్ వ్యవస్థ ఏమాత్రం ఉపయోగపడదు. కొండలు గుట్టలు అడ్డు రావడంతో.. చెన్నై ఏటీసీపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ.. ఈ రెండు ప్రాంతాల మధ్య చాలావరకూ హైదరాబాద్ నుంచి గానీ, చెన్నై నుంచి గానీ సిగ్నల్ ఉండదు. పైలెట్ల విచక్షణ ఆధారంగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వైఎస్ హెలికాప్టర్ దారి తప్పింది కూడా ఇలానే.
ఈ సమస్య పరిష్కారం కావాలంటే.. రాష్ట్రంలో ప్రతీ రెండు మూడొందల కిలోమీటర్లకు ఓ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్‌లలో ఈ తరహా వ్యవస్థలు ఎప్పటినుంచో ఉన్నాయి, కానీ మన దగ్గర మాత్రం ఇంకా రూపుదాల్చలేదు. ప్రభుత్వం చెబుతున్నట్లు.. ప్రధాన జిల్లాలో ఎయిర్‌పోర్టులు ఏర్పడితే తప్ప సమస్య పరిష్కారం కాదు. అప్పటివరకూ హెలికాప్టర్ ప్రయాణమంటే గాల్లో దీపమే. ఇలా హెలికాప్టర్లు మిస్ అయ్యాయన్న వార్తలు వస్తూనే ఉంటాయి.
ఇక మరో సమస్య రాడార్‌లో పర్యవేక్షణ లోపం. హెలికాప్టర్ ప్రయాణం మొదలైన దగ్గరనుంచి గమ్యస్థానం చేరేవరకూ.. రాడార్‌లో హెలికాప్టర్ కనిపిస్తూనే ఉంటుంది. దీన్ని అనుక్షణం పర్యవేక్షించడానికి ఓ సిబ్బంది ఉండాలి. రాడార్‌లో హెలికాప్టర్ మిస్ అయితే.. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి.. అందరినీ అలర్ట్ చేయాల్సి ఉంటుంది కానీ.. అదికూడా జరగడం లేదు.
రేడియో ఫ్రీకెన్సీలో సమస్యలు కూడా పైలెట్లకు, ఏటీసీకి మధ్య కమ్యూనికేషన్ లోపానికి కారణమవుతున్నాయి. విపరీతంగా సెల్‌టవర్లు పెరగడంతో రేడియో ఫ్రీక్వెన్సీ పొల్యూషన్ జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పైలెట్లు ఏటీసీని సంప్రదించలేకపోతున్నారు. కీలక సమయాల్లో కావల్సిన సమాచారాన్ని అందుకోలేక.. దారితప్పుతున్నారు. కొన్నిసార్లు ఇలానే ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సచిన్ భారతరత్నా !?: హవ్వ
ఏంటొ ఈ మధ్య ఈనాడు సచిన్ ను ఆకాసానికెత్తేస్తుంది భారతరత్న అనీ పలానా రత్న అనీ. దానికి ఊతంగా వివిధ ప్రముఖుల చేత ప్రకతనలు ఇప్పిస్తింది . ఇదంతా చూస్తుంటే సచిన్ కు భారతరత్న ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నట్లుంది . దానికి గానూ మీడియా జనాలను మానసికంగా సిద్దం చేస్తున్నట్లుంది . ఈ రోజు ఈనాడులో థాకరే ఏమన్నాడో తెలుసా? సచిన్ భారతరత్నమట ఆయనను మించిన రత్నాలు ఈ దేశంలో లేవట , అలాంటి రత్నాలు మహారాష్ట్రలోనే పుడతాయట .ఇక్కడ నేనేదో ప్రాంతీయాభిమానం రెచ్చగొడుతున్నానని అనుకోవద్దు ఎక్కడ పుట్టినా వాళ్ళు కూడా భారతీయులే కదా ! ఇక్కడ విషయం అదికాదు . గత కొద్ది కాలంగా (2001 నుండి ) భారతరత్న ప్రధానం జరగడం లేదు . అయితే మధ్యలో (2008) భీంసెన్ జోషి కి ప్రధానం జరిగింది . ఈ సంఘటనను మినహాయిస్తే దాదాపు తొమ్మిదేళ్ళుగా అవార్డు ప్రధానం జరగడం లేదు. అంటె ఆ అవార్డు పొందడానికి తగిన అర్హులు లేరు ఇప్పుడు సచ్చిన్ అనే క్రిడాకారుడు తన రికార్డులతో దేశం పరువును దిగంతాలకు వ్యాపింపజేస్తున్నాడట అందుకని భారతరత్న ను ఆయనకివ్వాలని కొంతమంది (microscopic minorities) డిమాండ్. గత అవార్డు గ్రహీతల ప్రతిభాపాటవాలను పరిశీలిస్తే వారి ప్రతిభ ( వ్యక్తిగత లేదా ప్రొఫెషనల్ ) ఈ దేశానికి ఏదొవిధంగా ఉపయోగపడింది. ఉదాహరణకు లతా మంగేష్కర్ నే తీసుకుంటే భారత - చైనా యుద్ద సమయంలో జవహర్ లాల్ నెహ్రు సమక్షంలో Ae Mere Watan Ke Logon ( " Oh, The People Of My Country ) అనే పాట పాడి వేలాది భారత సైనికులను ఉత్తేజ పరిచారు ఆ ఉత్తెజం తోనే వారు ఆ యుద్దంలో పాల్గొన్నారు ( ఆ యుద్దంలో భారత్ ఓటమి చెందడం వేరే సంగతి ). మరి సచిన్ సాధించిన ఆయన వ్యక్తిగత రికార్డులు ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఆయనే చెప్పాలి. కనీసం తన ప్రతిభతో ఈ దేశానికి ప్రపంచ కప్ కూడా సాధించి పెట్టలేకపోయారు . బహుశా ఆయనకు ప్రపంచ కప్ కంటే వ్యక్తిగత రికార్డులే ముఖ్యం కావచ్చు. కప్ సాధిస్తే ఆ క్రెడిట్ జట్టు అందరికీ చెందుంతుది మరి వ్యక్తిగత రికార్డులు అలా కాదు కదా ! ఎప్పటికీ ఆయన పేరు మీదనే ఉంటాయి. మరి అలాంటి వ్యక్తికి అవార్డు ఇవ్వాలనడం ఏం సమంజసం ? ఇంత కంటె గొప్ప్ వాళ్ళు ఎంతమంది లేరు ! భారతదేశంలో హరిత విప్లవానికి ( Green Revolution ) ఆద్యుడైన M, S. స్వామినాధన్ ను అందరూ మరిచిపొయారు. దేశాన్ని ఆహార ధాన్యాల కొరత నుండి కాపాడిన స్వామినాధంకు దక్కింది ఒక్క వ్యవసాయ కమిషన్ చైర్మన్ పదవి . హరిత విప్లవం మూలంగానే దేశంలో వరి, గోధుమల దిగుబడి గణనీయంగా పెరిగాయి . 1961 లో ఆయన నార్మన్ బోర్లాగ్ ను దేశానికి ఆహ్వానించకపోయినట్టైతే పరిస్తితి వేరే రకంగా ఉండేది . ఇక పోతె వర్గీస్ కురియన్ సంగతి ... ఈయన్ White Revolution కి ఆద్యుడు . ఆపరేషన్ ఫ్లడ్ పేరుతో గ్రామీన ప్రాంతాలలో కోపరేటివ్ సొసైటీలను స్తాపించి పాల విప్లవానికి నాంది పలికాడు. తద్వారా గ్రామీణ భారతాన్ని ఆర్ధిక పరిపుష్టం చెసాడు. ఇక మూడవ వ్యక్తి పి.వి. నరసిం హా రావు . ఈయన సంగతి అందరికీ తెలిసిందే . మరి ఇంతమందిని వదిలేసి సచిన్ కు భారతరత్న ఇవ్వడంలో ఏ లాబీయింగ్ పనిచేస్తుందో అర్ధం కావడం లేదు
చాలా బాగా రాశారు.. మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. మీ పేరు కూడా రాసి ఉంటే బాగుండేది. మీ పేరుతో డైరెక్ట్ పోస్ట్‌గా బ్లాగ్‌లో పెట్టేవాడిని..
కామెంట్లు కూడా అందరూ చదవుతారనుకోండి.