26, జనవరి 2010, మంగళవారం
వజ్రాల సీమ
బంగారు ఆభరణాలు ధరించాలనే కోరిక.. ఇప్పుడు రూటు మార్చింది. మనసును డైమండ్స్ వైపు పరుగులుపెట్టిస్తోంది. బంగారం కన్నా.. కాస్త ఎక్కువ ఖర్చు పెట్టగలగితే.. డైమండ్స్ కొనుక్కోవడమే మేలన్న కాన్సెప్ట్ ఇప్పుడు అందరిలోనూ పెరిగిపోయింది. అందుకే.. గత రెండు మూడేళ్లుగా.. వజ్రాభరణాలను కొనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. వజ్రాలకు సంబంధించి బిజినెస్ ఎక్కువగా జరిగేది మనదేశంలోనే. ప్రపంచంలోని ప్రతీ 12 వజ్రాల్లో.. 11 మనదగ్గరే పాలిష్ అవుతున్నాయి. ఆఫ్రికా దేశాలనుంచి.. ముడి వజ్రాలను భారీ ఎత్తున దిగుమతి చేసుకొని.. వాటిని సానబెట్టి.. మళ్లీ ఎగుమతులు ఎక్కువగా చేస్తోంది భారతదేశమే. గత డిసెంబర్ ఒక్క నెలలోనే.. 6011 కోట్ల రూపాయల విలువైన డైమండ్లు మనదేశం నుంచి ఎగుమతయ్యాయి. 2008 డిసెంబర్‌తో పోల్చితే.. ఇది దాదాపు 66 శాతం అధికం. ఈ ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే.. ఏప్రిల్ 2009 నుంచి డిసెంబర్ 2009 వరకూ.. మనం 85,700 కోట్ల రూపాయల విలువైన ముడి వజ్రాలను దిగుమతి చేసుకుని.. దాదాపు 94 వేల కోట్ల విలువైన సానబెట్టిన వజ్రాలను ఎగుమతి చేశాం. అంతభారీ పరిశ్రమ ఇది. భారతదేశంలో అమ్మడవుతున్న వజ్రాల్లోనూ.. సింహభాగం ఇతర దేశాలనుంచి దిగుమతి అవుతున్నవే. విశాలమైన మన భారతదేశంలో వెలికి తీస్తున్న వజ్రాల సంఖ్య అతిస్వల్పం. అయితే.. ఈ పరిస్థితి త్వరలోనే మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో భారీగా వజ్రపు నిక్షేపాలు
ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రం ఏదని ఎవరినైనా అడగండి.. అందరి దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒక్కటే. అదే కోహినూర్. బ్రిటీష్ మహారాణి కిరీటంలో స్థానం సంపాదించుకున్న ఈ అపూర్వ వజ్రం.. గనులెక్కువుగా ఉన్న ఆఫ్రికా ఖండానిది కాదు.. చరిత్రపుటల్లో ఘనమైన చరిత్ర ఉన్న మన భారత దేశానిదే. అందులోనూ.. మన తెలుగునేలపై లభ్యమైనదే. కృష్ణాతీరంలో దొరికిన ఈ ప్రకృతి ప్రసాదం.. కాలగర్భంలో.. ఎన్నో చేతులు మారి.. చివరకు బ్రిటీష్ రాణి సిగలో చేరింది. దీని విలువ కట్టడమూ అసాధ్యమే..
ప్రపంచంలోనే తొలిసారి వజ్రాలను సేకరించింది మన ప్రాంతంలోనే. 1730లో బ్రెజిల్‌లో వజ్రాల గనులను కనుగొనే వరకూ.. మన దగ్గర మాత్రమే డైమండ్స్ దొరికేవి. అందులోనూ.. గోల్కొండ సంస్థానం పరిధిలో దొరికే తెల్లని వజ్రాలకు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉండేది. ఇక శ్రీకృష్ణదేవరాయుల కాలంలో అయితే.. రత్నాలు రాసులుగా పోసి రోడ్లపైనే అమ్మేవారనే కథనం విస్తృతమైన ప్రచారంలోనూ ఉంది. ఇంత ఘన చరిత్ర ఉన్న మనదేశంలో.. వజ్రాల వెలికి తీత పెద్ద ఎత్తున ఎప్పుడూ జరగలేదు. ముఖ్యంగా కోహినూరుకు పుట్టినిల్లైన మనరాష్ట్రం.. ఈ విషయంపై ఎప్పుడూ సీరియస్‌గా దృష్టిపెట్టిన ఆనవాళ్లే కనిపించవు. వర్షాకాలం రంగురాళ్లు బయటపడడం.. జనం తండోపతండాలుగా వెళ్లి వెతుక్కోవడం చాలాకాలంగా మనం చూస్తున్నదే. అయినా.. శాస్త్రీయంగా వజ్రాలను వెలికితీసే ప్రయత్నం మాత్రం పెద్దగా జరిగింది లేదు.
ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్న భారత ప్రభుత్వం.. వీటి అన్వేషణనకు శ్రీకారం చుట్టింది. నేషనల్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల ఉత్పత్తి సంస్థ అయిన డీబీర్స్‌తో కలిసి దేశవ్యాప్తంగా పరిశోధనలు జరిపింది. జీఎస్‌ఐ సహాకారంతో జరిగిన ఈ పరిశోధనల్లో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, కర్నాటకల్లో వజ్రాల గనులు ఉన్నట్లు వెల్లడయ్యింది. మూడురాష్ట్రాల్లోనూ కలిపి 41 కింబర్లైట్, 13 లాంప్రోయిట్ పైప్స్ను తాజా అధ్యయనాల్లో గుర్తించారు. మన రాష్ట్రం విషయానికి వస్తే.. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ వజ్రాల గనులు బయటపడ్డాయి. ఎంతో శాస్త్ర్రీయంగా ఈ సర్వేను నిర్వహించారు.
మహబూబ్‌నగర్‌లోని కొత్తకోట, గద్వాల, ధరూర్, ఆత్మకూర్, అమరచింత, మరికల్ ప్రాంతాల్లోనూ, కర్నూలు జిల్లాలోని పాణ్యం, ఆదోని, ఎమ్మిగనూర్, మంత్రాలయం ప్రాంతాల్లోనూ, అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్, హదనూర్, హట్టి, కళ్యాణదుర్గం ఏరియాల్లో డైమండ్ నిక్షేపాలున్నట్లు ఈ పరిశోధనల్లో తేలింది. జీఎస్‌ఐ పరిశోధనల ఆధారంగా చూస్తే.. రాయలేలిన సీమ.. రతనాల సీమ కాదు.. వజ్రాల సీమ అని అభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చేలా ఉంది. తాజాగా గుర్తించిన ప్రాంతాల్లో త్వరలోనే.. వజ్రాల వెలికితీత పనులు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే.. మన గనుల నుంచి సేకరించే వజ్రాలనే ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు చేసే కాలం త్వరలోనే రాబోతుందన్నమాట.
వజ్రం జన్మరహస్యం
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నది నానుడి. వజ్రం గట్టిదనాన్ని ఒక్కమాటలో చెప్పే మాట ఇది. ఇంత కఠినమైన డైమండ్స్ రూపుదిద్దుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. అంతేకాదు.. భూమి పైపొరల్లో ఇవి తయారు కావు. ఉపరితలం నుంచి కొన్ని వందల కిలోమీటర్లు లోపలికి వెళ్లితే.. భూగర్భం కేంద్రం చుట్టూ విపరీతమైన వేడి... పీడనం ఉంటుంది. ఈ ప్రాంతాన్నే మ్యాంటిల్ అంటారు. ఇక్కడే కర్భన పరమాణువుల మధ్య.. సరికొత్త బంధాలు ఏర్పడి.. వజ్రంగా రూపుదిద్దుకుంటుంది. ఇదంతా.. వంద కోట్ల సంవత్సరాల క్రితమే జరిగిపోయింది. ఇలా ఏర్పడ్డ వజ్రాలు మ్యాంటిల్ చుట్టూ ఉండే.. క్రస్ట్ పొరలోకి చేరిపోయాయి.
భూమిలో సంభవించే మార్పుల కారణంగా.. దాదాపు 90 కోట్ల సంవత్సరాల క్రితం మ్యాంటిల్ నుంచి.. లావా భూమి పైకి గొట్టాల రూపంలో తన్నుకు వచ్చింది. ఇలా వస్తూవస్తూ.. భూగర్భంలోని వజ్రాలనూ తనతో పాటు తీసుకువచ్చింది. ఇలా వచ్చిన లావా చల్లబడి.. పైపుల మాదిరిగా ఘనీభవించాయి... ఇవే కింబర్లైట్ పైపులు. ఆఫ్రికా ఖండంలోని వజ్రాల గనులు పూర్తిగా ఈ కింబర్లైట్ పైపులే. మన రాష్ట్రంలో వెలుగుచూసిన వజ్రాల నిక్షేపాలు.. ఎక్కువగా ఈ పైపుల్లోనే ఉన్నాయి.
వీటిలోనూ కొన్ని భూమికి సమీపంలోనే ఉంటే.. మరికొన్ని భూమిలో కొంతదూరం వెళితే తప్ప కనిపించవు. ఇలాంటి వాటినీ.. జీఎస్‌ఐ సైంటిస్టులు.. ప్రత్యేక పరిశోధనల ద్వారా గుర్తించారు. ఎయిర్‌బోర్న్ సర్వేద్వారా కీలక ప్రాంతాల్లో ఈ గనులను గుర్తించారు. అయితే.. ప్రతీ కింబర్లైట్ పైపులోనూ వజ్రాలు ఉంటాయన్న గ్యారెంటీ లేదు. ఈ పైపులను గుర్తించిన తర్వాత.. మళ్లీ పరిశోధనలు చేసి.. అందులో డైమండ్స్ దొరికేదీ లేనిదీ తేల్చుతారు. ఇదంతా ఎంతో కాలంపాటు సాగే సుదీర్ఘ ప్రక్రియ.
భూమిపైన వజ్రాలు
మనరాష్ట్రంలో కృష్ణాతీరంలో చాలాచోట్ల వజ్రాలు దొరికాయి. మరి కింబర్లైట్ పైపుల్లో ఉండాల్సిన వజ్రాలు.. ఎలా బయటకు వచ్చాయి. దీనికి శాస్త్రీయమైన కారణాలే ఉన్నాయి. నదీ వేగానికి.. ఉపరితలంపైకి వచ్చిన ఈ లావా కరిగిపోవడంతో అందులోని వజ్రాలు నీటిప్రవాహానికి కొట్టుకువెళ్లి దిగువప్రాంతాల్లో చేరిపోయాయి. ఇలా వజ్రాలు దొరికే ప్రాంతాలు సాంకేతిక పదజాలంలో కంగ్లామరైట్స్ అంటారు. కృష్ణాజిల్లాతో పాటు, బనగానపల్లి, వజ్రకరూర్‌లో ఇలాంటి నిక్షేపాలున్నాయి.
గనులెప్పుడు తవ్వుతారు?
గనుల తవ్వకం అనుకున్నంత సులువు కాదు. ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. సాధారణంగా.. మూలకాల వెలికితీతను శాస్త్రవేత్తలు ఆర్థికపరమైన కోణంలో విశ్లేషిస్తారు. వెలికితీయడానికి అయ్యే ఖర్చుకు, సదరు మూలకం విలువను లెక్కేసి అంచనా వేస్తారు. మైనింగ్ ప్రక్రియ లాభం అనుకొంటేనే....ఎక్స్‌ప్లైటేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు. వజ్రాల విషయానికి వస్తే.. అత్యంత అరుదుగా లభిస్తాయి. పైగా.. ప్రతీ కింబర్లైట్ పైపులోనూ వజ్రాలు ఉండకపోవచ్చు. అందుకే.. గనుల తవ్వకం.. అనుకున్నంత ఈజీగా మొదలుకాకపోవచ్చు. అయితే...మన రాష్ట్రంలో మాత్రం డైమండ్ మైనింగ్ ఈసాంప్రదాయ పరిస్థితులకు భిన్నంగా... ఉందని చొప్పొచ్చు.అనంతపూర్, క్రిష్ణ, కర్నూల్ , కడప జిల్లాల్లో లబించిన వజ్రాల ఆధారంగా మైనింగ్ ఖర్చులపై శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు. కింబర్‌లైట్, లాంప్రోయిట్ స్ట్రక్చర్స్ నుంచి వజ్రాలు సేకరించే కన్నా కంగ్లామరేట్ నుంచి వజ్రాల వెలికితీతకే...ఎక్కువ ఖర్చుకానుందని మన రాష్ట్రంలో సర్వేనిర్వహించిన సంస్థలు జిఎస్‌ఐ, ఎన్‌ఎండీసి లు లెక్కలేస్తున్నాయి. అయితే ఒక్కవిషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రపంచప్రఖ్యాత కోహినూర్ వజ్రానికి పుట్టిల్లు మన రాష్ట్రమే కావడంతో డైమండ్స్ అంటూ దొరికితే భారీస్థాయిలోనే ఉంటాయనేది విస్పష్టం. పైగా వీటి క్వాలిటీ కూడా ఎక్కువగానే ఉండొచ్చు.
కింబర్లైట్‌లోని ప్రతి వంద చదరపు సెంటీమీటర్లలో కనీసం వంద క్యారట్ల డైమండ్‌లుండొచ్చన్నది ఓ అంచనా....ఇదే నిజమైతే..... వజ్రాల వెలికితీతలో మన రాష్ట్రం రికార్డులు నెలకొల్పడం ఖాయం. అంతేకాదు.. గనుల తవ్వకం మొదలైతే.. మన రాష్ట్రంలోనే డైమండ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. నేరుగా విదేశాలకు ఎగుమతులు చేయడానికి దగ్గరలోనే కృష్ణపట్నం నౌకాశ్రయం, హైదరాబాద్, చెన్నై ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉంటాయి కాబట్టి.. పరిశ్రమ పూర్తిగా మనదగ్గరకు తరలిరావచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
love reading your articles.
do we really need shipping industry to transport diamonds :) i thought thats one product which does nt have volume issues..