23, అక్టోబర్ 2009, శుక్రవారం
గోదారిలో ఓడలు
గోదారిలో ప్రయాణమంటే ఎంతో ఉత్సాహం వచ్చేస్తుంది. ఇసుక తిన్నెలపై నుంచి వచ్చే పిల్లగాలులు... భానుడి కిరణాలను ప్రతిబింబిచే.. గోదారి సొబగులు.. వాటి మధ్య.. పడవలో ప్రయాణం.. ఎప్పటికీ మరిచిపోలేనిదే. నాటు పడవలు.. మరబోట్లు.. లాంచీలు ఇలా ఎన్నో చూసిన... గోదారి గట్టు ప్రజలు.. త్వరలోనే.. ఓడలనూ చూడొచ్చు.
గోదారిలో ఎన్నిసార్లు ప్రయాణించినా తనివి తీరదు. మళ్లీ మళ్లీ పడవలో షికారుకు వెళ్లాలనిపిస్తుంది. ఉదయమైనా.. మిట్టమధ్యాహ్నమైనా.. సాయంత్రమైనా.. గోదారిలో ప్రయాణించడానికి ఏటైం అయినా ఓకే. గోదావరి మధ్యలో అలా అలా వెళుతూ.. చుట్టుపక్కల ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ.. సాగుతుంటే.. సమయమే తెలియదు.. అలసటన్నదే రాదు..రాజమండ్రినుంచి ప్రయాణం మొదలైతే.. భద్రాచాలం వచ్చేవరకూ ఎంతో సమయం పట్టినా.. కాలం గడిచిన విషయమే తెలియదు. రాజమండ్రి దాటాక వచ్చే... పట్టిసీమ ప్రత్యేకతే వేరు. వీరభద్రుడి శౌర్యానికి నిదర్శనంగా.. గోదారి ప్రవాహానికి ఎదురొడ్డి నిలిచినట్లు దర్శనమిస్తుంది ఆ స్వామి గుడి. పడవలోంచి చూస్తేనే.. అద్భుతంగా కనిపించే.. ఈ ఆలయానికి.. ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది. గోదారిలో ప్రయాణం.. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు అలవాటే. గట్టును ఆనుకొని ఉండే గ్రామాల వారు.. నిత్యం ఒక్కసారైనా.. పడవలో ప్రయాణిస్తూనే ఉంటారు. నదిలో నీటిప్రవాహం ఎక్కువగా ఉండే రోజుల్లో అయితే.. రాజమండ్రి నుంచి నేరుగా భద్రాచలం వరకూ షటిల్ సర్వీసులు కొనసాగుతూనే ఉంటాయి. ఇక పట్టిసీమ నుంచి మొదలయ్యే పాపికొండలు టూర్ కోసం... రాష్ట్రం నలుమూలల నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి.. పర్యాటకులు పరిగెత్తుకు వస్తుంటారు. అందుకే.. ఎప్పుడు చూసినా.. ఇక్కడ బోట్లు జనంతో కిటకిటలాడుతూనే ఉంటాయి. ఈ టూరిజం బోట్లే.. గోదావరిలో తిరిగే వాటిలో లేటెస్ట్మోడల్స్. వీటిని మించిన బోట్లను ఇప్పటి దాకా గోదారి చూడనే లేదు. అయితే.. ఈ పరిస్థితి త్వరలోనే మారిపోవచ్చు. అన్నీ అనుకూలిస్తే.. అఖండగోదావరిలోకి.. మహామహా ఓడలే ప్రయాణించే అవకాశం ఉంది. అవును.. నిజమే.. ఖండాంతరాల నుంచి.. కడలిమీదుగా తరలివచ్చే.. భారీ నౌకలన్నీ.. గోదారిలో ప్రయాణిస్తాయి.. గోదారి తీరానికి నౌకాయానాన్ని దగ్గర చేస్తాయి. గోదారిలో ఓడెక్కి.. దేశ విదేశాలను చుట్టేసి .. మళ్లీ గోదారిలోనే దిగేయవచ్చు.
నదుల్లోకి ఓడలను తీసుకురావడమన్నది మనకి కొత్త కాన్సెప్టే. మనరాష్ట్రంలోని నదులతో పోల్చితే.. గోదావరి వెడల్పు ఎక్కువగా ఉండడం.. గోదావరి నదిలో కలిసే చోటుకి.. కాకినాడ పోర్టు సమీపంలో ఉండడం... దీనికి అడ్వాంటేజ్. మనదేశంలో ఇప్పటివరకూ ఈ తరహా నౌకాయానం లేకపోయినా.. ఉత్తర అమెరికాలో మాత్రం దశాబ్దాలక్రితమే.. పురుడు పోసుకుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రస్తుతం అమలవుతోంది. సముద్రంలో నుంచి.. పెద్ద పెద్ద నౌకలు ఏ ఇబ్బందులూ లేకుండా.. నదుల్లోకి ప్రవేశిస్తున్నాయి. రవాణా వ్యవస్థను సమూలంగా మార్చేశాయి.ఈ తరహా వాటిలో అతిపెద్ద వ్యవస్థ ఉత్తర అమెరికాలోని.. సెయింట్ లారెన్స్ సీ వే.. అట్లాంటిక్ సముద్రం నుంచి భారీ నౌకలను.. ఉత్తర అమెరికాలోని గ్రేట్లేక్స్గా పిలిచే ఐదు సరస్సులకు తీసుకెళ్లే మహా రవాణామార్గం. దీనితో సుమారు 15,285 కిలోమీటర్ల నౌకామార్గం ఏర్పడింది. సుపీరియర్, మిచిగాన్, హురాన్, ఎరీ, ఒంటారియో సరస్సుల వృథా జలాలను సముద్రంలోకి తీసువేళ్లే నదే.. ఈ సెయింట్ లారెన్స్. ఒకప్పుడు.. చిన్నచిన్న పడవలే తిరిగే ఈ సరస్సుల్లో.. సీవే పుణ్యమా అని.. కార్గోషిప్లు కూడా ప్రయాణిస్తున్నాయి. 1909లో ఈ గ్రేట్లేక్స్ను సముద్రంతో అనుసంధించాలన్న ఆలోచన వచ్చింది. అయితే... ఎన్నో అడ్డంకులను దాటుకొని.. కార్యరూపం దాల్చేసరికి.. అరశతాబ్దం గడిచిపోయింది. చివరకు 1959లో ప్రారంభమయ్యింది. నదిలో ఏడుచోట్ల లాకులను ఏర్పాటు చేయడం ద్వారా.. అసాధ్యమనుకునే.. ఈ నౌకాయానాన్ని సుసాధ్యం చేయగలిగారు.
కేవలం.. సెయింట్లారెన్స్ మాత్రమే కాదు.. ఇదే టెక్నాలజీతో.. ప్రపంచంలోని ఎన్నో నదుల్లో నౌకల రవాణా సాకారమయ్యింది. ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న చైనా కూడా.. యాంగ్జీ నదిలోకి నౌకలను తీసుకువచ్చే.. మహా ప్రాజెక్టును సిద్ధం చేస్తుంది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన త్రీ గార్జెస్ డ్యాం వద్ద దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. సెయింట్ లారెన్స్ సీవేతో పోల్చితే.. దాదాపు 30 మీటర్ల వెడల్పు ఎక్కువ. దీనికోసం.. ఐదు చోట్ల రెండేసి చొప్పున లాకులను ఏర్పాటు చేశారు. షిప్ వచ్చినప్పుడు అటోమెటిక్‌గా ఇవి తెరుచుకుంటాయి.. లాక్ దాటగానే డోర్లు అటోమెటిక్‌గా మూసుకుపోతాయి. త్రీ గార్జెస్ డ్యాం మీదుగా నౌకలు ప్రయాణిస్తే.. దాదాపు నలభైశాతం మేర రవాణాఖర్చు తగ్గిపోవచ్చని చైనా అంచనా వేస్తోంది. ఏడాదికి.. కోటి 80 లక్షల టన్నులు సరుకు రవాణాను ఈ మార్గం ద్వారా చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది.
ఇది ఎలా సాధ్యం?
అయితే.. ఇక్కడే ఓ సమస్య ఉంది. సముద్ర నీటి మట్టానికి.. నది నీటిమట్టానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక.. సెయింట్ లారెన్స్ సీవేలో తీసుకుంటే.. ఐదు సరస్సుల్లో నీటి మట్టాలు.. ఒక్కోస్థాయిలో ఉంటాయి. కానీ... నౌకలు ప్రయాణించాలంటే.. ఒకే స్థాయిలో నీరు ఉండాలి. ఇందుకోసం ఓ అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించారు. నీటిమట్టాల్లో గరిష్ట వ్యత్యాసం ఉండే పాయింట్లను గుర్తించి లాకులు ఏర్పాటుచేశారు. ఈ లాకుల్లోకి వచ్చిన నౌకలను నీటి లెవెల్స్‌ను మార్చడం ద్వారా రివర్ లెవల్‌కు చేరుస్తారు. అత్యాధునిక టెక్నాలజీ సెల్ఫ్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా.. వీటిని నిర్వహిస్తారు. లాక్ వద్దకు షిప్ రాగానే.. మొదటి గేటు తెరుచుకుంటుంది... ఇక్కడ నీటిమట్టం.. సముద్రం నీటిమట్టంతో సమానంగా ఉంటుంది. ఓడను లోపలికి రాగానే.. గేటు మూసుకుంటుంది. తర్వాత.. అక్కడ వాటర్లెవల్ని పెంచుతారు. నది నీటిమట్టంతో సమానమవగానే.. రెండో గేటు తెరుచుకుంటుంది. అక్కడి నుంచి నదిలోకి ఓడ ప్రయాణాన్ని మొదలుపెట్టొచ్చు. ఇలా వాటర్ లెవల్ తేడాగా ఉన్న ప్రతీచోటా లాక్‌ను ఏర్పాటు చేయడం ద్వారా... నది నుంచి సముద్రానికి.. సముద్రం నుంచి నదిలోకి ఓడలను పంపించవచ్చు. ఇలా సెయింట్ లారెన్స్‌లో ఏడు లాకులు.. త్రీ గార్జెస్ దగ్గర ఐదు లాకులు ఉన్నాయి. మరో ప్రాజెక్టైన రైన్ డాన్యూబ్లో ఏకంగా 67లాకులు ఏర్పాటయ్యాయి. కానీ.. మన గోదావరిలో మాత్రం.. పది లాకులు ఏర్పాటు చేస్తే చాలు.. సముద్రం నుంచి ఓడలను.. నదిలోకి తీసుకువచ్చేయచ్చు.. మొత్తం 750 కిలోమీటర్ల మేర గోదారిలో నౌకల ద్వారా రవాణాను సులభతరం చేయొచ్చు.
గోదారిలో సాధ్యమేనా?
గోదావరి మధ్యలో సరస్సులేవీ లేవు కాబట్టి.. ధవళేశ్వరం నుంచి.. శ్రీరాం సాగర్ దాకా నౌకలు ప్రయాణించడానికి సరిపడా నీటిని నిల్వ ఉంచాల్సి వస్తుంది. దీనికోసం.. కొన్ని బ్యారేజీలను గోదావరిలో నిర్మించాల్సి ఉంటుంది. ఇప్పటికే గోదావరిపై ధవళేశ్వరం బ్యారేజ్ ఉండగా.. పోలవరం, ఎల్లంపల్లి, కంతనపల్లి, దుమ్ముగూడెం వద్ద ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి కొన్ని మార్పులు చేయడంతో పాటు.. అదనంగా మరో ఆరు బ్యారేజీలను నిర్మించాల్సి ఉంటుంది. ముఖ్యంగా.. కడెం నది గోదావరిలో కలిసేచోటైన పెద్ద చెల్లాల, మహదేవపురం సూరారం, ఎదిరతో పాటు... భద్రాచలం ఎగువన, కూనవరం వద్ద, శబరి నదిపైనా.. వీటిని నిర్మించాల్సి ఉంటుంది. ఒక్క పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుతో వీటన్నింటినీ నిర్మించవచ్చంటున్నారు.. ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదిస్తున్న నీటిపారుదల నిపుణుడు టి.హనుమంతరావు. అంతేకాదు.. పోలవరం నిర్మించడం ద్వారా మునిగిపోయే ప్రమాదంలో ఉన్న 293 గ్రామాలనూ కాపాడవచ్చని చెబుతున్నారు. ఇరిగేషన్ శాఖ ఛీఫ్ ఇంజనీర్‌గా రాష్ట్రానికి సేవలందించిన హనుమంతరావు రిటైరైన తరువాత స్టెప్ లాడర్ టెక్నాలజీ పేరుతో ఈ ప్రతిపాదనను 1996లోనే ప్రభుత్వం ముందుంచారు. ఇతర రాజకీయపక్షాలు కూడా దీనిని సమర్ధించాయి. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని మొత్తుకున్నాయి. కానీ.. ప్రాజెక్టుకు ఆమోదం మాత్రం పడలేదు.
ఎంతోకాలంగా.. అటకెక్కి బూజు పట్టిపోయిన ఈ ప్రాజెక్టు మళ్లీ చర్చలోకి రావడానికి కారణం తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ప్రాంతంలోని చాలా ప్రాంతాలు ఇంకా అభివృద్ధికి దూరంగానే ఉండడంతో.. దీనిపై వీరంతా దృష్టి సారించారు. గోదావరిలోకి నౌకలు రావడం మొదలైతే.. నదీతీర ప్రాంతాల స్వరూపమే మారిపోతుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ముఖ్యంగా భద్రాచలం దిగువ నుంచి సముద్రంలో కలిసేదాకా.. ఏకరీతిన గోదారి ప్రవాహం సాగుతుంది. ఈ నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేయడానికి బ్యారేజీలను నిర్మిస్తే.. సమస్య చాలావరకూ పరిష్కారమవుతుంది. నౌకలు ప్రయాణించడానికి అవసరమైన నీటిని కూడా.. గోదావరి పొడుగునా.. నిల్వ చేయవచ్చు. ఇక నౌకారవాణా ద్వారా.. మన ఉత్పత్తులను విశ్వవిపణిలోకి నేరుగా పంపించుకునే అవకాశం ఉంటుంది.
గోదారిలోకి షిప్పులు వస్తే మనకేంటి లాభం?
ఇప్పటికే... రోడ్లపై విపరీతమైన రద్దీ నెలకొంది. కొత్తగా రోడ్డు నిర్మిస్తున్నా.. మన అవసరాలకు సరిపోవడం లేదు. పైగా మాటిమాటికీ పెరుగుతున్న డీజిల్ ఛార్జీలు.. ట్రాన్స్‌పోర్టు ఛార్జీలను సామాన్యులకు అందకుండా చేస్తున్నాయి. ప్రపంచం మొత్తంమీద అతి చౌకైన రవాణా జల రవాణానే కాబట్టి.. ఈ నౌకలు గోదావరిలోకి వస్తే.. అతి తక్కువ ఖర్చుతో.. ఎక్కువ ఉత్పత్తులను రవాణాచేసే అవకాశం ఉంది... ఒక్కో కార్గోషిప్‌లో.. 25 వేల మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేయొచ్చు. ఇది దాదాపు 225 రైలు బోగీలకు సమానం.. ఇంకా చెప్పాలంటే.. 870 ట్రక్కుల్లో పట్టే లోడ్‌ను ఒక్క షిప్‌ద్వారా తరలించవచ్చు. దీన్ని బట్టి.. రవాణా ఖర్చు ఎంత తగ్గుతుందో ఊహించుకోవచ్చు. ఇదే సమయంలో.. కాలుష్యాన్ని కూడా చాలావరకూ తగ్గించవచ్చు. 870 ట్రక్కులతో పోల్చితే.. ఓ నౌక విడుదల చేసే.. కాలుష్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఓ రకంగా.. సముద్రాల్లో ఉంటే.. పోర్టులను.. గ్రామగ్రామానికి తీసుకువచ్చినట్లే. మన దగ్గర ఉన్న పరిశ్రమలు కూడా దేశ విదేశాల నుంచి తక్కువ ఖర్చుతోనే ముడిసరుకులను దిగుమతి చేసుకోవచ్చు. ఈ నౌకాయానానికి గోదావరి సిద్ధం చేయడం వల్లో మరో రెండు ప్రయోజనాలు కలగనున్నాయి. మొదటిది.. జలవిద్యుత్. గోదావరిపై నిర్మించే.. తొమ్మిది బ్యారేజ్‌ల్లో .. ఒక్కో దాని నుంచి 300 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. అంటే రాష్ట్ర అవసరాల్లో దాదాపు సగం విద్యుత్‌ను ఈ తొమ్మిది బ్యారేజ్‌లో అందించే అవకాశం ఉంది. అంతేకాదు బ్యారేజీల నుంచి.. రక్షిత మంచినీటిని కూడా.. గోదావరి తీర గ్రామాలకు సరఫరా చేయవచ్చు. గోదారిలో నౌకామార్గం ఏర్పడితే.. ఈ ప్రాంతమంతా.. ప్రత్యేక ఎకనామిక్ జోన్‌గా ఏర్పడుతుంది. విదేశాల నుంచి.. పరిశ్రమలు పెట్టడానికి కంపెనీలు ముందుకు వస్తాయి. నిరుద్యోగ సమస్య చాలావరకు పరిష్కారమవుతుంది. అంతేకాదు.. మత్స్యసంపద కూడా గణనీయంగా పెరుగుతుంది. సముద్రం నుంచి.. నదిలోకి నిరంతరం నీటిప్రవాహం ఉండడం వల్ల.. చేపలు.. ఇతర రకాలు.. నదుల్లోకి వచ్చి చేరతాయి. విదేశాల్లో ఇప్పటికే ఇది సాద్యమని నిరూపణ కూడా అయ్యింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
what a beautiful, informative article.
loved your blog. uwrite like a professional journalist.
సముద్రపు ఓడలు అమజాన్ నదిలో తిరుగాడుతున్నాయి. ఇంకా పనామా, సూయజ్ కెనాల్ లలోకూడా లాకుల వ్యవస్థ ద్వారా నీటిమట్టాన్ని నియంత్రించి పెద్ద ఓడలు నడుపుతున్నారు. గొదావరిలో పెద్ద ఓడలను స్వాగతించాలి. అయితే మనకున్న ఎర్రటేపు వ్యవస్థలో ఇది ఎప్పటికి సాధ్యమో!