17, అక్టోబర్ 2009, శనివారం
హైదరాబాద్‌లో ఎన్నికలు డౌటే?
Categories :
రెండేళ్ల నుంచి నానుతున్న గ్రేటర్ ఎన్నికలు మరోసారి తెరపైకి వచ్చాయి. గ్రేటర్ వార్డుల పునర్విభజన జరగడం... రిజర్వేషన్లు ఖరారు చేసిన ప్రభుత్వం రెండు నెలల క్రితమే... ఎన్నికలకు సిద్ధమయ్యింది. అయితే.. రిజర్వేషన్లపై అభ్యంతరాలతో.. రాజకీయపార్టీలు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఎన్నికల ప్రక్రికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీనిపై... సుప్రీకోర్టు నుంచి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ తెచ్చుకుని .. మళ్లీ ఎన్నికలపై ఆశలు మొలకెత్తించింది.నోటిఫికేషన్ ఎప్పుడు వెలవడుతుందన్నది కచ్చితంగా తెలియకపోయినా.. ఈ నెలాఖరులోగా రావచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే.. గత రెండేళ్లుగా గ్రేటర్‌ఎన్నికలపై కొనసాగుతున్ననాన్చుడి ధోరణిని ప్రభుత్వం కొనసాగిస్తే మాత్రం.. ఈలోగా నోటిఫికేషన్ రాకపోవచ్చు. ఇప్పటికే.. అధికారులు సన్నాహాలు పూర్తిచేయడంతో.. ఎన్నికలకు హైదరాబాద్ ఎపుడో సిద్ధమయ్యింది. ఇక రెడీ అవ్వాల్సింది.. ప్రభుత్వమే. సర్కార్‌నుంచి సిగ్నల్ వస్తే.. నెలరోజుల్లోగా.. అన్నీ పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్ కూడా ఎప్పుడో తన సన్నద్ధతను తేల్చి చెప్పింది. పోలీస్,రెవన్యూ అధికారులతో.. ఇప్పటికే సమీక్షలనూ నిర్వహించింది.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో.. చుట్టుపక్కల ఉన్న 12మున్సిపాలిటీలు, 8 గ్రామపంచాయతీలు విలీనం కావడంతో.. గ్రేటర్ హైదరాబాద్ ఆవిర్భవించింది. 2007లో ఇలా గ్రేటర్‌గా మారే సమయానికే.. హైదారాబాద్ కౌన్సిల్ పదవీకాలం పూర్తయ్యింది. దీంతో ఎన్నికలు జరపాల్సి ఉన్నా.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చింది. చివరకు.. ఈ ఆగష్టులో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.. నగరంలో విస్తృతంగా పర్యటించారు. అయితే.. రిజర్వేషన్ల వ్యవహారం కోర్టును చేరడంతో.. ఎన్నికలు వాయిదా పడ్డాయి. వెంటనే రంజాన్ రావడం.. ఆ తర్వాత.. స్వైన్‌ఫ్లూ, డెంగ్యూ వ్యాధుల విజృంభణతో కొంతకాలం పాటు ఎన్నికల ప్రకియ నిలిచిపోయింది. ఈలోగానే.. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోవడంతో.. పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది.
ఇది ప్రజాస్వామ్యమేనా?
ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేవి ఎన్నికలే. మనది గొప్ప ప్రజాస్వామిక దేశమని ఘనంగా చెప్పుకుంటాం గానీ.. ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం.. పరిస్థితి తారుమారవుతోంది. దీనికి నిదర్శనమే.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. ఐదేళ్లకోమారు కచ్చితంగా ఎన్నికలు జరగాల్సి ఉన్నా... దాన్ని పట్టించుకున్న ప్రభుత్వాలు మాత్రం లేవు. అధికారంలో ఉన్న వారికి అనుకూలమైన పరిస్థితులు ఉంటే తప్ప.. ఎన్నికలు కార్యరూపం దాల్చవు. 1969 తర్వాత నుంచి.. పరిస్థితి ఇలానే ఉంది. అప్పుడు ఎన్నికైన కౌన్సిల్ పదవీకాలం ముగియగానే... అంటే.. 1974లో జరగాల్సిన ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తెలంగాణ ఉద్యమం సాకుగా చూపించి.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించలేదు. ఇలా పుష్కర కాలం గడిచాక గానీ... రాష్ట్ర రాజధానిలో మళ్లీ ఎన్నికలు జరగలేదు. 1986లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎలక్షన్స్ జరిగాయి. దాని తర్వాత.. మళ్లీ.. ఎన్నికలు జరిగింది 2002లోనే. ఈసారి కాంగ్రెస్, టీడీపీలు కూడా తమ స్వలాభాన్నే చూసుకున్నాయి. 1994, 1999లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా.. 2002 వరకూ.. ఎన్నికల విషయాన్నిమాత్రం పట్టించుకోలేదు. గెలుస్తామని నమ్మకం వచ్చిన తర్వాతే.. ఎన్నికలు నిర్వహించింది.
ఇక ఇప్పటి సంగతికొస్తే.. మళ్లీ అదే సీన్. రెండోసారి అధికారంలోకి రావడం.. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ హవా కొనసాగడంతో.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.. ఎన్నికలకు సిద్దమయ్యారు. ఆగస్టులోనే.. దీనికోసం.. హైదరాబాద్‌లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అయితే.. పనులు మాత్రం మొదలుకాలేదు. వీటిని పూర్తి చేయకపోతే.. విజయం కష్టమన్న భావన కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ప్రస్తుతం మంత్రులను కూడా ఇదే విషయం కలవరపెడుతోంది. దీనికి తోడు.. వైఎస్‌లా హైదరాబాద్‌లో ప్రచారం చేయగల ఛరిష్మా ఉన్న నేత లేడు. హైదరాబాద్ మొత్తానికి బాధ్యత తీసుకోగల నాయకుడూ లేడు. ఎన్నికలను నిర్వహించడానికి.. కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేయడానికి ఇదే పెద్ద కారణం. ఒకవేళ హైదరాబాద్‌లో ఓడిపోతే.. ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురవ్వవచ్చని కాంగ్రెస్ పార్టీ భావించడమూ మరో కారణం కావచ్చు.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి.. దాదాపు 725 చదరపు కిలోమీటర్ల ప్రాతం వచ్చి చేరింది. ఈ ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేయడానికి నిర్వహించడానికి.. ఎన్నో పనులు చేపట్టాల్సి ఉంది. ఎన్నికలు జరగకపోతే.. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వమే చక్కపెడుతోంది. అదే ఎన్నికలు జరిగితే.. కౌన్సిల్ ఆధ్వర్యంలోకి ఇవన్నీ వెళ్లిపోతాయి. ఎన్నికలను వాయిదా వేయడానికి ఇదీ కారణమే అంటున్నారు... కాంగ్రేసేతర పార్టీల నాయకులు.
ఎన్నికల కోసం.. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడూ ఉత్సాహంగానే ఎదురుచూస్తుంటాయి. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలనుకుంటాయి. అయితే.. హైదరాబాద్ విషయంలో మాత్రం పార్టీల ఆలోచనాతీరు మారిపోయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోనూ గ్రేటర్ ఎన్నికలపై నిరాసక్తత కనిపిస్తోంది. ఈసారి మేయర్ ఎన్నిక జరిగేది.. పరోక్ష పద్దతిలోనే కాబట్టి.. ఆ సీటు దక్కుతుందన్న అంచనాలు తెలుగుదేశానికి లేవు. మేయర్ స్థానాన్ని పొందాలంటే.. హైదరాబాద్‌లోని మొత్తం 150 వార్డుల్లో సగానికిపైగా సీట్లు రావాలి. అయితే.. ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్లు కూడా ఇక్కడ కీలకమవుతాయి. ఈ కేటగిరీలో ఇప్పటికే కాంగ్రెస్ చేతిలో 30 దాకా ఓట్లున్నాయి. కాబట్టి... కార్పొరేటర్లు తక్కువమంది గెలిచినా.. మేయర్ పదవిని అధికారపక్షం తన్నుకుపోయే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. హైదరాబాద్‌లో టిడీపీ పెద్దగా విజయాన్ని దక్కించుకోలేకపోయింది. దీనికి తోడు.. పార్టీ టికెట్ల కేటాయింపు విషయంలోనూ లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఖర్చు కూడా పెద్దమొత్తంలోనే పెట్టాల్సి వస్తుంది. ఎన్నికల్లో పరాజయం తర్వాత.. ఇప్పుడిప్పుడే... తిరిగి శక్తిసామర్థ్యాలను కూడగట్టుకుంటున్న టిడిపీ.. గ్రేటర్‌లో ప్రయోగాలకు దూరంగా ఉండాలనుకొంటోంది. అందుకే.. ఎన్నికలు తక్షణం జరపాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదు.
మరో కీలక పార్టీ తెలంగాణ రాష్ట్రసమితి కూడా.. గ్రేటర్ ఎన్నికలు జరగకపోతేనే నయమనుకొంటోంది. హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ బలహీనంగా ఉండడమే దీనికి కారణం. పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ.. రాజధానిలో ఈ పార్టీకి పట్టుచిక్కలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలూ టిఆర్‌ఎస్‌ను నిరాశకు గురిచేశాయి. ఈసారి పోటీ చేసినా.. పెద్దమొత్తంలో సీట్లు గెలుచుకుని.. మేయర్ పదవిని దక్కించుకునే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో పెద్దగా సీట్లు దక్కించుకోకపోతే.. ప్రత్యేక ఉద్యమంపై ఆ ప్రబావం పడుతుందన్న ఆందోళనా.. పార్టీ నేతల్లో కనిపిస్తోంది. అందుకే.. వీలైనంతవరకూ ఎన్నికలు జరగకూడదనే కోరుకుంటోంది.. తెలంగాణ రాష్ట్ర సమితి. అయితే.. ఎన్నికలు నిర్వహించకపోవడం వెనక మాత్రం.. కాంగ్రెస్ అంతర్గత రాజకీయమే కారణమంటూ వాదిస్తున్నారు టిఆర్‌ఎస్ నేతలు.
ఇక పీఆర్పీ పరిస్థితికొస్తే.. పరిస్థితి మరీ దారుణం. అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయినట్లైన ఈ పార్టీ.. గ్రేటర్ ఎన్నికలకు దూరంగానే ఉంటోంది. హైదరాబాద్‌లో తగినంత బలం లేకపోవడం.. క్యాడర్ బలహీనంగా ఉండడంతో.. ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన గణనీయంగా సీట్లు గెలుచుకునే పరిస్థితి మాత్రం లేదు. అందుకే పీఆర్పీ కూడా.. ఈ విషయంలో పెద్దగా తన గళాన్ని వినిపించడం లేదు. ఇక లోక్‌సత్తా, సీపీఐ, సీపీఎంల విషయానికొస్తే.. వాటి సంగతీ ఇంతే. కొన్నిస్థానాల్లో తప్ప అన్నింటా గెలిచే సత్తా వీటికి లేదు. బిజేపీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నా.. ఆ పార్టీ బలం అందరికీ తెలిసిందే. అందుకే.. అనవసర ఖర్చుకు వెనకడుగు వేస్తున్నాయి రాజకీయపార్టీలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి