29, జూన్ 2009, సోమవారం
బడ్జెట్‌లో పన్నులు విధిస్తారా?
అసలే ఆర్థికమాంద్యం.. నిధుల కోసం కటకట.. ఆదాయాన్ని ప్రభుత్వం గణనీయంగా పెంచుకోవాల్సిన పరిస్థితి.. మరోవైపు.. ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది మంది.. సంక్షోభంలో చిక్కుకుంటున్న వ్యవసాయం.. పూటగడవడమే కష్టంగా మారిన దుస్థితి.. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న జనం.. ఇలా రెండు విభిన్నమైన పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో పెద్దదిక్కుగా వ్యవహరించే ప్రణబ్.. కష్ట కాలంలో ఉన్న దేశాన్ని కాపడతారా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ప్రత్యేకంగా పన్నులు విధించే అవకాశాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఓ రకంగా, కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీని ఓటర్లు కట్టబెట్టినందుకు ఆ పార్టీ కృతజ్ఞతలు చెప్పుకునే అద్భుతమైన అవకాశం ఈ బడ్జెట్. అందుకే, జనరంజకంగానే బడ్జెట్ ఉండొచ్చన్న ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థికమాంద్యం, నెగిటివ్ ద్రవ్యోల్భణం పద్దులను చికాకు పరుస్తున్న నేపథ్యంలో.. ప్రజాసంక్షేమానికే ఎక్కువ కేటాయింపులను చేయాలన్న అభిప్రాయం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీది. ఈ దిశగా సంకేతాలు పార్లమెంట్ ఉభయ సభల సమావేశంలో రాష్ట్రపతి నోటి వెంట ఇవ్వగలిగింది మన్మోహన్ సర్కార్. మఖ్యంగా వృద్ధిరేటును పెంచడం ప్రభుత్వం ఉన్న ప్రధాన లక్ష్యం. ఆర్థిక ఒడిదుడుకుల మధ్య గత ఏడాది 6.7 శాతం వృద్ధినే అందుకోగలిగాం. దీన్ని మళ్లీ 8 నుంచి 9 శాతానికి తీసుకురావాలంటున్నారు మన్మోహన్‌సింగ్. ఆ దిశ ప్రయత్నాలు ఈ బడ్జెట్ నుంచే మొదలుకానుంది. అంటే ఉత్పాదక రంగాలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు.
ఆహార భద్రతకు పెద్ద పీట
కాంగ్రెస్ ఎన్నికల హామీ.. ఆహార భద్రతను నిలబెట్టుకోవాల్సి ఉంది. ప్రతీ కుటుంబానికి 25 కిలోల బియ్యం గానీ, గోధుమలు కానీ.. కిలో మూడు రూపాయలకే ఇస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. దీనికోసం భారీ మొత్తాన్ని ప్రణబ్ కేటాయించాల్సి ఉంది. ఉపాధి రంగాలను, గ్రామీణాభివృద్ధిని, వ్యవసాయాన్ని మరిచిపోమని ప్రణబ్‌ముఖర్జీ ఇదివరకే ప్రకటించారు.
కొత్తగా పన్నులు?
అసలే మనది లోటు బడ్జెట్.. ఈ పథకాలన్నింటికి, నిధులు తేవాలంటే.. కచ్చితంగా పన్నులు వేయాల్సిందే. కానీ, ఎన్నికలు జరిగిన ఏడాదికే, పన్నులు వేస్తే.. అది ప్రజల్లో అపార్తానికి దారి తీస్తుంది కాబట్టి, ఇతర మార్గాలను మన్మోహన్ సర్కార్ అన్వేషిస్తోంది. కాబట్టి, కొత్తగా పన్నులు పడతాయని కంగారు పడనవసరం లేదు. మరి నిధులెక్కడినుంచి వస్తాయన్న అనుమానం రావచ్చు.. బిహెచ్‌ఈఎల్ తరహా.. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను ఉపసంహరించుకోవడానికి సిద్ధమవుతోంది. ఇక 3జి స్పెక్ట్రమ్ కేటాయింపుల ద్వారా 25 వేల కోట్లకు పైగానే నిధులు ఖజానాకు జమ కానున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ప్రభుత్వ రంగ సంస్థల వాటా అమ్మకం అంత సరియైన నిర్ణయం కాదు.స్పెక్ట్ర్రమ్ అమ్మకం ఓ విధంగా ఓకే.ఆ విషయంలో ప్రస్తుతానికి బానే తార్చారం అయ్యింది కాబట్టి, ఇక దాన్ని తేల్చటం ఉత్తమం.
పన్నుల పేరెత్తిదే బాగాదు కాబట్టి - టాక్సు పేయర్లని మరింత విస్తారమైన జాలంతోనో, ట్రాలర్లతోనూ పట్టుకోవడమే మార్గం. ఇది చాలా కాలంగా చేస్తున్న ఆలోచనే. అదే కొనసాగవచ్చు. UIN దానికి ఉపయోగపడుతుంది. అందుకే, నందన్ నీలకెనీ నియామకం కీలకమైనదే. ఆయన పాలిటిక్సులో రావడానికి ప్రయత్నిస్తున్నాడన్నద్ది తెలుస్తునే ఉంది.నిజంగా ఏదన్నా సాధించి వస్తే బావుంటుది.